Lesson 2
సాతానుడు ఎవరు? అతడు కేవలము ఒక అబద్దమైన కల్పిత వ్యక్తి అని చాలామంది నమ్ముచున్నారు, కాని అతడు చాలా నిజమైన వ్యక్తియని మరియు నిన్ను మోసము చేసి నీ జీవితమును నాశనము చేయాలని అతడు నిశ్చయించుకొన్నాడని బైబిలు చెప్పుచున్నది. నిజమే, ఈ తెలివైన కాని క్రూరమైన సూత్రధారి నీవు చెప్పబడిన దానికంటే చాలా ఎక్కువే. అతడు ఈ ప్రపంచములో దుఃఖమును మరియు బాధను పెంపొందించుటకు వ్యక్తులను, కుటుంబములను, సంఘములను మరియు దేశములన్నిటిని సహితము తన ఉచ్చుల్లో చిక్కుకొనజేయుచున్నాడు. ఈ చీకటి యువరాజు గురించి మరియు నీవు అతనిని ఎట్లు ఎదిరించగలవో అనుదాని గురించి బైబిలు తెలియజేయు అద్భుతమైన సత్యములు ఇచ్చటున్నవి!
1. పాపము ఎవరితో పుట్టెను లేక ప్రారంభమాయెను?
"అపవాది (సాతాను) మొదట నుండి పాపము చేయుచున్నాడు" (1 యోహాను 3:8). "అపవాదియనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహా ఘటసర్పము" (ప్రకటన 12:9).
జవాబు : అపవాది అనియు పిలువబడే సాతానుడే పాపమును ప్రారంభించినవాడు. లేఖనములు లేకపోయిన యెడల, పాపము యొక్క ప్రారంభము వివరణ లేకుండ మిగిలిపోయి యుండేది.
2. పాపము చేయక మునుపు సాతానుని పేరు ఏమిటి? ఆ సమయములో అతడు ఎక్కడ నివసించుచుండెను?
“తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశము నుండి పడితివి?” (యెషయా 14:12). యేసు, “సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితిని” (లూకా 10:18) అని పలికెను. "దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి" (యెహెజ్కేలు 28:14).
జవాబు : అతని పేరు లూసిఫరు (తేజోనక్షత్రము), అతడు పరలోకములో నివసించుచుండెను. లూసిఫరు యెషయా 14వ అధ్యాయములోని బబులోను రాజుగాను మరియు యెహెజ్కేలు 28వ అధ్యాయములోని తూరు రాజుగాను సూచింపబడెను లేక పోల్చి చెప్పబడెను.
3. లూసిఫరు యొక్క మూలము లేక ఆరంభమేమిటి? బైబిలు అతనిని ఎట్లు వర్ణించుచున్నది?
“నీవు నియమింపబడితివి (సృష్టింపబడితివి)” (యెహెజ్కేలు 28:13, 15). “అభిషేకము నొందిన కెరూబువై యొక్క ఆశ్రయముగా నీవుంటివి” (యెహెజ్కేలు 28:14). "పూర్ణజ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి", ... (అనేక) “అమూల్య రత్నములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు” ... “నీవు నియమింపబడిన (సృష్టింపబడిన) దినమున పిల్లనగ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి” ... నీవు నియమింపబడిన (సృష్టింపబడిన) దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి" (యెహెజ్కేలు 28:12-15).
జవాబు : సమస్త దేవ దూతల వలె, లూసిఫరు కూడ దేవుని చేత సృష్టింపబడెను (ఎఫెసీయులకు 3:9). లూసిఫరు ఒక "ఆశ్రయముగా ఉండు" కెరూబుగా లేక దేవదూతగా ఉండెను. ఒక మహా దేవదూత దేవుని సింహాసనమునకు ఎడమ ప్రక్కను మరొక దేవదూత కుడి ప్రక్కను ఉండును, "ఆయన కెరూబుల మీద ఆసీనుడై యున్నాడు” (కీర్తనలు 99:1). అత్యధికముగా హెచ్చింపబడిన దేవదూతల నాయకులలో లూసిఫరు ఒకడు. లూసిఫరు సౌందర్యవంతుడు. అతని సౌందర్యము దోషరహితమును మరియు ఉత్కంఠభరితమునై యున్నది. అతని జ్ఞానము పరిపూర్ణమైనది. అతని వెలుగు బహుప్రేరణగలది. ప్రఖ్యాతిగాంచిన సంగీతకారునిగా నిలువబెట్టుటకై అతని స్వరము ప్రత్యేకించి తయారు చేయబడినదిగా యెహెజ్కేలు 28:13వ వచనము బహుశ సూచించుచున్నది, "పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి." అతడు దేవదూతల సంగీత బృందమును నడిపించినట్లుగా కొందరు భావించుచున్నారు.
4. లూసిఫరు జీవితములో దేవునికి వ్యతిరేకముగా తిరుగుటకు దారితీసినదేమిటి? అతడు చేసిన పాపమేమిటి?
“నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి” (యెహెజ్కేలు 28:17). “దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ... మహోన్నతునితో నన్ను సమానునిగా చేసికొందును అని నీవు మనస్సులో అనుకొంటివి గదా?” (యెషయా 14:13, 14).
జవాబు : గర్వము, అసూయ, అసంతృప్తి, మరియు తన్ను తాను హెచ్చించుకొను స్వభావము అతని జీవితములో పుట్టెను. సింహాసనము నుండి దేవునిని తొలగించి సమస్త ఆరాధనకు తానే పాత్రుడు కావాలని లూసిఫరు నిర్ణయించుకొనెను. ఇది అత్యంత హీనమైన రాజద్రోహము.
