Lesson 1
నీతి సవాళ్లనెదురుకొనుచున్న ఈ కాలములో - లక్షలాదిమంది పెద్దపెద్ద సంస్థల మోసమునకు గురియగుచు దొంగిలించబడుచుండగా; నమ్ముకున్న ఆధ్యాత్మిక గురువులే అబద్ధికులని నిరూపించబడుచుండగా; రాజకీయాలలో అబద్ధ ప్రమాణములు చేయుట సాధారణమైపోగా; నీవు ఎవరిపై ఎక్కువ ఆధారపడితివో వారే నిన్ను లోతుగా గాయపర్చుచుండగా - నీవు ఇంకను నమ్మదగినది ఏదైన మిగిలియున్నదా? అవును! ఉన్నది. నీవు బైబిలును సంపూర్ణముగా నమ్మవచ్చును! ఎందుకు? ఇయ్యబడిన నిదర్శనములను చూడుము ...
1. బైబిలు గ్రంథము తన్ను గూర్చి ఏమైయున్నట్లు చెప్పుకొనుచున్నది?
"ప్రతి లేఖనము దైవావేశము వలన కలిగెను" (2 తిమోతి 3:16). "ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి" (2 పేతురు 1:21). "లేఖనము నిరర్ధకము కానేరదు" (యోహాను 10:35) అని బైబిలు చెప్పుచున్నది.
జవాబు : దైవావేశము వలన కలిగినట్లు బైబిలును గూర్చి బైబిలే సాక్ష్యమిచ్చుచున్నది. మనుష్యులు దేవుని పరిశుద్ధాత్మ వలన నడిపింపబడినవారై బైబిలును వ్రాసిరి. అది నిరర్థకము కానేరదు అనగా అబద్ధమని నిరూపించబడదు.
2. యేసు ప్రభువు లేఖనముపై తనకున్న విశ్వాసమును మరియు నమ్మకమును ఎట్లు ప్రదర్శించెను?
యేసు ప్రభువు, “మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదుగాని దేవుని నోట నుండి వచ్చు ప్రతిమాట వలనను జీవించును అని వ్రాయబడియున్నదనెను" ... "ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరియొక చోట వ్రాయబడియున్నదనెను" ... "ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను" (మత్తయి 4:4, 7, 10). "సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము; నీ వాక్యమే సత్యము" (యోహాను 17:17) అని చెప్పను.
జవాబు : యేసు సాతాను శోధనలను ఎదుర్కొనినప్పుడు లేఖనమునే ఎత్తి చూపెను. ఆయన బైబిలు సత్యమని చెప్పెను (యోహాను 17:17). యేసు ప్రభువు తాను బోధించిన బోధ అధికారముతో కూడినదనుటకు తరుచు ఆయన లేఖనములను ఎత్తి చూపించెను.
3. బైబిలు ప్రవచనములు దాని దైవావేశమును స్థిరపరచుచున్నవా?
“యెహోవానగు నేనే ... క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను, పుట్టక మునుపే వాటిని మీకు తెలుపుచున్నాను” (యెషయా 42:8, 9). "నేను దేవుడను ... ఆది నుండి నేనే కలుగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలము నుండి నేనే యింక జరుగని వాటిని తెలియజేయుచున్నాను" (యెషయా 46:9, 10) అని బైబిలు చెప్పుచున్నది.
జవాబు : కలుగబోవు సంగతులు బైబిలునందు ముందుగా చెప్పబడిన విధముగా నెరవేరిన దానిని బట్టి లేఖనము దైవావేశము వలన కలిగినదని ఋజువగుచున్నది. క్రింద ఇయ్యబడిన నెరవేరిన బైబిలు ప్రవచనములను జాగ్రత్తగా గమనించుము :
అ. రాజ్యాధికారమునకు రాబోవు నాలుగు ప్రపంచ రాజ్యములు : బబులోను, మాదీయ – పారసీ, గ్రీసు, మరియు రోమా సామ్రాజ్యములు (దానియేలు 2, 7, 8 అధ్యాయములు).
ఆ. కోరెషు యుద్ధశూరుడుగా బబులోనును వశపర్చుకొనును (యెషయా 45:1-3).
