Lesson 10

మరణము అను అంశము నేడు చాలా తప్పుగా అర్థము చేసికొనిన లేక అపార్థము చేసికొనిన విషయములలో ఒకటి. చాలామందికి, మరణము మర్మముగా కప్పబడి భయము, సందిగ్ధము మరియు నిరాశ నిస్పృహలను రేకెత్తించుచున్నది. మరికొందరు మరణించిన తమ ప్రియులు అసలు చనిపోలేదని, వారు తమతోనే లేదా ఇతర భూమండలములలోనే నివసించుచున్నారని నమ్ముచున్నారు. శరీరము, ఆత్మ మరియు జీవాత్మ (ప్రాణము) అను వాటి మధ్య సంబంధమును గూర్చి లక్షలాది మంది అయోమయములో ఉన్నారు. కానీ నీవు ఏమి నమ్ముచున్నావో అనునది నిజముగా ప్రాముఖ్యమేనా? అవును ఖచ్చితముగా! చనిపోయినవారి గురించి నీవు ఏమి నమ్ముచున్నావో అనునది సమీప భవిష్యత్తులో నీకు ఏమి జరుగునో అను దానిపై తీవ్ర ప్రభావము చూపును. ఊహించుటకు తావు లేదు! ఈ స్టడీ గైడ్ పత్రిక దేవుడు ఈ అంశమును గూర్చి సరిగ్గా ఏమి చెప్పుచున్నాడో అను విషయమును నీకు తెలియజేయును. నిజమైన కనువిప్పు కొరకు సిద్ధముగా ఉండుము!

Adam was created by God in the beginning.

1. మానవులు ఈ భూమ్మీద మొట్టమొదటిగా ఎట్లు ఉనికిలోనికి వచ్చిరి?

“దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను" (ఆదికాండము 2:7).

జవాబు : ఆదియందు దేవుడు మనలను నేలమట్టితో నిర్మించెను.

2. What happens when a person dies?

2. ఒక వ్యక్తి మరణించినప్పుడు ఏమి జరుగును?

"మన్నయినది వెనుకటి వలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును" (ప్రసంగి 12:7).

జవాబు : శరీరము తిరిగి మన్నయిపోవును, ఆత్మ (జీవవాయువు) దాని దయచేసిన దేవుని యొద్దకు చేరును. మరణించు ప్రతివాని ఆత్మ (జీవవాయువు, ఊపిరి) - మంచివాడైనను లేక చెడ్డవాడైనను - దేవుని యొద్దకు చేరును.

3. మరణమందు దేవుని యొద్దకు చేరు "ఆత్మ" ఏమిటి?

"ప్రాణము లేని శరీరము మృతము" (యాకోబు 2:26). "దేవుని ఆత్మ నా నాసికారంధ్రములలో ఉండుటను బట్టియు" (యోబు 27:2).

జవాబు : మరణమందు దేవుని యొద్దకు చేరు ఆత్మ జీవవాయువు లేదా ఊపిరి. ఒక వ్యక్తి మరణించిన తరువాత “ఆత్మకు” ఏ విధమైన జీవము, తెలివితేటలు, చలనము (స్పర్శ), లేదా స్పృహ ఉండునని దేవుని గ్రంథమంతటిలో ఎక్కడను చెప్పబడలేదు. అది “జీవవాయువే" కాని మరొకటి కాదు.

4. "జీవాత్మ" అనగా ఏమిటి?

"దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను" (ఆదికాండము 2:7).

జవాబు : "జీవాత్మ" అనగా ఒక జీవించే వ్యక్తి. "జీవాత్మ" అనునది ఎల్లప్పుడు రెండు విషయముల యొక్క కలయిక : అవి "శరీరము" మరియు "జీవవాయువు (ఊపిరి)." “శరీరము” మరియు "జీవవాయువు (ఊపిరి)" కలయిక జరుగకుండ, "జీవాత్మ" ఉనికి చెందదు. మనకు ఆత్మలున్నవని కాక మనమే జీవాత్మలమని దేవుని వాక్యము బోధించుచున్నది.

Body(Dust) - Breath(Spirit) = Death (No Soul)

5."ఆత్మలు" మరణించునా?

