Lesson 17
నీకు బహుశా తెలియును, సీనాయి పర్వతపు మహా కూటమినందు, దేవుడు మోషేకు పది ఆజ్ఞల నిచ్చెను. అదే సమయములో మోషేకు ఇప్పటివరకు నిర్మించిన మర్మమైన నిర్మాణాలలో అత్యంత మర్మమైన ఒక నిర్మాణానికి నమూనాలను కూడ యిచ్చెనని నీకు తెలియునా? దీనిని ప్రత్యక్ష గుదారము అని పిలుస్తారు, ఇది ఆయన ప్రజలలో దేవుని నివాస స్థలాన్ని సూచించే ఒక ప్రత్యేకమైన ఆలయం. దాని మొత్తం రూపకల్పన మరియు సేవలు ఈ విముక్తి పొందిన బానిసల రక్షణ ప్రణాళిక యొక్క మూడు - పరిమాణముల సమగ్ర సాదృశ్యమును సూచించుచున్నది. ప్రత్యక్ష గుదారపు సేవ యొక్క రహస్యాలను పరిశీలిస్తే, యేసు ప్రభువు నశించినవారిని ఎలా రక్షిస్తాడు మరియు సంఘమును ఎలా నడిపిస్తాడు అనే దానిపై నీ అవగాహనను పటిష్టం చేస్తుంది. అనేక అద్భుతమైన ప్రవచనాలను అర్ధం చేసుకోవడానికి కూడా ఈ ప్రత్యక్ష గుడారము ఒక కీలకమైన అంశము. ఈ అద్భుతమైన స్టడీ గైడు పత్రిక గుడారము మరియు అందులో దాగియున్న దాని మర్మముల అర్థాలను అన్వేషిస్తుండగా అద్భుతమైన సాహస ప్రయాణం నీ కొరకు ఎదురుచూస్తోంది!
"నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను" (నిర్గమకాండము 25:8).
జవాబు : ఒక పరిశుద్ధ స్థలమును (ప్రత్యక్ష గుడారమును) నిర్మించమని ప్రభువు మోషేతో చెప్పెను, ఇది పరలోకపు దేవునికి నివాస స్థలముగా ఉండుటకు ఒక ప్రత్యేక కట్టడము.
ప్రత్యక్ష గుడారము యొక్క క్లుప్తమైన వివరణ
అసలు పరిశుద్ధ స్థలము ఒక సొగసైన కట్టడమైయుండి, ఒక గుడార ఆకారపు నిర్మాణము (పొడుగు సుమారు అరవై ఏడున్నర (671/2) అడుగులు, మరియు వెడల్పు ఇరవై రెండున్నర (221/2) అడుగులు), దీనిలో దేవుని సన్నిధి నిండుకొని ప్రత్యేక సేవలు జరిగాయి. దాని ప్రాకారములు (గోడలు) వెండి దిమ్మలలో అమర్చబడి నిటారుగా ఉన్న తుమ్మకఱ్ఱ పలకలతో తయారు చేయబడినవి, మరియు బంగారు రేకులతో పొదిగింపబడి యున్నవి, (నిర్గమకాండము 26:15-19, 29). పైకప్పు నాలుగు రకముల కప్పులతో తయారు చేయబడింది: సన్నపునార, మేక వెండ్రుకలు, పొట్టేలు తోలు, మరియు సముద్రవత్సల తోలు (నిర్గమకాండము 26:1, 7-14). దీనికి రెండు గదులు ఉన్నాయి: పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము. మందము గల, బరువైన పరదా లేదా తెర ఆ గదులను వేరు చేసింది. గుదారము చుట్టూ ఉన్న ఆవరణము సుమారు 225 అడుగుల పొడుగు మరియు నూట పండ్రెండున్నర (1121/2) అడుగుల వెడల్పుతో ఉన్నది, (అనగా పొడుగు 100 మూరలు, వెడల్పు 50 మూరలు, మరియు యెత్తు 5 మూరలున్నది) (నిర్గమకాండము 27:18). ఆవరణము 60 ఇత్తడి స్తంభముల ఆధారము ఉన్న తెల్లని పేనిన సన్నటి నారబట్ట తెరలతో కంచె వేయబడింది (నిర్గమకాండము 27:9-16).
"దేవా, నీ మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడ నున్నాడు?" (కీర్తనలు 77:13).