ఇ. బబులోను నాశనము చేయబడిన తరువాత అది ఎన్నటికి నివాసస్థలముగా నుండకపోవును (యెషయా 13:19, 20; యిర్మీయా 51:37).
ఈ. ఐగుప్తు ఇక ఎన్నటికి అధికారము చెలాయించు అగ్రరాజ్యముగా నుండకపోవును (యెహెజ్కేలు 29:14, 15; 30:12, 13).
ఉ. భూమిని వణికించు వైపరీత్యములు మరియు అంత్యకాలములో కలుగబోవు వాటి విషయమై భయాందోళన (లూకా 21:25, 26).
ఊ. అంత్య దినములలో నైతిక క్షీణత మరియు ఆధ్యాత్మిక వైఫల్యత (2 తిమోతి 3:1-5).
4. సహజ ప్రపంచము గురించి బైబిలు ప్రకటనలు సైన్సు ద్వారా నిర్ధారించబడినవా?
"నీ వాక్య సారాంశము సత్యము" (కీర్తనలు 119:160). "సత్యస్వరూపియైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును" (యోహాను 16:13) అని బైబిలు చెప్పుడున్నది.
జవాబు : అవును, బైబిలు సత్యమైనది. బైబిలు రచయితలను నడిపించిన దేవుని పరిశుద్ధాత్మ ఎల్లప్పుడు సత్యమునే పలుకును. శాస్త్రీయముగా నిర్ధారింపబడిన కొన్ని బైబిలు ప్రకటనలు క్రింద పొందుపరచబడినవి :
అ. "ఆయన శూన్యము పైని భూమిని వ్రేలాడ చేసెను" (యోబు 26:7). బైబిలునందు పురాతన గ్రంథమైన యోబు గ్రంథము నుండి ఈ శాస్త్రీయ ప్రకటన వెల్లడైనది.
ఆ. “ఆయన భూమండలము మీద ఆసీనుడైయున్నాడు” (యెషయా 40:22). మానవుడు కనుగొనక మునుపే, భూమి గుండ్రముగా ఉన్నదని బైబిలు చెప్పియున్నది.
ఇ. “గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించెను” (యోబు 28:25). శాస్త్రవేత్తలు కనుగొనక మునుపే, దేవుడు గాలికి బరువు ఉన్నదని చెప్పియున్నాడు.
5. బైబిలులోని ఆరోగ్య సూత్రములు నేటి ఇరవై ఒకటవ శతాబ్దపు మానవ మనస్సుకు అనుగుణముగా నున్నవా?
జవాబు :
ఆ. శరీర మలమును మట్టితో కప్పివేయుట (ద్వితీయోపదేశకాండము 23:12, 13). బైబిలు అందజేయు సమాచారము పరిశుభ్రతకు సంబంధించినది. శరీర మలమును పాళెము వెలుపల కప్పివేయుట మనునది అప్పటి మోషేకాల ప్రజలకు కొన్ని వేల సంవత్సరములకు ముందుగానే తెలియబడిన సత్యము. మనుష్యుల మలము సరిగ్గా కప్పివేయబడకపోయిన యెడల, అనేక వేలమంది ప్రజలకు జబ్బులు త్వరితముగా వ్యాపించగలవు, చేతులు కడుగుకొనకపోవుట లేదా కాలుష్యపు నీటి వాడకము ద్వారా రోగములు శరవేగముగా వ్యాపించును. ఈ బైబిలు సత్యము అనేకమంది జీవితములను రక్షించుటకు ఇంకను కొనసాగుచున్నది.
ఆ. “మనము వ్యభిచరింపక యుందము” (1 కొరింథీయులకు 10:8). "వ్యభిచారము" అను పదము అన్ని విధములైన దుర్నీతితో కూడిన లైంగిక ప్రవర్తనను సూచించుచున్నది. (వీటి సమగ్ర జాబితా కొరకు లేవీయకాండము 18వ అధ్యాయము చూడుము). బైబిలులో స్పష్టముగా చెప్పబడిన ఆరోగ్య సందేశములను ప్రజలు పాటించిన యెడల, వారికి సిఫిలిస్ (కొరుకు సవాయి రోగము), గోనేరియా (శగ రోగము), లేక ఎయిడ్స్ వంటి సుఖవ్యాధులు సంక్రమించవు. అంతే కాకుండ, అవాంఛిత గర్భస్రావములు అవసరమే లేకుండ పోయేవి.