"పాపము చేయువాడే మరణము నొందును" (యెహెజ్కేలు 18:20). "సముద్రములో (జీవులు) ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను" (ప్రకటన 16:3).

జవాబు : దేవుని వాక్య ప్రకారము, జీవాత్మలు మరణించును. మనము జీవాత్మలము, మరణించెదము. మానవుడు మర్త్యుడు లేక మరణించువాడు (యోబు 4:16). దేవుడు మాత్రమే అమరత్వము గలవాడై యున్నాడు (మరణము లేనివాడు) (1 తిమోతి 6:15, 16). ఆత్మకు చావు లేదు, అమరత్వమున్నదనే బోధ, ఆత్మలు మరణించునని బోధించే బైబిలు బోధకు వ్యతిరేకమైనది లేక విరుద్ధమైనది.

The Bible suggests that King David will be in God’s kingdom, but that he is in his grave now, where he awaits the resurrection.

6. రక్షింపబడినవారు మరణించగానే పరలోకమునకు వెళతారా?

“సమాధులలో నున్న వారందరు ఆయన శబ్దము విని ... బయటికి వచ్చెదరు” (యోహాను 5:28, 29). "అతడు (దావీదు) చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటివరకు మన మధ్య నున్నది." "దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు" (అపొస్తలుల కార్యములు 2:29, 30, 34). “ఆశ యేదైన నాకుండిన యెడల పాతాళము (సమాధి) నాకు ఇల్లు అను ఆశయే” (యోబు 17:13).

జవాబు : లేదు. జనులు మరణమందు పరలోకమునకు గాని నరకమునకు గాని వెళ్లరు. వారు ఎక్కడికి వెళ్లరు కాని వారి సమాధులలోనే నిలిచియుండి పునరుత్థానము కొరకు వారు కనిపెట్టుకొని యుందురు.

7. How much does one know or comprehend after death?

7. మరణించిన తరువాత ఒకడు ఎంతమేరకు వివేచింపగలడు లేక గ్రహింపగలడు?

“బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు, వారి పేరు మరువబడి యున్నది. వారికిక ఏ లాభమును కలుగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు.” “చేయుటకు నీ చేతికి వచ్చిన యే పనినైనను నీ శక్తిలోపము లేకుండ చేయుము, నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు” (ప్రసంగి 9:5, 6, 10). "మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు” (కీర్తనలు 115:17).

జవాబు : చచ్చినవారు ఖచ్చితముగా ఏమియు ఎరుగరని దేవుడు చెప్పుచున్నాడు!

Though millions think it is possible, the dead cannot communicate with the living.

8. కాని మృతులు బ్రతికియున్నవారితో సంభాషించలేరా, మరియు బ్రతికియున్నవారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదా?

“ఆలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు. ఎవరును వారిని నిద్ర లేపజాలరు.” “వారి కుమారులు ఒకవేళ ఘనత వహించినను అది వారికి తెలియకపోవును. వారు ఒకవేళ అణిగిపోయినను అట్టి గతి వారికి పట్టెనని వారు గ్రహింపకయుందురు” (యోబు 14:11, 12, 21). “సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు” (ప్రసంగి 9:6).

జవాబు : లేదు. చనిపోయినవారు బ్రతికియున్నవారిని సంప్రదించలేరు లేదా వారితో సంభాషించలేరు, లేదా బ్రతికియున్నవారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. వారు మృతులైరి. వారి సంకల్పములు (ఆలోచనలు) నాడే నశించెను (కీర్తనలు 146:4).

9. Jesus called the unconscious state of the dead “sleep” in John 11:11–14. How long will they sleep?

9. యేసు ప్రభువు మృతుల అపస్మారక స్థితిని "నిద్ర" అని యోహాను 11:11-14లో పిలిచెను. వారెంతకాలము నిద్రించియుందురు?

"అలాగుననే నరులు పండుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవు వరకు వారు మేలుకొనరు" (యోబు 14:11, 12). "ప్రభువు దినము ... వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును" (2 పేతురు 3:10).

జవాబు : మృతులు యుగాంతమందు రాబోవు ప్రభువు మహా దినము వరకు నిద్రించియుందురు. మరణమందు మానవులు ఏ విధమైన పనియైనను లేదా జ్ఞానమైనను లేకుండ పూర్తిగా అపస్మారక స్థితిలో ఉన్నారు.