జవాబు : దేవుని మార్గము, లేదా రక్షణ ప్రణాళిక, భూసంబంధమైన గుడారపు సేవలో తెలుస్తుంది. ప్రత్యక్ష గుడారములోని ప్రతిదీ - దేవుని నివాసము, ఉపకరణములు మరియు సేవలు - మనలను రక్షించడంలో యేసు చేసిన పనికి సాదృశ్యరూపాలని బైబిల్ బోధిస్తుంది. గుడారమునకు సంబంధించిన సాదృశ్యరూపాలను మనం పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు రక్షణ ప్రణాళికను మనం పూర్తిగా అర్ధం చేసుకోగలమని దీని అర్థం. అందువల్ల, ఈ స్టడీ గైడ్ పత్రికను అధ్యయనము చేయుట ఎంతో ప్రాముఖ్యము.
3. మోషే ప్రత్యక్ష గుడారము కొరకు నమూనాలను ఎవరి నుండి పొందెను? కట్టడము దేని ప్రతిరూపము?
"మేము వివరించుచున్న సంగతులలోని సారాంశమేదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయెను.” “మోషే గుడారము అమర్చబోయినప్పుడు కొండమీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు" (హెబ్రీయులకు 8:1, 2, 5).
జవాబు : దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారము యొక్క నిర్మాణ వివరాలను యిచ్చెను. పరలోకములో ఉన్న అసలు గుడారము యొక్క ఛాయారూపకము లేదా ప్రతిరూపము.
4. ఆవరణములో ఏ ఉపకరణములు ఉన్నవి?
జవాబు:
A. దహన బలిపీఠము, అక్కడ జంతువులను బలి ఇవ్వడం జరుగుతుంది, ఆవరణ ప్రవేశ ద్వారం లోపల ఇది ఉన్నది (నిర్గమకాండము 27:1-8). ఈ బలిపీఠం క్రీస్తు సిలువను సూచిస్తుంది. బలిపశువు అంతిమ బలియైన యేసును సూచిస్తుంది (యోహాను 1:29).
B. గంగాళము, బలిపీఠము మరియు ప్రత్యక్ష గుడారము మధ్య ఉన్నది, అది శుద్దీకరణ చేసుకొనుటకు ఇత్తడితో తయారు చేయబడిన పెద్ద నీళ్ల తొట్టి. ఇక్కడ యాజకులు బలి అర్పించడానికి లేదా గుడారములోనికి ప్రవేశించే ముందు చేతులు, కాళ్లు కడుకుంటారు. (నిర్గమకాండము 30:17-21; 38:8). నీరు పాపము నుండి ప్రక్షాళనను మరియు నూతన జన్మను సూచిస్తుంది. (తీతుకు 3:5).
5. పరిశుద్ధ స్థలములో ఏ ఉపకరణములు ఉన్నవి?
జవాబు :
A. సన్నిధి రొట్టెల బల్ల (నిర్గమకాండము 25:23-30), జీవాహారమైన యేసును సూచించును (యోహాను 6:51).
B. ఏడు-కొమ్మల దీవవృక్షము (నిర్గమకాండము 25:31-40), లోకమునకు వెలుగైన యేసును సూచించును (యోహాను 9:5; 1:9). నూనె దేవుని పరిశుద్ధాత్మకు మరియు ఆయన పరిశుద్ధ వాక్యమును సూచించును (జెకర్యా 4:1-6; ప్రకటన 4:5; కీర్తనలు 119:105).
C. ధూపవేదిక లేదా ధూపపీఠము (నిర్గమకాండము 30:7, 8) దేవుని ప్రజల ప్రార్ధనలను సూచించును (ప్రకటన 5:8).
6. అతి పరిశుద్ధ స్థలములో ఏ ఉపకరణములు ఉన్నవి?
జవాబు : నిబంధన మందసము, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఏకైక ఉపకరణము (నిర్గమకాండము 25:10-22), తుమ్మకఱ్ఱతో చేయబడి బంగారముతో పొదిగింపబడిన ఒక పెట్టె లేదా భోషాణము. ఆ భోషాణమునకు ఇరు ప్రక్కలా ఘన బంగారముతో చేయబడిన ఇద్దరు దేవదూతలు ఉన్నారు. ఈ ఇద్దరు దేవదూతల మధ్య కరుణాపీఠము ఉన్నది (నిర్గమకాండము 25:17-22), అక్కడ దేవుని సన్నిధి నివసించింది. ఇది ఇద్దరు దేవదూతల మధ్య స్థాపించబడిన రీతిగా పరలోకంలో దేవుని సింహాసనాన్ని సూచిస్తుంది. (కీర్తనలు 80:1).