ముఖ్య గమనిక : ఆరాధన అనే విషయము ఎందుకు అంత ప్రాముఖ్యమై యున్నది? దేవునికి మరియు సాతానుకు మధ్య కొనసాగుతున్న మహా సంఘర్షణలో ఆరాధన అనే విషయము ఎంతో కీలకమైన అంశమునై యున్నది. పూర్తిగా దేవునిని మాత్రమే ఆరాధించుటకు ప్రజలు సృష్టింపబడిరి. వారు సంతోషముగా సఫలీకృతులుగా ఉండేది ఆయనను ఆరాధించినప్పుడే. పరలోకమందున్న పాపము చేయని దేవదూతలు కూడా ఆరాధనకు యోగ్యులు కారు (ప్రకటన 22:8, 9). ఆదియందు సాతాను ఆరాధించబడవలెనని కోరుకొనెను. శతాబ్దములు గడిచిన తరువాత, యేసును అతడు అరణ్యములో శోధించినప్పుడు, ఆరాధన అనే విషయము ఇంకను ఒక కీలకమైన అంశముగానే ఉన్నది (మత్తయి 4:8-11). చివరి దినములలో అందరును ఆయననే ఆరాధించుటకు దేవుడు పిలుచుచున్నాడు (ప్రకటన 14:6, 7). ఈ విషయము సాతానుకు ఎంత ఆగ్రహము పుట్టించునంటే, తనను మాత్రమే ఆరాధించవలెనని అతడు ప్రజలను, బలవంతపెట్టును, లేని యెడల వారు చంపబడెదరు (ప్రకటన 13:15). ప్రతి ఒక్కరు ఎవరినో ఒకరిని, ఏదో ఒక దానిని ఆరాధించెదరు. అవి : అధికారము, పలుకుబడి, ఆహారము, సుఖభోగము, ఆస్తి, ఒకరి సొంత అభిప్రాయము మొదలగునవి. దేవుడు, "నేను తప్పు వేరొక దేవుడు నీకు ఉండకూడదు" అని చెప్పుచున్నాడు. (నిర్గమకాండము 20:3). ఆయనను మాత్రమే మనము ఆరాధించకపోయిన యెడల, ఆయనకు వ్యతిరేకులుగా మనలను దేవుడు యెంచును (మత్తయి 12:30). ఈ వార్త వినుటకు ఆశ్చర్యముగా ఉన్నను, ఇది వాస్తవము. దేవుడు తప్ప మరెవరైనను లేక ఏదైనను నా జీవితములో మొదటి స్థానము పొందిన యెడల, నేను బహుశ తెలియకుండానే సాతానుని ఆరాధించుచు అతనిని బలపర్చుచున్నాను. దేవుడు నా జీవితములో ప్రథమస్థానమును కలిగియున్నాడా? లేక నాకు తెలియకుండానే సాతానుని హెచ్చించుచున్నానా? ఇది సరిగా ఆలోచించవలసిన ప్రశ్న. అవును కదూ?
5. లూసిఫరు చేసిన పాపమునకు పర్యవసానముగా పరలోకములో ఏమి జరిగెను?
"అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువ లేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి" (ప్రకటన 12:7-9).
జవాబు : లూసిఫరు మూడవవంతు మంది దేవదూతల (ప్రకటన 12:3, 4) సహకారమును సంపాదించుకొని, పరలోకములో ఒక తిరుగుబాటుకు కారకుడాయెను. అంతట సాతానుని అతని దూతలను పరలోకము నుండి బహిష్కరించుట తప్ప దేవునికి వేరొక మార్గము లేకపోయెను. ఇప్పటి వరకు పోరాడిన యుద్ధములలో ఇదే మహా గొప్ప యుద్ధము. చివరకు అది అతనిని హంతకుని వరకు తీసికొని వెళ్లినను (యోహాను 8:44), దేవునిని తన సింహాసనము నుండి తొలగించి బలాత్కారముగా దానిని ఆక్రమించుకొనుటయే లూసిఫరు యొక్క లక్ష్యమైయుండెను. అతడు పరలోకము నుండి బహిష్కరించబడిన తరువాత, లూసిఫరు సాతాను (విరోధి) అనియు, అపవాది (దూషకుడు) అనియు, మరియు అతని దూతలు దయ్యములనియు పిలువబడిరి.
6. సాతానుని ప్రస్తుత ప్రధాన కార్యాలయము ఎక్కడున్నది? అతడు ప్రజల గురించి ఎట్టి భావన కలిగియున్నాడు?
"యెహోవా - నీవు ఎక్కడ నుండి వచ్చితివని వాని నడుగగా అపవాది - భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరమిచ్చెను" (యోబు 2:2). "భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది (అనగా, సాతాను) తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహుక్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు" (ప్రకటన 12:12). "మీ విరోధియైన అపవాది (సొతాను) గర్జించు సింహము వలె ఎవరిని మ్రింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు" (1 పేతురు 5:8).
జవాబు : ప్రజాదరణ పొందిన అభిప్రాయములకు భిన్నముగా, సాతాను యొక్క ప్రధాన కార్యాలయము భూమియే కాని నరకము కాదు. దేవుడు ఆదాము హవ్వలకు సమస్త భూమి మీద అధికారము ననుగ్రహించెను (ఆదికాండము 1:26). వారు పాపము చేసినప్పుడు, అది సాతానుకు అప్పగింపబడెను (రోమీయులకు 6:16). అప్పుడు సాతాను ఈ భూమికి అధికారిగాను మరియు ప్రతినిధిగాను నియమించబడెను (యోహాను 12:31). దేవుని స్వరూపమందు సృష్టింపబడిన మానవులంటే అపవాదికి అతీతమైన ద్వేషము. అతడు దేవునిని తాకలేడు. అందుచేత, ఆయన పిల్లలైన మానవుల మీద తన విషస్వభావముతో కూడిన ప్రతీకారమును తీర్చుకోవాలని తలంచాడు. అతడు ద్వేషపూర్ణుడు. నిన్ను నాశనము చేసి తద్వారా దేవునికి బాధ కలిగించాలని తలంచే దుష్టనరహంతకుడు.
7. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు, చేయకూడదని ఆయన వారితో చెప్పిన సంగతి ఏమిటి? అవిధేయతకు ఫలితముగా ఏమి జరుగునని ఆయన చెప్పెను?
"అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను" (ఆదికాండము 2:17).
జవాబు : మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను వారు తినకుండ ఉండవలసి యుండెను. ఆ వృక్ష ఫలములను తిని అవిధేయత చూపినందుకు వారు మరణశిక్ష నొందవలసి యుండెను.
ముఖ్య గమనిక : ఆదాము హవ్వలను దేవుడు తన స్వహస్తములతో సృజించి వారు కేవలము ఒకటి తప్ప ప్రతి విధమైన చెట్టు ఫలములను తినుచు ఆనందించుటకు ఒక సుందరమైన తోటలో వారినుంచెనని జ్ఞాపకముంచుకొనుము (ఆదికాండము 2:7-9). సానుకూలమైన ఎంపిక స్వతంత్రము వారికనుగ్రహించుటలో ఇది దేవుని కృపా మార్గమునైయున్నది. దేవుని మాటయంద నమ్మిక యుంచి నిషేధించబడిన చెట్టు ఫలము తినకుండుట ద్వారా వారు పరదైసులో (అనగా బయటకు పంపివేయబడకుండ ఏదెను తోటలోనే) చిరకాలము జీవించెదరు. సాతాను మాట వినుటకు ఎంపిక చేసికొనుట ద్వారా, వారు సమస్త జీవమునకు మూలమైన దేవుని నుండి పారిపోవుటకు నిర్ణయించుకొని, స్వభావపూర్వకముగా మరణము ననుభవించిరి.