10. What happens to the righteous dead at the second coming of Christ?

10. క్రీస్తు రెండవ రాకడయందు నీతిమంతులైన మృతులకు ఏమి జరుగును?

"ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది" (ప్రకటన 22:12). "ప్రభువు తానే ఒక గొప్ప శబ్దముతో పరలోకము నుండి దిగి వచ్చును, ... క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు ... కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము" (1 థెస్సలొనీకయులకు 4:16, 17). "నిమిషములో, ఒక రెప్పపాటున, ... మనమందరము మార్పు పొందుదుము. ... అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. ... క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసియున్నది. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది" (1 కొరింథీయులకు 15:51-53).

జవాబు : వారు ప్రతిఫలము పొందెదరు. వారు లేపబడి, అమర్త్యమైన శరీరములు ధరించుకొని, ప్రభువును ఆకాశమధ్యమున కలిసికొనుటకు మేఘముల మీద కొనిపోబడెదరు. ప్రజలు మరణమందు పరలోకమునకు తీసికొనిపోబడిన యెడల పునరుత్థానములో ప్రజాహితమైన ఏ సదుద్దేశ్యము గాని ప్రయోజనము గాని ఉండదు.

11. What was the devil’s first lie on Earth?

11. భూమిపై అపవాది చెప్పిన మొట్టమొదటి అబద్ధమేమిటి?

"అందుకు సర్పము మీరు చావనే చావరు" అని ఆ స్త్రీతో చెప్పెను (ఆదికాండము 3:4). "అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పము" (ప్రకటన 12:9).

జవాబు : మీరు చావనే చావరు.

12. అపవాది మరణము గురించి హవ్వకు ఎందుకు అబద్ధము చెప్పెను? ఈ విషయము మనమనుకునే దానికన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనదేనా?

జవాబు : మనము చావనే చావమని అపవాది చెప్పిన అబద్ధము అతడు బోధించే తప్పుడు నకిలీ బోధలకు మూలస్తంభములైన బోధలలో ఒకటి. తాము మరణించినవారితో సంభాషించుచు వారి ఆత్మల నుండి వర్తమాన సమాచారములు పొందుకొనుచున్నామని నమ్మేలా ప్రజలను భ్రమపరచి మోసగించుటకు వేలాది సంవత్సరాలుగా అతడు శక్తివంతమైన, మోసపూరిత అద్భుతములను నకిలీ సూచకక్రియలను చేసెను. (ఉదాహరణలు: ఐగుప్తు దేశపు శకునగాండ్రు (నిర్గమకాండము 7:11); ఏన్దోరులో కర్ణపిశాచము గల ఒక స్త్రీ (1 సమూయేలు 28:3-25); గారడీవిద్య గలవారు (దానియేలు 2:2); దయ్యము పట్టినదై సోదె చెప్పు బానిసయైన ఒక చిన్నది (అపొస్తలుల కార్యములు 16:16-18).

ఒక గంభీరమైన హెచ్చరిక :

రానున్న కాలములో, ప్రపంచ దేశములను మోసగించుటకు (ప్రకటన 18:22) ప్రవక్తయగు దానియేలు దినములలో తాను చేసినట్టుగా సాతానుడు గారడీ విద్యను మరొకసారి ప్రయోగించును. గారడీవిద్య అనునది ఒక అతీంద్రియ ప్రాతినిధ్య శక్తి, ఇది చనిపోయినవారి ఆత్మల నుండి తన శక్తిని మరియు జ్ఞానమును పొందుకొనునని చెప్పుకునే మంత్రాంగము.

యేసు యొక్క శిష్యుల వేషము ధరించుకొనుట:

మరణించిన దైవిక ప్రియులుగా, ప్రస్తుతము చనిపోయిన పరిశుద్ధ మతగురువులుగా, బైబిలు ప్రవక్తలుగా లేదా క్రీస్తు యొక్క అపొస్తలులుగా వేషము ధరించుకొని (2 కొరింథీయులకు 11:13), సాతాను మరియు అతని దుష్టదూతలు కోట్లాది మందిని మోసగించెదరు. మృతులు ఏదొక రూపములో బ్రతికేయున్నారని నమ్మేవారు, మోసగించబడుటకు ఎక్కువ అవకాశములున్నవి.