ఇ. అన్ని విధములైన మద్యములు త్రాగకుండ ఉండుట (సామెతలు 23:29-32). అతి ప్రాముఖ్యమైన ఈ బైబిలు పరిష్కారమును పాటించుటలో ఉన్న భావమేమిటో ఆలోచించుము :
- లక్షలమంది త్రాగుబోతులు త్రాగుబోతు మైకమును వీడి, సమాజములో గౌరవార్ధమైన పౌరులుగా జీవించేవారు.
- లక్షలాది కుటుంబములు తిరిగి కలిసికొనేవి.
- పడిపోయిన అనేక గృహములు తిరిగి కట్టబడేవి.
- సారా (మద్యము) త్రాగకుండ వాహనములు నడిపిన యెడల, వేలకు వేలమంది జీవితములు కాపాడబడేవి.
- ప్రభుత్వ, వ్యాపార మరియు వృత్తికి సంబంధించిన వేలమంది నాయకులు చిత్తశుద్ధితో కూడిన నిర్ణయములు తీసికొనేవారు.
- కోట్ల రూపాయలు పొదుపు చేయబడి మానవాభివృద్ధి తోడ్పాటుకు అందుబాటులో ఉండేవి.
గమనిక : దేవుడు నేడు భయపెట్టుచున్న సమస్యలను మనము సంతోషముతో ఏ విధముగా అధిగమించాలని మాత్రమే కాక మనము వాటిని అధిగమించుటకు తగిన అద్భుతశక్తిని ఆయన మనకు అనుగ్రహించుచున్నాడు (1 కొరింథీయులకు 15:57; ఫిలిప్పీయులకు 4:13; రోమీయులకు 1:16). బైబిలులోని ఆరోగ్య సూత్రములకు సంబంధించినంత వరకు అవి ఎంతో అవసరమైయున్నవి, కాని కొద్దిమంది మాత్రమే వాటికి చెవి యొగ్గుచున్నారు. ఆరోగ్యము అను అంశమును గూర్చిన మరింత సమాచారము కొరకు 13వ స్టడీ గైడ్ పత్రికను చూడుము.)
6. బైబిలులోని చారిత్రక ప్రకటనలు సత్యమైనవేనా?
"నేను న్యాయమైన సంగతులు చెప్పువాడను, యథార్థమైన సంగతులు తెలియజేయువాడను అగు యెహోవాను నేనే" అని బైబిలు చెప్పుచున్నది (యెషయా 45:19).
జవాబు : అవును, బైబిలు చారిత్రక ప్రకటనలు సత్యమైనవి. దేవుడు తన గ్రంథమందు చెప్పినదంతయు సత్యమే. బైబిలులో చెప్పబడిన చారిత్రక సత్యములను నిరూపించుటకు కొన్నిసార్లు తాత్కాలికముగా కొన్ని ఆధారములు కనబడకపోయినను, కాలము గడచుచున్న కొలది ఆధారములు బయటపడును. ఈ క్రింది విషయములను గమనించుము :
అ. సంవత్సరాలుగా నాస్తికులు బైబిలు విశ్వసనీయమైనది కాదని చెప్పియున్నారు. ఎందుకనగా బైబిలునందు హీత్తియుల దేశము (ద్వితీయోపదేశకాండము 7:1), నీనెవె పట్టణము (యోనా 1:1,2), మరియు సోదొమ పట్టణములు (ఆదికాండము 19:1) ఉనికిలో అసలు ఉన్నవని వారు నమ్మలేదు. అవి ఒకప్పుడు ఉనికిలో ఉండేవిగా పరిగణింపబడలేదు. కాని నేటి ఆధునిక పురావస్తు శాస్త్రము ఈ మూడు దేశములు ఒకప్పుడు నిజముగా భూమ్మీద ఉన్నవని సాక్ష్యాధారములతో నిరూపించెను.