8. సాతానుడు హవ్వను ఎట్లు మోసము చేసెను? అతడు ఆమెకు చెప్పిన అబద్ధములేమిటి?
"దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై యుండెను. అది ఆ స్త్రీతో - ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? అని అడిగెను." ... "సర్పము - మీరు చావనే చావరు; ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరువబడుననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియునని స్త్రీతో చెప్పెగా" (ఆదికాండము 3:1, 4, 5).
జవాబు : హవ్వను మోసగించుటకై దేవుడు చేసిన భూజంతువులన్నిటిలో యుక్తి మరియు అత్యంత ఆకర్షణ కలిగిన సర్పమును సాతానుడు మాధ్యమముగా ఉపయోగించుకొనెను. సర్పము మొట్టమొదట రెక్కలు కలిగి ఎగురుచుండేదని కొందరు భావించుచున్నారు (యెషయా 14:29, 30:6). దేవుడు శపించేంత వరకు అది ప్రాకలేదని మనము గుర్తుంచుకొనవలెను (ఆదికాండము 3:14). సాతాను చెప్పిన అబద్ధములేవనగా :- (1) మీరు చావనే చావరు, మరియు (2) పండు తినుట ద్వారానే మీరు జ్ఞానవంతులగుదురు. హవ్వతో చెప్పిన అబద్ధముతో, అబద్ధమునకు జనకుడైన సాతానుడు (యోహాను 8:44), కొంత నిజమును కూడ కలగల్పెను. కొంత నిజముతో కలగల్పబడిన అబద్ధము అన్నిటి కంటే ప్రభావితమైనది. పాపము చేసిన తరువాత వారు "చెడును ఎరుగుదురన్న" మాట వాస్తవమే. దేవుడు ప్రేమాస్వరూపి గనుక, హృదయవేదన, విచారము, బాధ, నొప్పి, మరియు మరణము అను వాటి విషయములు జ్ఞానము వారికి తెలియకుండ చేసెను. సాతాను నేడు చేయుచున్న విధముగా, చెడు యొక్క జ్ఞానమును ఆకర్షణీయముగా వారికి కనబరచెను. దేవుని స్వభావమును వక్రీకరించుటకై సాతాను అబద్ధమాడెను. ఎందుకనగా ఆయన స్వభావమును అపార్ధము చేసికొంటేనే తప్ప అంతటి ప్రేమామయుడైన దేవుని యొద్ద నుండి ఎవరు ఎన్నటికి తొలగిపోలేదని సాతానుకు తెలియును.
9. పండు యొక్క చిన్న ముక్క తినుట ఎందుకు ఆదాము హవ్వలను తోట నుండి పంపివేసేంత చెడ్డ పాపమైయున్నది?
"కాబట్టి మేలైనది చేయ నెరిగియు ఆలాగు చేయనివానికి పాపము కలుగును" (యాకోబు 4:17). “ఆజ్ఞాతిక్రమమే పాపము” (1 యోహాను 3:4). "పాపము చేయువాడు అపవాది సంబంధి" (1 యోహాను 3:8). “అప్పుడు దేవుడైన యెహోవా - ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు, ఆదాము మనలో ఒకనివంటివాడాయెను. కాబట్టి అతడు ఒక వేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడ తీసికొని తిని నిరంతరము జీవించునేమో అని” ... “ఆదామును వెళ్లగొట్టి ఏదెను తోటకు తూర్పుదిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను” (ఆదికాండము 3:22, 24).
జవాబు : అవును, పండులో చిన్న ముక్క తినుటయు పాపమే ఎందుకనగా అది ప్రత్యక్షముగా మీరిన దేవుని కొన్ని షరతులలో ఒకటి. అట్లు చేయుట దేవుని ధర్మశాస్త్రము పట్లను మరియు అధికారము పట్లను బహిరంగముగా తిరుగుబాటు చేయుటయే. దేవుని ఆజ్ఞలలో ఒక దానిని మీరుట ద్వారా, ఆదాము హవ్వలు దేవుని శత్రువైన సాతానుతో చేతులు కలిపి, వారికిని మరియు దేవునికి మధ్య యెడబాటును కొనితెచ్చిపెట్టుకొనిరి (యెషయా 59:2). ఆ దంపతులు పాపము చేసి జీవవృక్ష ఫలమును తిని, పాపులుగా అమరులగుదురని సాతాను ఆశించినను, అటువంటి విషాదము జరుగకుండ దేవుడు తోట నుండి వారిని పంపివేసెను.
10. ప్రజలను బాధపెట్టుటకు, మోసగించుటకు, నిరుత్సాహపరచుటకు మరియు నాశనము చేయుటకు సాతానుని పద్ధతుల గురించి బైబిలు ఏమి వెల్లడించుచున్నది?
జవాబు : ప్రజలను మోసగించుటకును మరియు వారిని నాశనము. చేయుటకును సాతాను సాధ్యమైన ప్రతి పద్ధతిని ప్రయోగించును. అతని దూతలు (దయ్యములు) నీతిమంతులుగాను, సాధ్యమైతే వాక్యము బోధించు దేవుని సేవకులుగాను తమను తాము కనబరచుకొందురు. సాతాను వెలుగుదూత వేషము ధరించుకొని పరలోకము నుండి అగ్నిని కురిపించగల శక్తి కలిగియుండును. అతడు యేసు వేషము ధరించుకొనును. కాని నీవు హెచ్చరింపబడి యున్నావు గనుక మోసములో పడవద్దు.
యేసు వచ్చునప్పుడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. (ప్రకటన 1:7). ఆయన అస్సలు భూమిని తాకకుండ ఆకాశములో మేఘముల యందే నిలుచును (1 థెస్సలొనీకయులకు 4:17).