All miracle working is not from God, because devils also work miracles.13. దయ్యములు (సాతాను ప్రతినిధులు) నిజముగానే సూచక క్రియలు చేయగలవా?

"అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే" (ప్రకటన 16:14). " అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడినవారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు" (మత్తయి 24:24).

జవాబు : అవును నిజమే! దయ్యములు (సాతాను ప్రతినిధులు) అద్భుత రీతిలో ఒప్పింపజేయగల సూచక క్రియలు మహత్కార్యములు చేయగలవు (ప్రకటన 13:13, 14). సాతాను వెలుగుదూత వేషము ధరించుకొనును (2 కొరింథీయులకు 11:14). మరింత ఆశ్చర్యము కలిగించే విషయమేదనగా, అతడు సాక్షాత్తు క్రీస్తు వేషము ధరించుకొనును (మత్తయి 24:23, 24). క్రీస్తు ఆయన దూతలు ప్రపంచవ్యాప్తముగా ఒక గొప్ప కార్యమునకు శ్రీకారము చుట్టి ఒక అద్భుతమైన ఉజ్జీవమునకు నాంది పలుకుచున్నారనే విశ్వవ్యాప్తమైన భావన ఆ సమయములో కలుగును. ఆ పూర్తి సన్నివేశము చూచుటకు ఎంత ఆధ్యాత్మికముగా మరియు అద్భుతముగా కనబడునంటే దేవుని ఏర్పరచబడినవారు మాత్రమే తప్ప మిగతా వారందరు మోసగించబడుదురు.

14. ఏర్పరచబడినవారు లేక దేవుని ప్రజలు ఎందుకు మోసపోరు?

"వీరు ... ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి" (అపొస్తలుల కార్యములు 17:11). "ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు" ( యెషయా 8:20).

జవాబు : ఆయన గ్రంథము (బైబిలు) నుండి వారు చదివిన దానిని బట్టి మరణించినవారు మృతులై యున్నారని, బ్రతికి లేరని దేవుని ప్రజలు ఎరుగుదురు. మరణించిన ప్రియమైన వ్యక్తినని చెప్పుకునే "ఆత్మ" నిజానికి దయ్యమని (సాతాను ప్రతినిధి) అని వారు తెలిసికొందురు! మరణించినవారి ఆత్మలను సంప్రదించడము ద్వారా ప్రత్యేకమైన “వెలుగు (జ్ఞానము)” లేదా అద్భుతములు చేయగల శక్తిని పొందుచున్నామని చెప్పుకునే తప్పుడు బోధకులను మరియు నకిలీ సూచక క్రియలు జరిగించు వ్యక్తులను దేవుని ప్రజలు తిరస్కరించెదరు. అదే విధముగా చనిపోయినవారు ఏ రూపములోనైనను, ఎక్కడైనను బ్రతికే యున్నారని చెప్పే అన్ని బోధలను ప్రమాదకరమైనవిగా మరియు అబద్ధమైనవిగా దేవుని ప్రజలు తిరస్కరించెదరు.

15. Back in Moses’ day, what did God command should be done to people who taught that the dead were alive?

15. పూర్వము మోషే దినములలో, మృతులు బ్రతికే యున్నారని బోధించినవారిని ఏమి చేయవలెనని దేవుడు ఆజ్ఞాపించెను?

"పురుషునియందేమి స్త్రీయందేమి కర్ణపిశాచియైనను సోదెయైనను ఉండినయెడల వారికి మరణశిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలెను" (లేవీయకాండము 20:27).

జవాబు : సోదె గాండ్రను మరియు "కర్ణపిశాచి" గలవారిని (చనిపోయినవారిని సంప్రదించగలమని చెప్పుకొనినవారిని) రాళ్లతో కొట్టవలెనని దేవుడు ప్రజలకు ఆజ్ఞాపించెను. చనిపోయినవారు బ్రతికే యున్నారనే తప్పుడు బోధను దేవుడు ఎట్లు పరిగణించునో ఇది చూపించుచున్నది.

16. పునరుత్థానములో లేపబడిన నీతిమంతులు మరల ఎన్నడైన మరణించెదరా?

“పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు .... పునరుత్థానములో పాలివారైయుండి దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురుగనుక వారికను చావనేరరు” (లూకా 20:35, 36). "ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడ్చైనను వేదనయైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను" (ప్రకటన 21:4).

Answer

జవాబు : మరణించరు! మరణము, వేదన, దుఃఖము, ఏడుపు మరియు విషాదము దేవుని నూతన రాజ్యములోనికి ఎన్నటికి ప్రవేశింపవు. "ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు, విజయమందు మరణము మ్రింగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును" (1 కొరింథీయులకు 15:54).

17. Belief in reincarnation is expanding rapidly today. Is this teaching biblical?

17. పునర్జన్మయందలి నమ్మకము నేటి కాలములో అతివేగముగా విస్తరించుచున్నది. ఈ బోధ బైబిలానుసారమైనదేనా?

"బ్రదికి యుందువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేనియందును వారికిక నెప్పటికిని వంతు లేదు" (ప్రసంగి 9:5, 6).

జవాబు : భూమిపై పూర్తిస్థాయిలో మూడవవంతు మంది ప్రజలు పునర్జన్మయందలి సమ్మకముంచుచున్నారు - పునర్జన్మ అనగా ఆత్మ ఎన్నటికీ చావదని, బదులుగా ఒక్కొక్క జన్మలో వేరు వేరు శరీరములతో నిరంతరము పునర్జన్మ పొందునని చెప్పే బోధ. అయితే ఈ బోధ లేఖనములకు వ్యతిరేకమైనది లేక విరుద్ధమైనది.

బైబిలు చెప్పునదేమనగా : మరణించిన తరువాత ఒక వ్యక్తి : తిరిగి మంటి పాలగును (కీర్తనలు 104:29), ఏమియు ఎరుగడు (ప్రసంగి 9:5), మానసిక శక్తులు (సంకల్పములు, తలంపులు) కలిగి యుండలేదు (కీర్తనలు 146:4), భూమిపై జరుగు వాటిలో దేనితో సంబంధము ఉండదు (ప్రసంగి 9:6), బ్రదుకడు (2 రాజులు 20:1), మరియు నిలువక కొనసాగడు (యోబు 14:1, 2).

సాతాను యొక్క రూపకల్పనలు: చనిపోయినవారు బ్రతికే యున్నారనే బోధను సాతాను కనుగొన్నట్లు మనము ఇప్పటికే తెలిసికొనియున్నాము. పునర్జన్మ, కర్ణపిశాచము, ఆత్మలతో సంభాషణ, ఆత్మలకు ఆరాధన, ప్రార్ధన మరియు ఆత్మకు చావు లేదనే అన్యమత అవాస్తవ పురాణము ఇవన్నియు మనము మరణించినప్పుడు మనము నిజముగానే మరణించలేదని ప్రజలను ఒప్పించాలనే ఒకే ఉద్దేశ్యముతో సాతాను కనుగొన్న ఆవిష్కరణలు. చనిపోయినవారు బ్రతికే యున్నారని ప్రజలు విశ్వసించినప్పుడు, వారిని శక్తివంతముగా మోసగించుటకు మరియు వారిని తప్పుదోవ పట్టించుటకు (మత్తయి 24:24) సాతానుడు "సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలను" (ప్రకటన 16:14) ఉపయోగించుకొనగలడు.

18. మరణము అనే ఈ సున్నితమైన అంశముపై మనకు సత్యము బోధించిన బైబిలుకు నీవు కృతజ్ఞుడవైయున్నావా?

నీ జవాబు :


మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు


 

1. సిలువపై ఉన్న దొంగ ఆయన చనిపోయిన దినమందే క్రీస్తుతో కూడ పరదైసుకు వెళ్లలేదా?