ఆ. విమర్శకులు కూడ బైబిలులో చెప్పబడిన రాజులైన బెల్షస్సరు (దానియేలు 5:1), మరియు సర్గోను (యెషయా 20:1) అసలు ఉనికిలో లేరని చెప్పిరి. అయితే మరొకసారి వారు భూమ్మీద జీవించియున్నారని ఋజువైనది.
ఇ. నాస్తికులు మోషే వ్రాసిన గ్రంథములు నమ్మదగినవి కావని అనిరి. ఎందుకనగా వాటిల్లో వ్రాతలు (నిర్గమకాండము 24:4), మరియు రథ చక్రములను గూర్చి (నిర్గమకాండము 14:25) చెప్పబడినవని, కాని అవి ఏవియు ఆ దినములలో లేవని చెప్పిరి. అయితే అవి ఉన్నవని వారు నేడు బహుబాగుగా తెలిసికొనియున్నారు.
ఈ. ఒకానొకప్పుడు రాజ్యవిభజన కాలమందు ప్రాచీన ఇశ్రాయేలును మరియు యూదా దేశములను పాలించిన 39 మంది రాజుల చరిత్రలు బైబిలు గ్రంథపు దాఖలాల ద్వారా మాత్రమే ధ్రువపర్చబడెను. కావున విమర్శకులు వీటిని కట్టుకథలుగా కొట్టిపారవేసిరి.
అయితే పురావస్తు శాస్త్రవేతలు ఈ అనేకమంది రాజుల చరిత్రలు పేర్కొనబడిన పురాతన ఉలి ఆకార వ్రాతలను కనుగొనగా, మరొకసారి బైబిలు గ్రంథము యొక్క దాఖలాలు ముమ్మాటికి నిజమైనవని ఋజువైనది. నూతన ఆవిష్కరణలు బైబిలులోని వ్యక్తులు, స్థలములు, మరియు సంఘటనలు నిజమని నిరూపించే కొలది విమర్శకులు తరుచు తప్పుగా నిరూపితమగుచున్నారు.
7. బైబిలును గూర్చిన ఏ ఇతర సత్యములు దాని దైవావేశమును ఋజువు చేయుచున్నది?
"దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము" అని బైబిలు చెప్పుచున్నది (2 తిమోతి 3:16).
జవాబు : బైబిలులోని గొప్ప అద్భుతములలో ఒకటి దాని ఏకత్వమే. క్రింద ఇయ్యబడిన అద్భుత వాస్తవ సత్యములను దయచేసి విచారించుము :
అ. బైబిలు గ్రంథములోని 66 పుస్తకములు :
-
- మూడు ప్రపంచ ఖండములలోని వారి చేత వ్రాయబడెను.
- మూడు భాషల్లో వ్రాయబడెను.
- సుమారు 40 మంది వేరు వేరు వ్యక్తుల చేత వ్రాయబడెను. (వారిలో రాజులు, గొట్టెల కాపరులు, శాస్త్రవేత్తలు, న్యాయవాదులు, ఒక సైన్యాధిపతి, చేపలు పట్టే జాలరులు, యాజకులు మరియు ఒక వైద్యుడు ఉండిరి.)
- వ్రాయుటకు 1500 సంవత్సరములకు పైగా సమయము పట్టెను.
- అత్యంత వివాదాస్పద అంశములపై వ్రాయబడెను.
- రచయితలు ఎక్కువమంది ఒకరినొకరు కలిసికొనలేదు.
- వేరు వేరు పరిస్థితులు మరియు వేరు వేరు విద్యాభ్యాసములు గల రచయితల చేత వ్రాయబడెను.
ఆ. చూచుటకు పూర్తిగా గ్రహింపశక్యము కాని గ్రంథము వలె అగుపడినను,
- 66 పుస్తకములు ఒకదానితో ఒకటి విడదీయరాని సంబంధమును కలిగియుండును.