7.నిబంధన మందసము లోపల ఏమున్నది?
జవాబు : దేవుడు రాతి పలకలపై తన సొంత వ్రేలితో వ్రాసిన, మరియు తన ప్రజలు ఎల్లప్పుడు గైకొనవలసిన (ప్రకటన 14:12) పది ఆజ్ఞలు నిబంధన మందసము లోపల ఉన్నాయి (ద్వితీయోపదేశకాండము 10:4, 5). అయితే కరుణాపీఠము వాటికి పైన ఉంది, ఇది దేవుని ప్రజలు ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టినంత కాలం (సామెతలు 28:13), యాజకుడు కరుణాపీఠముపై ప్రోక్షింపబడిన రక్తము ద్వారా వారికి కృప విస్తరిస్తుందని సూచిస్తుంది (లేవీయకాండము 16:15, 16). నిష్కళంకమైన గొఱ్ఱెపిల్ల రక్తము మనకు పాపక్షమాపణ దయ చేయుటకు చిందింపబడిన యేసు రక్తమును సూచించుచున్నది (మత్తయి 26:28; హెబ్రీయులకు 9:22).
"మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులును రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండ పాపక్షమాపణ కలుగదు" (హెబ్రీయులకు 9:22). "ఇది నా రక్తము, అనగా పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము” (మత్తయి 26:28).
జవాబు : యేసు రక్తం చిందించకుండా, వారి పాపములు ఎప్పటికీ క్షమించబడలేవని ప్రజలు అర్థం చేసుకోవడానికి జంతువులను బలి ఇవ్వడం అవసరం. వికారమైన, ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే పాపానికి శిక్ష శాశ్వతమైన మరణం (రోమీయులకు 6:23). మనమందరము పాపము చేసియున్నాము గనుక, మనమందరం మరణమును సంపాదించాము. ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు, యేసుక్రీస్తు ముందుకు వచ్చి మరణశిక్షకు పరిహారముగా తన పరిపూర్ణ జీవితమును ప్రజలందరి కొరకు బలిగా అర్పించకపోయి యున్నట్లయితే, వారు తక్షణమే చనిపోయేవారు (యోహాను 3:16, ప్రకటన 13:8). పాపము లోకములో ప్రవేశించిన తరువాత, పాపి జంతు బలి తీసుకురావాలని దేవుడు కోరాడు (ఆదికాండము 4:3-7). పాపి తన చేతులతో జంతువును చంపడం (లేవీయకాండము 1:4, 5). ఇది నిజంగా ఘోరమైనది మరియు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించే దృశ్యము, మరియు ఇది పాపం యొక్క భయంకరమైన పరిణామాలు (శాశ్వతమైన మరణం) మరియు తన స్థానములో మరణించుటకు రక్షకుడు అవసరమనే తలంపు యొక్క గంభీరమైన వాస్తవికతను పాపికి ఎల్లప్పుడు జ్ఞప్తికి తెచ్చెను. రక్షకుడు లేకుండ రక్షణ విషయమై ఎవరికీ నిరీక్షణ లేదు. జంతు బలియర్పణ విధానము, వధింపబడిన గొట్టెపిల్ల గుర్తు ద్వారా, దేవుడు ప్రజల పాపముల కొరకు మరణించుటకు తన కుమారుని అనుగ్రహించునని నేర్పెను (1 కొరింథీయులకు 15:3). యేసు వారి రక్షకుడు మాత్రమే కాక, వారి స్థానములో వారికి బదులుగా మరణించినవాడునై యున్నాడు (హెబ్రీయులకు 9:28). బాప్తిస్మమిచ్చు యోహాను యేసును కలిసినప్పుడు, ఆయనను గూర్చి, "ఇదిగో! లోక పాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల" అని చెప్పెను (యోహాను 1-29). పాత నిబంధనలో, ప్రజలు రక్షణకై సిలువ కొరకు ఎదురు చూశారు. రక్షణకై మనము కల్వరి వైపు తిరిగి చూస్తాము. యేసు తప్ప రక్షణకు వేరే మూలం లేదు (అపొస్తలుల కార్యములు 4:12).
"అతడు దహనబలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యినుంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును." "బలిపీఠపు ఉత్తరదిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను" (లేవీయకాండము 1:4, 11).