జవాబు : లేదు. వాస్తవానికి, ఆదివారము ఉదయమున యేసు ప్రభువు మరియతో, "నేను ఇంకను నా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు" అని చెప్పెను (యోహాను 20:17). క్రీస్తు మరణించిన వెంటనే పరలోకమునకు వెళ్లలేదని ఈ వాక్యము చూపించుచున్నది. నేడు మనము బైబిలులో చూచుచున్న విరామగుర్తులు (కామాలు, పులుస్టాపులు, ఆశ్చర్యార్థకములు) ఆదిమ భాషలో లేవు, కాని శతాబ్దముల తరువాత కాలక్రమేణ అనువాదకులు వాటిని భాషాంతరములలో చేర్చిరి. లూకా 23:43లోని "నేడు" అనే మాట తెలుగు బైబిలులో అదే వచనములో నిశ్చయముగా అనే మాట తరువాత ఉంచి యుంటే సరైన అర్థము వచ్చియుండేది, గనుక ఈ వాక్యము "నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా (నేడు) నీతో చెప్పుచున్నాను" అని చదువబడవలెను. ఈ వాక్యభాగములోని సందర్భమును బట్టి సరిగ్గా అర్థమగుటకు ఈ వచనమును ఇంకో విధముగా : "నేను నేడు నీతో చెప్పుచున్నాను, నేను ఎవరిని రక్షించలేనని అనిపించినప్పుడు, నేనే ఒక నేరస్థుడిగా సిలువ వేయబడుచున్నప్పుడు, నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా (నేడు) నీతో చెప్పుచున్నాను" అని చెప్పవచ్చును. క్రీస్తు మహిమ రాజ్యము ఆయన రెండవ రాకడలో స్థాపించబడును (మత్తయి 25:31), అన్ని యుగాలయందున్న నీతిమంతులు ఆ సమయమందు దానిలోనికి ప్రవేశించుదురు (1 థెస్సలొనీకయులకు 4:15-17) అంతేకాని మరణించిన వెంటనే కాదు.

2. "మరణించని (చావులేని)," "అమరత్వము గల" ఆత్మ గురించి బైబిలులో చెప్పబడలేదా?

జవాబు : లేదు. మరణించని (చావులేని), అమరత్వము గల ఆత్మ గురించి బైబిలులో ప్రస్తావించబడలేదు. “అమరత్వము” అనే మాట బైబిలులో ఒక్కసారి మాత్రమే కనుగొనబడును, అది కూడ దేవుని సూచించుచు ప్రస్తావించబడినది (1 తిమోతి 1:17).

3. మరణమందు శరీరము తిరిగి మన్నయిపోవును మరియు ఆత్మ (లేక ఊపిరి) దేవుని యొద్దకు చేరును. కాని జీవాత్మ ఎక్కడికి పోవును?

జవాబు : అదెక్కడికి వెళ్లదు. బదులుగా, అది కేవలము ఉనికిని కోల్పోవును. జీవాత్మ అగుటకు రెండు విషయముల కలయిక జరుగవలెను : అవి శరీరము మరియు జీవవాయువు లేక ఊపిరి. ఊపిరి ఆగిపోయినప్పుడు, జీవాత్మ ఉనికిని కోల్పోవును ఎందుకనగా అది రెండు విషయముల కలయికమైయున్నది. మనము లైటును ఆపివేసినప్పుడు, వెలుగు ఎక్కడికి పోవును? అదెక్కడికి వెళ్లదు. అది కేవలము ఉనికిని కోల్పోవును. వెలుగును సృష్టించుటకు రెండు విషయముల కలయిక జరుగవలెను : బల్బు మరియు విద్యుత్ (కరెంటు). ఈ కలయిక జరుగకుండ, వెలుగును సృష్టించుట అసాధ్యము. ఇదే జీవాత్మ విషయములో కూడ జరుగును. శరీరము మరియు జీవవాయువు కలయిక జరిగితేనే తప్ప, జీవాత్మ ఉనికిలోనికి రాదు. "దేహమునకు వేరుగా ఉండు జీవాత్మ" వంటిది ఏదియు లేదు.

4. "జీవాత్మ" అనే మాటకు ఒక జీవించే వ్యక్తి అని కాకుండ ఇంకేవైన అర్థములున్నవా?

జవాబు : అవును. (1) జీవము, లేదా (2) మనస్సు లేదా తెలివి (వివేకము) అని కూడ దీనికి అర్ధములున్నవి. ఏ అర్థమును ఉద్దేశించినను, జీవాత్మ అనునది ఇంకను రెండు విషయముల (శరీరము మరియు జీవవాయువు) కలయికయైయున్నది, అది మరణమందు ఉనికిని కోల్పోవును.

5. " బ్రదికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికిని చనిపోడు" (యోహాను 11:26). ఈ వాక్యమును వివరించగలరా?