సాతానుని స్వభావమును గూర్చి బైబిలు ఇట్లు చెప్పుచున్నది:
మోసగించును / హింసించును (ప్రకటన 12:9, 13) | ఉన్నది లేనట్టుగా / లేనిది ఉన్నట్టుగా బైబిలును వక్రీకరించును
(మత్తయి 4:5, 6) |
తప్పుగా నిందించును/ నరహత్య చేయును (ప్రకటన 12:10; యోహాను 8:44) | ఉచ్చు బిగించును / చిక్కులు పెట్టును
(2 తిమోతి 2:26; 1 పేతురు 5:8) |
దేవుని ప్రజలకు విరోధముగా యుద్ధము చేయును (ప్రకటన 12:17) | బంధించును/ ద్రోహము చేయును
(లూకా 13:16; యోహాను 13:2, 21) |
నిర్బంధించును (ప్రకటన 2:10) | స్వాధీనపరచుకొనును / ఆటంకపరచును
(లూకా 22:3-5; 1 థెస్సలొనీకయులకు 2:18) |
సూచక క్రియలు చేయును/ అబద్ధమాడును (ప్రకటన 16:13,14; యోహాను 8:44) | వెలుగుదూత వేషము ధరించుకొనును
(2 కొరింథీయులకు 11:13-15) |
రోగములు కలిగించును / వేధించును
(యోబు 2:7) |
అతని దయ్యములు వాక్యము బోధించు దేవుని సేవకుల
వేషము ధరించుకొందురు (2 కొరింథీయులకు 11:13-15) |
అపనింద కలిగించును. "అపవాది" అంటేనే "నిందించువాడు". | పరలోకము నుండి అగ్ని కురిపించును (ప్రకటన 13:13) |
11. సాతానుని శోధనలు మరియు వ్యూహములు ఎంత ప్రభావితమైనవి మరియు శక్తివంతమైనవి?
అతడు : మూడవ వంతు మంది దేవదూతలను ఒప్పించెను (ప్రకటన 12:3-9); ఆదాము హవ్వలను ఒప్పించెను (ఆదికాందము 3); నోవహు దినములలో ఎనిమిది మందిని తప్ప మిగతా వారందరిని ఒప్పించెను (1 పేతురు 3:20). అతడు నశించినవారికి రక్షింపబడినామనే భావనను కలిగించును (మత్తయి 7:21-23). భూజనులందరు యేసును వెంబడించుటకు బదులు అతనిని (అపవాదిని) వెంబడింతురు (ప్రకటన 13:3). "కొందరే రక్షింపబడుదురు" (మత్తయి 7:14; 22:14).
జవాబు : సాతానుడు విజయము పొందుచున్న విధము దిగ్భ్రాంతిని కలిగించునదిగాను, నమ్మశక్యము కానిదిగాను అగుపడును అతడు మూడవ వంతు మంది దేవదూతలను మోసగించెను. నోవహు దినములలో ఎనిమిది మందిని తప్ప మిగతా వారందరిని మోసగించెను. యేసు రెండవ రాకడకు ముందు, సాతాను క్రీస్తు వేషము ధరించుకొని, వెలుగు దూత వలె అగపడును. అతని మోసపూరిత శక్తి ఎంత గొప్పగా ఉండునంటే అతనిని చూచుటకు వెళ్లకుండ ఉండుటయే మనకు ఏకైక భద్రత అగును (మత్తయి 24:23-26). సాతాను వైపు చూడకూడదనియు మరియు అతని మాట వినకూడదని నీవు దృఢముగా నిశ్చయించుకొనిన యెడల, యేసే నిన్ను ఆ మోసము నుండి కాపాడును (యోహాను 10:29). (యేసు రెండవ రాకడను గూర్చిన మరింత సమాచారము కొరకు 8వ స్టడీ గైడ్ పత్రికను చూడుము.)
12. అవవాది తన శిక్షను ఎప్పుడు, ఎక్కడ పొందును? ఆ శిక్ష ఏమిటి?
"ఆలాగే యుగ సమాప్తియందు జరుగును ... మనుష్యకుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములో నుండి ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు" (మత్తయి 13:40-41). “వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడెను" (ప్రకటన 20:10). "శపింపబడినవారలారా, నన్ను విడిచి అపవాదికిని (అనగా, సాతానుకును) వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి" (మత్తయి 25:41). “నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను, అది నిన్ను కాల్చివేయును, జనులందరు చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదెగా చేసెదను ... నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు" (యెహెజ్కేలు 28:18, 19).
ఈ యుగ సమాప్తియందు, సాతానుడు అగ్నిగుండములో పడద్రోయబడును, ఆ అగ్ని అతనిని బూడిదెగా మార్చివేసి ఇక ఎన్నటికి ఉనికిలో లేకుండ చేయును.
జవాబు : ఈ యుగసమాప్తి యందు ఈ భూమిపై అపవాది పాపమును నాశనము చేయు అగ్నిలో పడద్రోయబడును. తన పాపమునకు, ఇతరులను పాపము చేయునట్లు శోధించినందుకు, మరియు దేవుడు ప్రేమించిన ప్రజలను బాధపెట్టి, నాశనము చేసినందుకు అపవాదితో దేవుడు తగిన విధముగా వ్యవహరించును.
ముఖ్య గమనిక : తన సొంత సృష్టియైన సాతానును ఈ అగ్నిలో పడవేసినప్పుడు దేవుడు అనుభవించు వేదనను తగినవిధముగా వర్ణించుట సాధ్యము కాదు. ఇది అగ్నిలో పడద్రోయబడువారికి మాత్రమే కాదు, ప్రేమయందు వారిని సృష్టించిన దేవునికి మరియు ఆయన కుమారునికి కూడ ఇది ఎంతో బాధాకరముగా ఉండును. (నరకము గురించి మరింత సమాచారము కొరకు, 11వ స్టడీ గైడ్ పత్రికను చూడుము.)
13. పాపమనే భయంకరమైన సమస్యను చివరకు ఏది పరిష్కరించును? పాపము ఇక మరల ఎప్పుడైన తలెత్తునా?
"నా తోడు, ప్రతి మోకాలును నా యెదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు" (రోమీయులకు 14:11). (ఫిలిప్పీయులకు 2:10, 11; యెషయా 45:23 కూడ చూడుము). "బాధ రెండవమారు రాకుండ ఆయన బొత్తిగా దానిని నివారణ చేయును" (నహూము 1:9).