జవాబు : ఒక పాపి బలిపశువును ఆవరణ ద్వారము వద్దకు తీసుకొని వచ్చినప్పుడు, యాజకుడు అతనికి కత్తిని మరియు ఒక పాత్రను ఇచ్చాడు. పాపి తన చేతులను బలిపశువు మీద ఉంచి తన పాపాలను ఒప్పుకున్నాడు. ఇది పాపి నుండి బలిపశువుకు పాపము బదిలీ చేయబడెననుటకు ప్రతీక. ఆ సమయంలో, పాపిని నిర్దోషిగా మరియు బలిపశువును దోషిగా భావించారు. ఇప్పుడు బలిపశువు సాదృశ్యముగా దోషి గనుక, అది పాపం వలన వచ్చు జీతమైన (మరణము)ను చెల్లింపవలసి వచ్చింది. తన చేతులతో బలిపశువును చంపుట ద్వారా, పాపం నిర్దోషమైన అమాయక జంతువు మరణానికి కారణమైందని మరియు అతని పాపం నిర్దోషియైన మెస్సీయా మరణానికి కారణమవుతుందని పాపికి స్పష్టంగా బోధించబడింది.
“అభిషిక్తుడైన యాజకుడు ఆ కోడె యొక్క రక్తములో కొంచెము ప్రత్యక్షపు గుడారములోనికి తీసుకొని రావలెను. ఆ యాజకుడు ఆ రక్తములో తన వ్రేలు ముంచి అడ్డతెర వైపున యెహోవా సన్నిధిని ఏడు మారులు దాని ప్రోక్షింపవలెను" (లేవీయకాండము 4:16, 17).
జవాబు : జనసమూహమంతటి పాపాల కొరకు బలి అర్పించబడినప్పుడు, యేసుకు సాదృశ్యమైన యాజకుడు (హెబ్రీయులకు 3:1) రక్తాన్ని గుడారం లోపలికి తీసుకొనిపోయి, లోపలి రెండు గదులను వేరు చేసిన అడ్డతెర ముందు ప్రోక్షించెను. దేవుని సన్నిధి అడ్డతెరకు వేరొక ప్రక్క నివసించెను. ఈ విధంగా, ప్రజల పాపములు తీసివేయబడి సాదృశ్యముగా గుడారమునకు బదిలీ చేయబడెను. యాజకుడు చేసిన ఈ రక్త సంబంధమైన పరిచర్య పరలోకంలో మన కొరకు యేసు చేయుచున్న ప్రస్తుత పరిచర్యను ఛాయారూపకముగా ముందే సూచించింది. పాపానికి బలిగా యేసు సిలువపై మరణించిన తరువాత, ఆయన లేచి పరలోకపు ప్రత్యక్ష గుడారములో తన రక్త సంబంధమైన పరిచర్య నిర్వహించుటకు మన యాజకుడుగా పరలోకమునకు వెళ్లెను (హెబ్రీయులకు 9:11, 12). భూసంబంధమైన యాజకుడి చేత పరిచర్య చేయబడిన రక్తం మన పాపాలను ఆయన నామంలో ఒప్పుకున్నప్పుడు (1 యోహాను 1:9) అవి క్షమింపబడినవని చూపిస్తూ, మన పాపాల ఖాతాకు యేసు వర్తింపజేయడాన్ని సూచిస్తుంది.
11. ప్రత్యక్ష గుడారపు సేవల ఆధారముగా, యేసు తన ప్రజలకు ఏ రెండు ప్రధాన స్థానములలో పరిచర్య చేయును? ఆయన ప్రేమపూర్వక పరిచర్య నుండి మనకు ఏ అద్భుతమైన ప్రయోజనములు లభించును?
"క్రీస్తు అను మన పస్కాపశువు (మన కొరకు) వధింపబడెను" (1 కొరింథీయులకు 5:7). "ఆకాశమండలము గుండు వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాదు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము" (హెబ్రీయులకు 4:14-16).
జవాబు : యేసు మన పాపములకు బలిగాను మరియు మన పరలోకపు ప్రధాన యాజకుడుగాను పరిచర్య చేయును. మనకు బదులుగా మన స్థానములో బలిగా వధింపబడిన గొఱ్ఱెపిల్లగా యేసు మరణము, మరియు మన పరలోకపు ప్రధాన యాజకుడుగా ఆయన నిరంతర శక్తివంతమైన పరిచర్య, మన కొరకు రెండు బ్రహ్మాండమైన అద్భుత కార్యములను సాధించును :
A. పూర్వం చేసిన అన్ని పాపములు క్షమించబడుటతో పాటు, నూతన జన్మ అని పిలువబడే సంపూర్ణ జీవిత మార్పు (యోహాను 3:3-6; రోమీయులకు 3:25).