జవాబు : ఇది ప్రజలందరు సహజముగా మరణించు మొదటి మరణమును కాదు (హెబ్రీయులకు 9:27), కాని దుర్మార్గులు మాత్రమే మరణించు రెండవ మరణమును సూచించుచున్నది. ఈ రెండవ మరణమునకు పునరుత్థానము లేదు (ప్రకటన 2:11; 21:8).

6. "ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి" (మత్తయి 10:28). ఆత్మకు చావు లేదనుటకు ఇది ఋజువు కాదా?

జవాబు : కాదు. దానికి వ్యతిరేకమైన దానిని ఇది ఋజువు చేయుచున్నది. అదే వచనము యొక్క చివరి సగభాగము ఆత్మలకు చావున్నదని ఋజువు చేయుచున్నది. అది "ఆత్మను దేహమును కూడ నరకములో నశింపజేయగల వానికి మిక్కిలి భయపడుడి" అని చెప్పుచున్నది. ఇక్కడ "ఆత్మ" అనే మాటకు జీవము అని అర్థము మరియు నిత్యజీవమును ఇది సూచించుచున్నది, ఇది ఒక బహుమానము (రోమీయులకు 6:23). అంత్యదినమందు అది నీతిమంతులకు ఇయ్యబడును (యోహాను 6:54). దేవుడు అనుగ్రహించు నిత్యజీవమును ఎవరు తీసివేయలేరు. (లూకా 12:4, 5 కూడ చూడుము.)

7. 1 పేతురు 4:6 మృతులకు సువార్త ప్రకటింపబడెనని చెప్పుట లేదా?

జవాబు : లేదు. అది “మృతులకు" సువార్త "ప్రకటింపబడెను" అని చెప్పుచున్నది. వారిప్పుడు మృతులై యున్నారు, కాని వారు బ్రతికి యున్నప్పుడు వారికి సువార్త ప్రకటింపబడినది.

8. ప్రకటన 6:9, 10 లో బలిపీఠము క్రింద నుండి బిగ్గరగా కేకలు వేయుచున్న ఆత్మల సంగతేమిటి? ఈ వాక్యము ఆత్మలు మరణించవని చూపించుట లేదా?

జవాబు : లేదు. ఈ కేక ఉపమానరూపము, హేబెలు రక్తము పెట్టిన మొర లేక కేక వలె (ఆదికాండము 4:10). ప్రకటన 6:9లో ఆత్మ అనే మాటకు వారి విశ్వాసము విషయమై హతసాక్షులుగా మారిన ప్రజలు (లేక జీవించే వ్యక్తులు) అని అర్ధము. మరణించినవారి ఆత్మలు ప్రత్యక్షముగా లేదా అక్షరార్థముగా బలిపీఠము క్రింద ఉందురని గాని, లేదా నీతిమంతులు వారి శత్రువులను శిక్షించమని దేవుని వేడుకొందురని ఖచ్చితముగా ఎవరు నమ్మరు. దీనికి బదులుగా, నీతిమంతులు క్రీస్తు సిలువపై చేసినట్టుగా, వారి శత్రువులను క్షమించమని దేవుని వేడుకొందురు (లూకా 23:34).

9. తన సిలువ మరణమునకు మరియు పునరుత్థానమునకు మధ్య నరకములో నశించిన ఆత్మలకు క్రీస్తు ప్రకటించెనని బైబిలు చెప్పుట లేదా?

జవాబు : లేదు, పై ప్రశ్నలోని బైబిలు వాక్యము 1 పేతురు 3:18-20. ఆయన “ఆత్మరూపిగానే" వెళ్లి నోవహు దినములలో ఆనాడు జీవించుచున్న ప్రజలకు ప్రకటించెను (20వ వచనము). "చెరలో ఉన్న ఆత్మలు" అనే మాట తమ జీవితములు సాతాను బంధకములలో చిక్కుకున్న ప్రజలను సూచించుచున్నది. (కీర్తనలు 142:7; యెషయా 42:6, 7; 61:1; లూకా 4:18 కూడ చూడుము.)

సారాంశ పత్రము

ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.

1) బైబిలు ప్రకారము మరణమనగా (1)

( ) నిద్ర.

( ) వేరొక జీవనాకృతికి మార్పు చెందుట.

( ) వివరించలేని మర్మము.