- అనేకసార్లు ఒకే అంశముపై కొన్ని కొత్త వివరణలు వ్యక్తపరచబడినను, అదే అంశము పై ఇతర బైబిలు రచయితలు చెప్పిన వివరణలను ఈ క్రొత్త వివరణలు తూలనాడవు.
నాలుగు సువార్తలు కొన్నిసార్లు ఒకే సంఘటనను వివరించు విధానములో విభిన్నముగా ఉన్నను, అవి ఒకదానికొకటి విరుద్ధముగా కాక సంపూరకముగా ఉండును.
ఒకే సంఘటనను చూచిన వేరు వేరు వ్యక్తులను వారు చూచిన దానిని గూర్చి ఏమి జరిగినదో వివరించమని అడగండి, వారు ఇచ్చు సమాచారములు వేరు వేరుగాను నిజానికి కొన్ని విషయములలో ఒకరిది మరొకరి దానికి విరుద్ధమైనదిగాను ఉండును. అయితే బైబిలు 40 మంది రచయితల చేత 1500 సంవత్సరముల పాటు వ్రాయబడినను, చదువుటకు ఒకే ఒక గొప్ప మేధాశక్తి వ్రాసినట్లుండును. వాస్తవముగా, "మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి" (2 పేతురు 1:21). వారు దేవుని పరిశుద్ధాత్మ వలన "ప్రేరేపింపబడిరి." దేవుడే నిజమైన బైబిలు గ్రంథకర్త. నాలుగు సువార్తలు ఒకే సంఘటనపై ఇచ్చు సమాచారము వేరు వేరుగా ఉన్నను, అవి ఒకదానికి మరొకటి సంపూరకముగా నుండును.
8. బైబిలు దైవావేశ గ్రంథమని ప్రజల జీవితములలో ఎట్టి నిదర్శనమును మనము కనుగొనగలము?
"కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను" అని బైబిలు చెప్పుచున్నది (2 కొరింథీయులకు 5:17).
జవాబు : లేఖనములకు విధేయత చూపుచు యేసు ప్రభువును అనుసరించువారి మార్పు చెందిన జీవితములే బైబిలు దైవావేశము వలన కలిగిన గ్రంథమనుటకు నిదర్శనము. త్రాగుబోతులు స్థిరబుద్ధి గలవారగుచున్నారు; నీతి లేనివారు పరిపూర్ణులగుచున్నారు; వ్యసనపడువారు స్వతంత్రులగుచున్నారు; దుష్టులు భక్తిపరులగుచున్నారు; పిరికివారు ధైర్యవంతులగుచున్నారు; మరియు కఠినాత్ములు దయాహృదయులగుచున్నారు. క్రీస్తును అంగీకరించుట ద్వారా మరియు లేఖనములకు విధేయత చూపుట ద్వారా ఒక త్రాగుబోతు, దుర్నీతిపరుడు మరియు దుష్టుడు బుద్ధిమంతునిగా, ఒక పరిపూర్ణ క్రైస్తవునిగా మారగలుగుచున్నాడు. నాస్తికులు ఈ వాస్తవికతను వివరించలేరు.
ఒకానొకప్పుడు అమెరికాకు చెందిన ఒక నాస్తికుడు నరమాంస భక్షకులుగా జీవించిన ఒక ద్వీపమును దర్శించుచుండగా ఒక ముసలివాడు బైబిలు చదువుచు ఆ నాస్తికుని కంటపడెను. అది చూచి ఆ నాస్తికుడు "అప్పటికే పూర్తి కల్పిత గ్రంథముగా బట్టబయలైన" పుస్తకమును నీవు చదువుచున్నావని ఆ ముసలివానితో హేళనగా మాట్లాడెను. అందుకు ఆ ముసలివాడు ఆ నాస్తికుని వైపు చూచి నవ్వుచు, "నా స్నేహితుడా, మేము బైబిలును నమ్ముచున్నందుకు నీవు కృతజ్ఞుడవై యుండుము." మేము గనుక ఈ గ్రంథమును నమ్మకపోయి యుండిన యెడల, ఈ పాటికి నిన్ను ఆహారముగా భుజించియుండెడి వారము" అని చెప్పెను. బైబిలు నిజముగా మనుష్యులను మార్చివేయును, ఈ అద్భుత సత్యమే దాని దైవావేశమును ఋజువు చేయుచున్నది.