B. ప్రస్తుతకాలములో మరియు భవిష్యత్తులో సత్యమైన నీతిమార్గములో జీవించుటకు శక్తి (తీతుకు 2:14; ఫిలిప్పీయులకు 2:13).
ఈ రెండు అద్భుత కార్యములు ఒక వ్యక్తిని నీతిమంతుడుగా చేస్తాయి - అనగా ఆ వ్యక్తికి మరియు దేవునికి మధ్య ఒక సరైన సంబంధము ఉన్నది. ఒక వ్యక్తి క్రియలు (తన సొంత ప్రయత్నాల) ద్వారా నీతిమంతుడుగా తీర్చబడుటకు దోహదపడవు, ఎందుకనగా నీతిమంతుడుగా తీర్చబడుటకు యేసు మాత్రమే సాధించగల అద్భుతాలు అవసరం (అపొస్తలుల కార్యములు 4:12). ఒక వ్యక్తి తన కొరకు తాను చేయలేనిదాన్ని తన కొరకు చేయమని రక్షకుడిని విశ్వసించుట ద్వారా నీతిమంతుడుగా తీర్చబడును. బైబిలులో చెప్పబడిన "విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడుట" అనే మాటకు నిర్వచనం ఇదే. మన జీవితాలకు పాలకుడు కావాలని యేసును అడుగుచున్నాము మరియు ఆయనతో పూర్తిగా సహకరించినప్పుడు అవసరమైన అద్భుతాలను చేయమని ఆయనను విశ్వసించుచున్నాము. క్రీస్తు చేత మన కొరకు మరియు మనలో అద్భుత రీతిగా సాధించబడిన ఈ నీతి ఏకైక నిజమైన నీతి. ప్రతి ఇతర రకమైన నీతి నకిలీ నీతి.
జవాబు : A. ఆయన మన గత పాపాలను కప్పి, మనలను నిర్దోషులనుగా ఎంచును (యెషయా 44:22; 1 యోహాను 1:9).
B. మనము ఆదియందు దేవుని స్వరూపములో సృష్టించబడ్డాము (ఆదికాండము 1:26, 27). యేసు ప్రభువు మనలను దేవుని స్వరూపములోనికి పునరుద్ధరించెదనని వాగ్దానము చేసెను(రోమీయులకు 8:29).
C. నీతిమంతులుగా జీవించాలనే అభిలాషను యేసు మనకు ఇచ్చును. ఆపై దానిని నెరవేర్చుటకు ఆయన శక్తిని మనకు ఇచ్చును (ఫిలిప్పీయులకు 2:13).
D. యేసు, తన అద్భుత శక్తి ద్వారా, దేవుని కిష్టమైన పనులను మాత్రమే సంతోషంగా చేయులాగున మనలను ప్రేరేపించును. (హెబ్రీయులకు 13:20, 21; యోహాను 15:11).
E. ఆయన తన పాపరహితమైన జీవితమును మరియు పాప ప్రాయశ్చిత్త మరణమును ఆరోపించుట ద్వారా మరణ శిక్షను మన నుండి తొలగించును (2 కొరింథీయులకు 5:21).
F. యేసు ప్రభువు మనలను పరలోకము తీసుకొనిపోవుటకు తిరిగి వచ్చేవరకు మనలను విశ్వాసములో నిలకడగా ఉంచే బాధ్యతను స్వీకరించును (ఫిలిప్పీయులకు 1:6; యూదా 1.24).
నీ జీవితములో ఈ అద్బుతమైన వాగ్దానములన్ని నెరవేర్పుటకు యేసు ప్రభువు సిద్ధముగా ఉన్నాడు! నీవు సిద్ధముగా ఉన్నావా?
“ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును” (మత్తయి 7:21)
జవాబు : అవును. యేసు ప్రభువు తన తండ్రి చిత్తాన్ని మనం తప్పక చేయవలెనని చెప్పాడు. పాత నిబంధన దినములలో, నిజముగా మారుమనస్సు నొందిన వ్యక్తి గొట్టెపిల్లలను బలి అర్పించుటకు తీసుకొని వస్తూ ఉండెను. ఇది పాపానికి తన దుఃఖాన్ని మరియు ప్రభువే పూర్తిగా తన జీవితమును నడిపించాలనే తన హృదయాభిలాషను సూచించుచున్నది. అయితే నేడు, నీతిమంతులుగా తీర్చుబడుటకు అవసరమైన అద్భుతాలను మనం చేయలేనప్పటికీ, మనం అనుదినము మన జీవితములను యేసు ప్రభువుకు సమర్పించవలెను (1 కొరింథీయులకు 15:31), అద్భుత కార్యములు జరుగులాగున మన జీవితములను ఆయన స్వాధీనములో ఉండుటకు ఆయనను మనము ఆహ్వానించవలెను. మనం విధేయులుగా ఉండుటకు మరియు యేసు ప్రభువు నడిపించు మార్గమును అనుసరించుటకు సిద్ధంగా ఉండాలి (యోహాను 12:26; యెషయా 1:18-20). మన పాపపు స్వభావం మనకిష్టానుసారమైన మార్గమును ఎంచుకొనులాగున మనలను ప్రేరేపించును (యెషయా 53:6), తద్వారా సాతాను ప్రారంభంలో చేసినట్లే ప్రభువుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుదుము (యెషయా 14:12-14). మన జీవితములను పాలించుటకు యేసు ప్రభువును అనుమతించుట అనునది కొన్నిసార్లు ఒక కన్ను పెరికి వేయబడినంత లేదా చేయి శరీరము నుండి నరికి వేయబడినంత కష్టంగా ఉండును (మత్తయి 5:29, 30). ఎందుకనగా పాపము వ్యసనకరమైనది, అది దేవుని అద్భుత శక్తి ద్వారానే అధిగమించబడును (మార్కు 10:27). వారి ప్రవర్తనతో సంబంధం లేకుండా, రక్షింపబడినామని ప్రకటించుకునే వారందరినీ యేసు పరలోకమునకు తీసుకువెళతాడని చాలామంది నమ్ముచున్నారు. కానీ ఇది అలా కాదు. ఇది ఒక మోసం. ఒక క్రైస్తవుడు యేసు మాదిరిని అనుసరించాలి (2 పేతురు 2:21). యేసు యొక్క శక్తివంతమైన రక్తం మన కొరకు దీనిని సాధించగలదు (హెబ్రీయులకు 13:12), కాని మన జీవితాలపై యేసుకు పూర్తి నియంత్రణ ఇచ్చి, ఆయన నడిపించు మార్గము కొన్నిసార్లు కఠినంగా ఉన్నప్పటికీ దానిని అనుసరించినప్పుడే ఇది జరుగును (మత్తయి 7:13, 14, 21).
జవాబు :
A. సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్త దినం అని పిలువబడే గంభీరమైన తీర్పు దినము ఇశ్రాయేలులో జరిగింది (లేవీయకాండము 23:27). అందరూ ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకొనుటకు నిరాకరించిన వారిని ఆ రోజు ఇశ్రాయేలీయుల పాళెము నుండి శాశ్వతంగా కొట్టివేయబడ్డారు (లేవీయకాండము 23:29).
B. రెండు మేకలు ఎంపిక చేయబడ్డాయి : ఒకటి యెహోవా మేక, మరొకటి సాతానును సూచించు విడిచిపెట్టే మేక (లేవీయకాండము 16:8). యెహోవా పేరట ఎంపిక చేయబడిన మేక వధింపబడి, ప్రజల పాపాల పరిహారము నిమిత్తము బలిగా అర్పించబడింది (లేవీయకాండము 16:9). అయితే ఆ దినమందు చిందింపబడిన రక్తము అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకెళ్ళబడి, కరుణాపీఠము మీద ప్రోక్షించబడింది (లేవీయకాండము 16:14). ఈ ప్రత్యేక తీర్పు దినమున మాత్రమే ప్రధాన యాజకుడు కరుణాపీఠము వద్ద దేవునిని కలుసుకొనుటకు అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. యేసు బలియాగమునకు గుర్తుగా ఉన్న ఆ ప్రోక్షింపబడిన రక్తమును దేవుడు అంగీకరించాడు మరియు ప్రజల ఒప్పుకున్న పాపాలను ప్రత్యక్ష గుడారము నుండి ప్రధాన యాజకునికి బదిలీ చేయబడినవి. తరువాత అతడు ఒప్పుకున్న ఈ పాపాలను అరణ్యములోనికి విడిచిపెట్టబడబోవు మేక మీదకు బదిలీ చేసెను (లేవీయకాండము 16:16, 20-22). ఈ పద్ధతిలో, అడ్డతెర మీద ప్రోక్షింపబడి అలాగే సంత్సరమంతయు అంటుకొనియుండు రక్తము ద్వారా అక్కడకు బదిలీ చేయబడిన ప్రజల పాపముల నుండి ప్రత్యక్ష గుడారము శుద్ధి చేయబడింది.
"పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి యుండెను గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి యుండెను" (హెబ్రీయులకు 9:23).
జవాబు : అవును. ఆ దినమందు జరిగిన సేవలు పరలోక ప్రత్యక్ష గుడారములో నిజమైన ప్రధాన యాజకుడు పాపమును తుడిచివేయుటను సూచించాయి. జీవగ్రంథమందు వ్రాయబడినవారికి చిందించిన తన రక్తమును ఆరోపించుట ద్వారా, క్రీస్తు శాశ్వతంగా పరిచర్య చేయాలన్న తన ప్రజల నిర్ణయాలను ధృవీకరిస్తాడు. ఈ ప్రత్యేక తీర్పుదినము, ఇశ్రాయేలులోని ప్రాయశ్చితార్ధ దినము (యోమ్ కిపూర్) మాదిరిగానే, భూగ్రహానికి జరుగనైయున్న అంతిమ ప్రాయశ్చిత్తార్ధ దినమును ఛాయారూపకముగా సూచించింది. ప్రాచీన ప్రాయశ్చిత్త దినపు సాంవత్సరిక క్రమము నుండి, మన నమ్మదగిన ప్రధాన యాజకుడు, యేసు ప్రభువు ఇప్పటికీ తన ప్రజల కొరకు పరలోకములో విజ్ఞాపన చేస్తున్నాడని మరియు చిందించిన తన రక్తమందు విశ్వాసం ఉన్న వారందరి పాపాలను తొలగించడానికి సిద్ధంగా ఉన్నాడని మానవాళికి భరోసా ఉంది. అంతిమ ప్రాయశ్చిత్తం తుది తీర్పుకు దారితీస్తుంది, ఇది ప్రతి వ్యక్తి జీవితంలో పాపమనే ప్రశ్నను పరిష్కరిస్తుంది, ఫలితంగా జీవితం లేదా మరణం సంభవిస్తుంది.
అతి ప్రాముఖ్యమైన సంఘటనలు
భూసంబంధమైన ప్రత్యక్ష గుడారము యొక్క సాదృశ్యరూపాలు మరి ముఖ్యముగా ప్రాయశ్చిత్తార్ధ దినం అంత్యకాల ప్రాముఖ్యమైన సంఘటనలను ఛాయారూపకాలుగా ముందే సూచించాయని మీరు తదుపరి రెండు స్టడీ గైడ్ పత్రికల్లో కనుగొంటారు.
తీర్పుకు తేదీ
తదుపరి స్టడీ గైడ్ పత్రికలో, పరలోక తీర్పు ప్రారంభం కావడానికి దేవుడు తేదీని నిర్ణయించే కీలకమైన బైబిల్ ప్రవచనాన్ని పరిశీలిస్తాము. నిజంగా ఇది ఉత్తేజకరమైన విషయము!
16. దేవుడు బయలుపరచినట్లు నీకు క్రొత్తగా తెలిసిన సత్యమును అంగీకరించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?
నీ జవాబు:
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) ప్రత్యక్ష గుడారము యొక్క ఆవరణములో ఏ ఉపకరణములు ఉన్నవి? (2)
( ) కరుణాపీఠము.
( ) గంగాళము (నీళ్ల తొట్టి).
( ) కుర్చీలు.
( ) దహన బలిపీఠము.
2) దేవుని సన్నిధి కరుణా పీఠముపై నివసించినది. (1)
( ) అవును.
( ) కాదు.
3) క్రింది పదాలతో ఖాళీలను పూరించండి :
సిలువ యేసు శుద్ధీకరణ ప్రార్థనలు వెలుగు
ఉదాహరణ : దహన బలిపీఠము సిలువ ను సూచిస్తుంది.
గంగాళము పాపము నుండి ను సూచిస్తుంది.
సన్నిధిరొట్టెల బల్ల జీవాహారమైన ను సూచిస్తుంది.
ఏడు-కొమ్మల దీపస్తంభము లోకమునకు అయిన యేసును సూచిస్తుంది.
ధూప పీఠము దేవుని ప్రజల ను సూచిస్తుంది.
4) ప్రత్యక్ష గుడారము మరియు దాని సేవల యొక్క ఉద్దేశ్యమేమనగా (1)
( ) ప్రజలకు దేవదూతలను అర్థము చేసుకొనుటలో సహాయపడుట.