2) మరణమందు దేవుని యొద్దకు చేరు ఆత్మ ఏమిటనగా (1)

( ) ఒక వ్యక్తి యొక్క నిజమైన అంతర్గత స్వభావము.

( ) జీవాత్మ.

( ) జీవవాయువు (ఊపిరి).

3) మరణించిన వ్యక్తి (1)

( ) పరలోకమునకు లేదా నరకమునకు వెళ్లును.

( ) సమాధిలోనికి వెళ్లును.

( ) పర్గెటరి - దేహము యొక్క పాపమును అగ్ని చేత శుద్ధి చేసికొను స్థలమునకు వెళ్లును.

4) “జీవాత్మఅనగా (1)

( ) ఒక వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక స్వభావము.

( ) ఒక వ్యక్తి యొక్క మరణించని భాగము.

( ) ఒక జీవించే వ్యక్తి.

5) జీవాత్మలు మరణించునా? (1)

( ) అవును.

( ) కాదు.

6) నీతిమంతులు తమ ప్రతిఫలమును ఎప్పుడు పొందెదరు? (1)

( ) ఈ జీవితములోనే.

( ) మరణమందు.

( ) క్రీస్తు రెండవ రాకడయందు.

7) మరణించినవారు నిజముగానే మరణించలేదని చెప్పి ప్రజలను మోసము చేయాలని సాతానుడు ఎందుకు ప్రయత్నించుచున్నాడు? (1)

( ) తద్వారా వారు అతని సూచక క్రియలను నమ్మి మోసగించబడి నశించెదరు.

( ) ఎందుకనగా అతడు వారి విషయమై చింతించుచున్నాడు.

( ) ఎందుకనగా అతడు నీచమైనవాడు మరియు దుర్మార్గుడు.

8) మరణించినవారితో సంభాషించేవ్యక్తులు వాస్తవానికి (1)

( ) అమరత్వము గల ఆత్మలతో మాట్లాడుచున్నారు.

( ) పరిశుద్ధ దేవదూతలతో మాట్లాడుచున్నారు.

( ) మరణించిన ప్రియుల వలె కనబడు దురాత్మలతో మాట్లాడుచున్నారు.

9) మోషే దినములలో దేవుడు ఆజ్ఞాపించిన దేమనగా, మృతులు బ్రతికేయున్నారని బోధించిన వారందరు (1)

( ) యాజకులుగా నియమించబడవలెను. .

( ) వారి తెలివికి గౌరవించబడవలెను

( ) చంపబడవలెను.

10) ఒక వ్యక్తి తాను సురక్షితముగాను మరియు సరైన మార్గములో ఉన్నాడని ఎట్లు నిర్ధారించుకొనగలడు? (1)

( ) పరలోకము నుండి ఒక ప్రత్యేక సూచన కొరకు దేవునిని అడుగుట ద్వారా.

( ) సంఘకాపరి లేదా పాస్టర్ గారు ఏది చెబితే అది చేయుట ద్వారా.

( ) బైబిలును ప్రార్థనాపూర్వకముగా మరియు శ్రద్ధగా చదువుచు దానిని అనుసరించుట ద్వారా.

11) ఒక వ్యక్తి మరణించినప్పుడు (1)

( ) అతని ఆత్మ, లేదా జీవము బ్రతికే ఉండును.

( ) అతడు బ్రతికియున్నవారిని గమనించుచు వారిని సంప్రదించగలడు.

( ) అతడు అన్ని విధములుగా చనిపోయెను - శరీరము చనిపోయెను, ఆత్మ ఉనికిని కోల్పోయెను, మరియు బ్రతికియున్నవారితో ఏ సంబంధమైనను కలిగియుండుట అసాధ్యము.

12) సూచక క్రియలు ఏదో దేవుని నుండే సంకేతమనుటకు ఋజువా? (1)

( ) అవును, దేవుడు మాత్రమే సూచక క్రియలు చేయగలడు.

( ) కాదు, అపవాది కూడ గొప్ప సూచక క్రియలు చేయగలడు.

13) మరణము అనే ఈ సున్నితమైన అంశముపై మనకు సత్యము బోధించిన బైబిలుకు నేను కృతజ్ఞుడనైయున్నాను.

( ) అవును.

( ) లేదు.