జవాబు : రెండు కీలకమైన సంఘటనలు మరెన్నడును సంభవింపకుండ పాపమనే సమస్యను పరిష్కరించును:
మొదటిది : పరలోకమందు మరియు భూమి మీద ఉన్న జీవులందరు, అపవాది మరియు అతని దూతలతో సహా దేవుని యెదుట మోకరించి, దేవుడు సత్యవంతుడు, నీతిమంతుడు మరియు న్యాయవంతుడని బహిరంగముగా ఒప్పుకొందురు. సమాధానము చెప్పబడకుండ ఏ ప్రశ్నయు మిగల్చబడదు. దేవుని ప్రేమను మరియు రక్షణను బుద్ధిపూర్వకముగా అంగీకరించకపోవడము వలననే తాము నశించిపోయామని పాపులందరును బాహాటముగా ఒప్పుకొందురు. తాము మరణించుట న్యాయసమ్మతమేనని, శాశ్వత మరణము నొందుటకు తాము పాత్రులమని కూడ వారు ఒప్పుకొందురు.
రెండవది : పాపము, పాపులు, అపవాది, మరియు అతని దూతల అంతిమ నాశనము ద్వారా పాపము ఈ విశ్వము నుండి పూర్తిగా నిర్మూలము చేయబడును. దేవుడు ఈ విషయములో సానుకూలముగా ఉన్నాడు. దేవుని విశ్వమును పాడు చేయుటకు పాపము ఇక మరల తలెత్తదు.
14. విశ్వము నుండి పాపము యొక్క తుది. సంపూర్ణ నిర్మూలనను ఎవరు నిశ్చయము (నిజము) చేసెను?
"అపవాది (సాతాను) యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను" (1 యోహాను 3:8). "కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలముగలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయన కూడ రక్తమాంసములలో పాలివాడాయెను" (హెబ్రీయులకు 2:14).
జవాబు : తన జననము, మరణము, మరియు పునరుత్థానము ద్వారా, యేసు పాపము యొక్క నివారణను నిశ్చయము (నిజము) చేసెను.
15. ప్రజల గురించి దేవుడు నిజముగా ఎట్లు భావించుచున్నాడు?
"తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు". (యోహాను 16:27). (యోహాను 3:16; 17:22, 23 కూడ చూడుము).
జవాబు : కుమారుడు ప్రేమించునంతగా తండ్రియు ప్రజలను ప్రేమించుచున్నాడు. తన తండ్రి స్వభావమును తన సొంత జీవితములో వ్యక్తపరచి తండ్రి నిజముగా ఎంత ప్రేమామయుడో, ప్రియమైనవాడో, మరియు ఆదరించువాడో. ప్రజలకు వివరించుటయే యేసు యొక్క ప్రధాన జీవిత ధ్యేయము (యోహాను 5:19).
సాతానుడు తండ్రి స్వభావమును తప్పుగా చిత్రీకరించును
సాతానుడు తండ్రియైన దేవుని స్వభావమునకు తన సొంత లక్షణములు జోడించి, కరుణ లేనివాడుగాను తిరస్కరించువాడుగాను, కఠినాత్ముడుగాను, మరియు ఆదరించనివాడుగాను ఆయనను తప్పుగా చిత్రీకరించును. అతడు జరిగించు ఘోరమైన, విపరీత చర్యలను సహితము “దేవుని చర్యలు”గా ఆపాదించును. తండ్రి. నామమునకు కలిగిన ఈ అపవాదును తుడిచిపెట్టి, తల్లి తన బిడ్డను ప్రేమించు దానికంటే ఎక్కువగా మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించునని దృష్టాంతపరచుటకు యేసు వచ్చెను (యెషయా 49:15). దేవుని ఓర్పు, మృదుత్వము, మరియు ఎనలేని దయ ఇవి మూడును యేసు యొక్క ముఖ్య ఉద్దేశ్యములైయున్నవి.
తండ్రి ఇంక వేచియుండలేదు, అనగా ఇంకను ఓర్పుతో ఎదురుచూచుచున్నాడు.
ప్రజలను అత్యున్నతముగా సంతోషపరచుటకై, మన పరలోకపు తండ్రి వారి కొరకు ఒక మహా అద్భుత గృహమును సిద్ధపరచెను. మన కలలు ఆయన సిద్ధము చేసిన వాటికి సరిపోల్చదగినవి కావు! ఆ రాబోవు సంతోషకరమైన గృహప్రవేశ దినమందు తన ప్రజలను ఆహ్వానించుటకై ఆయన ఎదురుచూచుచున్నాడు. ఆయన మాట విందము! మనలను మనము సిద్ధపరచుకొందము. తుది సన్నాహములు (అంతిమ ఏర్పాట్లు) ఇప్పటికే ప్రారంభమైనవి.
16. యేసు ప్రేమించునంతగా తండ్రియైన దేవుడు నిన్ను ప్రేమించున్నాడన్న విషయమును శుభవార్తగా నీవు భావించుచున్నావా?
నీ జవాబు :
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. ఆదాము హవ్వలు తినిన ఫలము యాపిల్ పండేనా?
జవాబు : మనకు తెలియదు. బైబిలు దీనిని గూర్చి ఏమియు చెప్పలేదు.
2. కొమ్ములు మరియు తోకతో అపవాదిని ఎర్రగా, సగము మనిషి సగము మృగము పలె చిత్రీకరించే భావన ఎక్కడ నుండి వచ్చినది?
జవాబు : ఇది అన్యమత పురాణము నుండి వచ్చినది మరియు అపవాదికి ఆనందమును కలుగజేయుచున్నది. బుద్ధిమంతులు వికృతాకారము గల రాక్షసులను కల్పిత కథగా తీసిపారవేయుదురు గనుక అది తన ఉనికిని ప్రజలు నమ్మని విధముగా చేయునని అపవాదికి తెలియును. అపవాది (దయ్యముల) యందు నమ్మిక ఉంచనివారే అతని మోసముల చేత మొదటగా పట్టుబడుదురు.
3. దేవుడు ఆదాము హవ్వలతో, "నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు" అని చెప్పెను (ఆదికాండము 2:17). అయితే వారు ఆ దినమందే ఎందుకు చావలేదు?
జవాబు: బైబిలు రెండు మరణములను గూర్చి మాట్లాడుచున్నది :
- "మొదటిది" మనమందరము పొందు భౌతిక మరణము (హెబ్రీయులకు 9:27).
- "రెండవది" ఈ యుగాంతమందు పాపులు నరకాగ్నిలో పొందు శాశ్వత మరణము (ప్రకటన 21:8).