( ) ప్రజలకు మాంసాహారము అందించుట.
( ) రక్షణ ప్రణాళికను సూచించుట.
5) ప్రత్యక్ష గుడారము కొరకు ప్రణాళికలను ఎవరు రూపొందించారు? (1)
( ) నోవహు.
( ) ఒక దేవదూత.
( ) అహరోను.
( ) దేవుడు.
6) పది ఆజ్ఞలు నిబంధన మందసము లోపల ఉన్నవి. (1)
( ) అవును.
( ) కాదు.
7) వధింపబడిన బలిపశువులు (1)
( ) పరిశుద్ధాత్మను సూచించినవి.
( ) యుద్ధమును సూచించినవి.
( ) యేసు ప్రభువును సూచించినవి.
8) ప్రత్యక్ష గుడారము ఆధారముగా, యేసు ప్రభువు మనకు ఏ రెండు స్థానములలో పరిచర్య చేయును? (2)
( ) రాజు.
( ) బలియాగము.
( ) ప్రధాన యాజకుడు.
( ) విశ్వ పాలకుడు.
9) భూసంబంధమైన ప్రత్యక్ష గుడారము విషయములో క్రింది వాటిలో ఏది నిజము? (2)
( ) దీనికి మూడు గదులు ఉన్నవి.
( ) ఇది ఒక గుడారము వంటి నిర్మాణము.
( ) దీని పరిమాణము 500 అడుగులు పొడుగు మరియు 1,000 అడుగులు వెడల్పు.
( ) దీని ఆవరణము ఇత్తడి స్తంభములు మరియు సన్నటి నారబట్టతో తయారు చేయబడింది.
( ) పైకప్పు ఐగుప్తు పలకతో తయారు చేయబడింది.
( ) గంగాళము అతి పరిశుద్ధ స్థలములో ఉన్నది.
10) విశ్వాసమూలముగా నీతి మాత్రమే నిజమైన నీతి. (1)
( ) అవును.
( ) కాదు.
11) విశ్వాసమూలముగా నీతి (1)
( ) మనిషి యొక్క క్రియల ద్వారా వచ్చును.
( ) బాప్తిస్మము పొందుట ద్వారా.
( ) యేసుక్రీస్తుపై విశ్వాసముంచుట ద్వారా మాత్రమే.
12) పాపి తెచ్చిన బలిపశువులను ఎవరు చంపారు? (1)
( ) దేవుడు.
( ) యాజకుడు.
( ) పాపి.
13) యేసు ఇచ్చే నీతి గురించి ఏ ప్రకటనలు నిజము? (3)
( ) ఇది దేవుని స్వరూపములోనికి మనలను పునరుద్ధరించును.
( ) ఇది అద్భుతకరమైనది కాదు.
( ) మన మంచి క్రియలు దానిలో పెద్ద పాత్ర పోషించును.
( ) ఇది మన గత పాపములను కప్పును.
( ) ఇది సత్యమైన నీతిమార్గములో జీవించాలనే అభిలాషను మనకు కలిగించును.
( ) ఇది మనము వదులుకొనుటకు ఇష్టపడని పాపములను కప్పును.
14) ప్రాయశ్చిత్త దినమునకు సంబంధించి క్రింది వాటిలో ఏది నిజము? (4)
( ) ఇది నెలకొకసారి సంభవించింది.
( ) ఇది తీర్పు దినము.
( ) ఇది ఆటలు ఆడుకొని వినోదము పొందే రోజు.
( ) ఇది అంతిమ తీర్పుకు గుర్తు.
( ) విడిచిపెట్టే మేక సాతానుకు గుర్తు.
( ) రక్తము అతి పరిశుద్ధ స్థలములోనికి తీసుకొనబడినది.
15) నీతియనగా దేవునితో సరైన సంబంధము కలిగియుండుట. (1)
( ) అవును.
( ) కాదు.
16) ఒక జంతువును చంపుట పాపము ప్రజలందరిపై మరణశిక్షను తెచ్చినదని ప్రజలు గ్రహించుటకు సహాయపడినది. (1)
( ) అవును.
( ) కాదు.
17) పాప క్షమాపణ, పాపము నుండి శుద్ధీకరణ, ప్రస్తుత కాలములో మరియు భవిష్యత్తులో సత్యమైన నీతిమార్గములో జీవించే శక్తితో కూడిన యేసు ప్రభువు నీతిని అంగీకరించుటకు నీవు సిద్ధముగా ఉన్నావా?
( ) అవును.
( ) కాదు.