వీటిలో వ్యత్యాసమేమిటనగా రెండవ మరణమునకు పునరుత్థానము లేదు. అది శాశ్వత మరణము.
యేసు ప్రతి ఒక్కరి నిమిత్తము రెండవ మరణము పొందెను
ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు, యేసు ముందుకు వచ్చి ప్రతి ఒక్కరి నిమిత్తము కల్వరి సిలువలో రెండవ మరణము పొందుటకు తనను తాను అప్పగించుకొనక పోయిన యెడల, వారు ఆ క్షణమే రెండవ మరణము పొందియుండేవారు. ఆయన మహోన్నతమైన త్యాగమే వారిని తప్పించెను (హెబ్రీయులకు 2:9).
ఆదాము పాపము చేసినప్పుడు, అతని “మరణము లేని” స్వభావము, ఒక “మరణించు” స్వభావముగా మారెను
మొదటి మరణమునకు సంబంధించి, ఆదికాండము 2:17లో వాడబడిన "చచ్చెదవు" అనే మాట యొక్క అనువాదము అనేక బైబిలు మార్జిన్లలో లిఖించబడిన "కాలము గడుచుచున్న కొలది అంచెలంచెలుగా నీవు మరణించెదవు" అనే వాక్యమును సూచించుచున్నది. ఈ వాక్యము ఆదాము హవ్వలు చనిపోయే ప్రక్రియలోనికి ప్రవేశించుదురనే భావనను వెల్లడి చేయుచున్నది. పాపము చేయకమునుపు ఆ దంపతులు "చనిపోని పాపము లేని" స్వభావమును కలిగియుండిరి. ఈ స్వభావము జీవవృక్ష ఫలములు తినుట ద్వారా నిరంతరీకరించబడును. పాపము చేసిన మరుక్షణము, వారి స్వభావములు "చనిపోయే పాపపు" స్వభావములుగా మార్చబడెను. దీనిని దేవుడు ముందుగానే ఊహించెను. వారు జీవవృక్షము వద్ద నుండి బహిష్కరించబడి, క్షయమై (జీవ కణజాలము కుళ్లిపోయి) మరియు క్షీణించిపోయి చివరకు మరణించే ప్రక్రియ తక్షణమే మొదలాయెను. సమాధి వారికి నిశ్చయమాయెను. తరువాత ఇదే విషయమును దేవుడు వారితో, "ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి; . నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని" నొక్కి చెప్పెను (ఆదికాండము 3:19).
4. కాని లూసిఫరును దేవుడే సృష్టించెను గనుక, అతని పాపమునకు ఆయనే నిజముగా బాధ్యుడు కాడా?
జవాబు : కానే కాదు. దేవుడు లూసిఫరును ఒక పరిపూర్ణమైన, పాపములేని దేవదూతగా సృష్టించెను. లూసిఫరు తనను తానే ఒక అపవాదిగా మార్చుకొనెను. దేవుని ప్రభుత్వములో ఎంపిక చేసికొనే స్వతంత్రము గీటురాయి సూత్రముగా ఉన్నది. లూసిఫరును సృష్టించినపుడు అతడు పాపము చేయునని దేవుడు ఎరిగియుండెను. ఆ సమయమందు అతనిని సృష్టించుటకు దేవుడు నిరాకరించి యుండిన యెడల, ఎంపిక స్వతంత్రమనే ప్రథమ సూత్రమును ఆయన తిరస్కరించువాడగును.
"ఎంపిక చేసికొను స్వతంత్రము" దేవుని మార్గనిర్దేశిత సూత్రము
లూసిఫరు ఏమి చేయునో దేవుడు ముందుగానే బహుబాగుగా ఎరిగియుండి అతనిని సృష్టించెను. ఇవే వాస్తవములు ఆదాము హవ్వల సృష్టికి కూడ వర్తించును. ఇంకా దగ్గరగా చెప్పాలంటే, అవి నీకును మరియు నాకును వర్తించును. మనము ఏ విధముగా జీవించుదుమో మనలను సృష్టింపక మునుపే దేవునికి తెలియును. అయినను, మనము ఆయన ప్రభుత్వమునకు మద్దతు పలుకుదుమో లేక సాతాను ప్రభుత్వమునకు మద్దతు పలుకుటకు ఎంపిక చేసికొందుమో అని తెలిసికొనుటకు ఆయన మనలను అనుమతించెను. ప్రతి వ్యక్తి తాను ఎవరిని అనుసరించునో అని ఎంపిక చేసికొనజేయు క్రమములో, యుగయుగములుగా అపార్థము చేసికొనబడుటకును మరియు తప్పుగా ఆరోపింపబడి నింధింపబడుటకును దేవుడు సంసిద్ధత కలిగియున్నాడు.
కేవలము ఒక ప్రేమామయుడైన దేవుడు మాత్రమే అందరికి పరిపూర్ణ స్వాతంత్య్రము ననుగ్రహించుటకు పూనుకొనును
ఈ మహిమాన్వితమైన, స్వతంత్రమనే ప్రధానమైన బహుమానము కేవలము న్యాయము మరియు బహిరంగ ప్రేమ కలిగిన దేవుని నుండి మాత్రమే లభించును. ఇటువంటి ప్రభువును మరియు మంచి స్నేహితుని సేవించుట ఎంతో ఘననీయము మరియు ఆనందదాయకము.
దేవుని సేవించుటకు ఎంపిక చేసికొనుము
పాపమనే సమస్య అతి త్వరలో అంతమగును. ఆదియందు సమస్తమును "చాల మంచిదిగ నుండెను" (ఆదికాండము 1:31). అయితే ఇప్పుడు, "లోకమంతయు దుష్టుని యందున్నది" (1 యోహాను 5:19) అన్ని చోట్ల నున్న ప్రజలు దేవునిని లేక సాతానుని సేవించుటకు ఎంపిక చేసికొనుచున్నారు. దేవుడు నీకనుగ్రహించిన అద్భుతమైన స్వతంత్రమును ఆయనను మాత్రమే సేవించుటకు ఉపయోగించుకొనుము.
5. అపవాది పాపము చేసిన వెనువెంటనే దేవుడు ఎందుకు అతనిని నాశనము చేసి, తద్వారా పావమనే సమస్యను అంతము చేయలేదు?
జవాబు : ఎందుకనగా పాపము అనునది దేవుని విశ్వములో పూర్తిగా ఒక క్రొత్త విషయముగా నుండెను, దాని నివాసులు దానిని అర్థము చేసికొనలేదు. లూసిఫరు కూడ ఒక తెలివైన, ఉన్నతముగా గౌరవింపబడిన దేవదూతల నాయకుడుగా నుండెను. అతని ప్రవర్తనా విధానము నిస్సందేహముగాను పరలోకము పట్ల మరియు దేవదూతల పట్ల గొప్ప శ్రద్ధ కలిగియుండి నట్టుండెను. లూసిఫరు మనస్సులో బహుశ ఇటువంటి ఆలోచనలు పుట్టియుండవచ్చును. "పరలోకము మంచిదే, కాని దానిని అనేకమంది దేవదూతల సలహాలు, పనులతో వృద్ధి చెందిచవచ్చును. తండ్రి మరియు కుమారుడు కలిగియున్న ఎదురులేని గొప్ప అధికారము, నిజ జీవితములో అది నాయకులకు గ్రుడ్డితనము కలుగజేయుచున్నది. దేవదూతలు ఆజ్ఞాపించబడ నవసరము లేదు. మనము ఆజ్ఞాపించువారముగా ఉండాలి. దేవునికి నా సలహాలు సరియైనవని తెలియును గనుక, ఆయన భయపడుచున్నాడు. మన సంబంధము లేకుండ పరలోక ఉనికిని ఒక అపాయకరమైన స్థితిగా మార్చాలని చూచే మన పై అధికారులను మనము అనుమతించకూడదు. మనము మూకుమ్మడిగా కదిలిన యెడల వారు మనకు లోబడుదురు. మనము బలహీనులమై ఉండకూడదు; మనము చురుగ్గా స్పందించవలెను. లేని యెడల మనలను గౌరవించని ప్రభుత్వము చేతనే మనము నాశనమగుదుము." ఇవన్నియు సాతానుని ఆలోచనలు.
మూడవ వంతు మంది దేవదూతలు లూసిఫరుతో చేతులు కలిపిరి (ప్రకటన 12:3, 4)
లూసిఫరు వాదనలు అనేకమంది దేవదూతలను ఒప్పింపజేసెను. మూడవ వంతు మంది దేవదూతలు అతనితో చేతులు కలిపిరి. దేవుడు తక్షణమే లూసిఫరును నాశనము చేసియుండిన యెడల, దేవుని స్వభావమును పరిపూర్ణముగా అర్థము చేసికొనని కొందరు దేవదూతలు, "లూసిఫరు యథార్థవంతుడై యుండవచ్చును. మనము జాగ్రత్తగా ఉండాలి. మనము దేవునితో విభేదించిన యెడల, ఆయన మనలను కూడ చంపునేమో" అని చెప్పుకొనుచు ఆయనను భయముతో ఆరాధించేవారు. అప్పటికి ఏదియు ఒక నిర్ధారణకు వచ్చి యుండలేదు గనుక, సమస్య మరింత పెద్దదై యుండేది.
దేవుడు కేవలము ప్రేమతో ప్రేరేపించబడిన, స్వచ్చంద సేవను మాత్రమే అంగీకరించును
ఉత్సాహముతో కూడిన, ప్రేమతో ప్రేరేపించబడిన స్వచ్చంద సేవను మాత్రమే దేవుడు అంగీకరించును. మరే ఇతర కారణములతో కూడిన విధేయత దేవునికి అంగీకారము కాదు.
దేవుడు తన స్వభావ గుణములను నిరూపించుకొనుటకై సాతానుకు ఇంకను సమయము నిచ్చుచున్నాడు.
విశ్వము యొక్క ప్రభుత్వ విధానములో తనకు ఒక ఉన్నత ప్రణాళిక ఉన్నట్లు సాతాను ప్రకటించుకొనెను. తన సూత్రములను నిరూపించుకొనుటకై దేవుడు అతనికి సమయము నిచ్చుచున్నాడు. విశ్వములో ఉన్న ప్రతి వ్యక్తి సాతానుని ప్రభుత్వము న్యాయవంతమైనది కాదని, అది ద్వేషపూరితమును, దయలేనిదియు, అబద్ధమైనదియు, మరియు నాశనకరమైనదని ఒప్పుకొనిన తరువాతనే దేవుడు పాపమును సంపూర్తిగా నిర్మూలము చేయును.
విశ్వమంతయు ఈ ప్రపంచమును వీక్షించుచున్నది
మనము "లోకమునకును, దేవదూతలకును, మనుష్యులకును వేడుకగా (ఒక నాటకశాలగా) నున్నాము” అని బైబిలు 1 కొరింథీయులకు 4:9లో చెప్పుచున్నది. క్రీస్తుకు మరియు సాతానుకు మధ్య జరుగుచున్న మహా సంఘర్షణలో నీవు నేను ప్రతి ఒక్కరము పోషించు పాత్రను ఈ విశ్వమంతయు గమనించుచున్నది. ఈ సంఘర్షణ ముగిసేసరికి, ప్రతి వ్యక్తి ఇరు ప్రభుత్వములు ఆదేశిక సూత్రములను పూర్తిగా అర్థము చేసికొని క్రీస్తును లేక సాతానును అనుసరించుటకు ఎంపిక చేసికొని యుండును. పాపముతో అంటిపెట్టుకొని ఎవరైతే సాతానుకు సహకరించుదురో వారు అతనితోనే నాశనమగుదురు. అయితే దేవుని ప్రజలు మాత్రము వారి పరలోక గృహము యొక్క శాశ్వత భద్రతకు తీసికొనిపోబడుదురు.
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు () పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) పాపము ఎవరితో ప్రారంభమాయెను (1)
( ) మిఖాయేలు
( ) లూసిఫరు
( ) గబ్రియేలు
2) లూసిఫరు మొదట పాపము చేసినప్పుడు అతడు ఎక్కడ నివసించుచుండెను? (1)
( ) భూమ్మీద
( ) పరలోకములో
( ) ధృవనక్షత్రము మీద
3) లూసిఫరును గూర్చి ఒకప్పుడు వర్ణింపబడిన విషయములను గుర్తించుము : (6)
( ) సృష్టింపబడిన దేవదూత.
( ) జ్ఞానములో పరిపూర్ణుడు.
( ) పరలోకపు తెల్లని గుఱ్ఱముపై సవారీ చేసెను.
( ) ప్రవర్తన విషయములో పరిపూర్ణుడు.
( ) పరలోక ద్వారమును పర్యవేక్షించువాడు.
( ) ప్రఖ్యాతిగాంచిన సంగీతకారుడు.
( ) సౌందర్యములో పరిపూర్ణుడు.
( ) ఆశ్రయముగా ఉండు కెరూబు.
4) లూసిఫరు తిరుగుబాటును గూర్చి తెలియజేయు సత్య వాక్యములను గుర్తించుము : (5)
( ) అతడు పరలోకము నుండి పడద్రోయబడెను.
( ) అతడు పశ్చాత్తాపపడి పరలోకములోనే ఉండెను.
( ) అతడు ఒక రాజభవనములో దాగుకొనెను.
( ) అతని పేరు సాతానుగా మార్చబడెను.
( ) అతడు మొదటి పాపి ఆయెను.
( ) అతడు పడద్రోయబడుటను యేసు చూచెను.
( ) మూడవ వంతు మంది దేవదూతలు అతనితో కూడ పడద్రోయబడిరి.
5) లూసిఫరు ఏమని కోరుకొనెను? (2)
( ) ఆరాధింపబడాలని
( ) సింహాసనము నుండి దేవునిని తొలగించి ఆయన స్థానమును పొందాలని
( ) విశ్వమంతట సంచరించి రావాలని
6) సాతానుడు లేక అపవాదిని గూర్చిన సరియైన వాక్యములను గుర్తించుము : (4)
( ) అతడు కొమ్ములు మరియు డెక్కలు (గిట్టలు) కలిగి ఎఱ్ఱగా ఉన్నాడు.
( ) అతని గృహము నరకములో ఉన్నది.
( ) అతడు ప్రజలను ప్రేమించుచున్నాడు.
( ) అతడు ఒక పరలోకపు దేవదూత వలె తనను తాను కనుపరచుకొనగలడు.
( ) అతడు సూచక క్రియలు చేయలేడు.
( ) అతడు అబద్ధికుడు మరియు నరహంతకుడు.
( ) అతడు పరలోకము నుండి అగ్నిని కురిపించగలడు.
( ) అనేకమంది అతనిని వెంబడించి నశించిపోవుదురు.
7) క్రింది వాటిలో ఆదాము హవ్వల పతనమునకు సంబంధించి సరియైన వాక్యములేవి? (3)
( ) సాతాను ఒక దేవదూత వలె మారువేషములో ఉండెను.
( ) సాతాను దేవునిని అబద్ధికుడని పిలిచెను.
( ) సాతాను వారికి యాపిల్ పండ్లు ఇచ్చెనని మనకు తెలుసు.
( ) సాతాను మొదట ఆదాము వద్దకు వచ్చెను
( ) వారు పాపులుగా అమరులగుదురని సాతాను ఆశించెను.
( ) వారిని శోధించుటలో, సాతాను నిజమును అబద్ధమును కలగల్పెను.
8) క్రింది వాటిలో సాతానుని అంతిమ శిక్షకు సంబంధించి సరియైన వాక్యములేవి? (4)
( ) అతడు నరకాగ్నిలో పడద్రోయబడును.
( ) అతని దూతలు తప్పించుకొందురు.
( ) నరకాగ్ని పరలోకములో ఉండును.
( ) సాతానుడు మరియు అతని దూతలు తమ తప్పును ఒప్పుకొందురు.
( ) పాపులు (దుర్మార్గులు) అగ్ని గుండములో పడద్రోయబడుదురు.
( ) సాతానుడు దేవుని న్యాయ స్వభావమును ఒప్పుకొనును.
9) పాపము చేసిన వెనువెంటనే దేవుడు లూసిఫరుని ఎందుకు చంపలేదు? (4)
( ) దేవదూతలు దేవునిని అపార్థము చేసికొనే అవకాశమున్నది.
( ) కొందరు దేవుడంటే భయపడేవారు.
( ) లూసిఫరు దేవుని కంటే బలవంతుడై యుండెను.
( ) లూసిఫరును చంపకుండ దేవునిని మంచి దేవదూతలు అడ్డుకొనిరి.
( ) లూసిఫరు యొక్క ప్రణాళికలు వెల్లడి అగుటకు కొంత సమయము అవసరమై యుండెను.
( ) దేవుని ప్రణాళిక నిరూపించబడుటకై సమయము అవసరమై యుండెను.
10) ఏ ఒక్క విషయము దేవుని ప్రభుత్వము చివరకు న్యాయవంతమైనదని నిరూపించును? (1)
( ) దేవుడు కొన్ని సూచక క్రియలు జరిగించును.
( ) విశ్వములో ఉన్న ప్రతి వ్యక్తి దేవుని యెదుట మోకరించి, ఆయన ప్రేమను మరియు నీతి న్యాయములను ఒప్పుకొనును.
( ) పరలోక దేవదూతలు దేవునిని సేవించమని ప్రజలందరిని కోరెదరు.
11) పాపమునకు సంబంధించి క్రింద ఇయ్యబడిన వాస్తవములలో సత్య వాక్యములేమిటి? (5)
( ) పాపము యొక్క నాశనమును యేసు నిశ్చయము (నిజము) చేసెను.
( ) దేవుని ధర్మశాస్త్రమును మీరుటయే పాపము.
( ) పాపము మనలను దేవుని నుండి వేరు చేయును.
( ) జయించుటకు పాపము ఎంతో సుళువైనది.
( ) అబద్ధమనే పాపమును సాతాను కనుగొనెను.
( ) ఒక్కసారి నశింపజేయబడిన తరువాత, పాపము మరల తలెత్తదు.
12) క్రింద ఇయ్యబడిన వాటిలో సత్య వాక్యములేవి? (5)
( ) సాతాను తన లక్షణములను (గుణగణములను) దేవునికి ఆరోపించును.
( ) మన తల్లిదండ్రుల కంటే ఎక్కువగా దేవుడు మనలను ప్రేమించును.
( ) “దేవుని క్రియలుగా” పిలువబడుచున్న అనేక క్రియలు సాతాను యొక్క నకిలీ క్రియలే.
( ) యేసు జీవితము దేవుని స్వభావమును బయలుపరచెను.
( ) తండ్రియైన దేవుడు క్రూరుడు.
( ) అనేకమంది దేవునిని అపార్థము చేసికొందురు.
13) యేసు ప్రేమించునంతగా తండ్రియైన దేవుడు నన్ను ప్రేమించునని తెలిసికొనినందుకు నేను ఎంతగానో సంతోషించుచున్నాను.
( ) అవును
( ) కాదు