9. రాబోవు మెస్సీయాను గూర్చిన పాత నిబంధన ప్రవచనములను మనము యేసు జీవితములో నెరవేరిన క్రొత్త నిబంధన సంగతులతో పోల్చి చూసినప్పుడు బైబిలు దైవావేశమును గూర్చిన ఎట్టి నిదర్శనము బహిర్గతమగుచున్నది?
“మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను (యేసుని) గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను” (లూకా 24:27). "యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు (అపొల్లో) దృష్టాంతపరచి, యూదుల వాదమును బహిరంగముగాను, గట్టిగాను ఖండించుచు వచ్చెను" (అపొస్తలుల కార్యములు 18:28) అని బైబిలు చెప్పుచున్నది.
జవాబు: రాబోవు మెస్సీయాను గూర్చి పాత నిబంధనలో ముందుగా చెప్పబడిన సంగతులు నజరేయుడైన యేసు ద్వారా ఎంతో ఖచ్చితముగాను మరియు స్పష్టముగాను నెరవేర్చబడెను. యేసే నిజముగా మెస్సియా అని యూదులకు ఋజువు చేయుటకై యేసు మరియు అపొల్లో ఈ ప్రవచనములనే ఉపయోగించియున్నారు. మెస్సియాను గూర్చిన ప్రవచనములు 125 కు పైగా ఉన్నవి. వీటిలో 12 ప్రవచనములను మాత్రమే మనము పునర్విమర్శ చేయుదము :
|
గతములో డాక్టర్ పీటర్ స్టోనర్ గారు కాలిఫోర్నియాలో నున్న పసదేవా కళాశాలలో గణితశాస్త్రము, ఖగోళశాస్త్రము మరియు ఇంజినీరింగ్ విభాగములకు అధ్యక్షులుగా పని చేసిరి. వీరు 600 మంది విద్యార్థులతో కలిసి మెస్సీయా రాకడను గూర్చిన ప్రవచనములకు “సంభావ్యత సూత్రము” అన్వయించి కొన్ని సంవత్సరములు పని చేసిరి. వారు మెస్సీయాను గూర్చిన 125 ప్రవచనములలో ఎనిమిది ప్రవచనములను మాత్రమే తీసికొని ఇవి ఒక వ్యక్తి జీవితములో నెరవేరే అవకాశములను లెక్కగట్టి, వాటిని వెల్లడి చేయుచు చివరకు ఈ సంఖ్యను చెప్పిరి. 1,000,000,000,000, 000,000,000,000,000,000,000 (10 కోట్లను 10 కోట్లతో నాలుగు సార్లు హెచ్చివేత చేస్తే వచ్చే సంఖ్య;
తెలుగులో ఈ సంఖ్యను అచింత్యము అని మరియు ఇంగ్లీషులో జిలియన్ లేక డెసిలియన్ అని అంటారు). ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజలలో ఒకే ఒక్కరు మాత్రమే ఎనిమిది ప్రవచనములను నెరవేర్చగలరని వారు తేల్చి చెప్పిరి. కేవలము ఎనిమిది ప్రవచనముల నెరవేర్చుకే ఇంతమందిలో ఒక్కరు మాత్రమే నెరవేర్చగల్గిన యెడల, మెస్సీయాను గూర్చిన 125కు పైగా ప్రవచనముల నెరవేర్పు సంభవించుటకు ఇంక ఎంత పెద్ద సంఖ్య వచ్చునో నీవే ఊహించుము? అది ఊహకు అందనిది, అట్లు సంభవించుట అసాధ్యము!
10. బైబిలు దేవుని చేత ప్రేరేపించబడిన గ్రంథమని అంగీకరించు వ్యక్తి ఎట్టి గొప్ప ప్రయోజనము పొందును?
"నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటె నాకు విశేషజ్ఞానము కలదు" (కీర్తనలు 119:100). "నీ ఆజ్ఞలు ... నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి" (కీర్తనలు 119:98). "ఆకాశములు భూమికి పైన ఎంత యెత్తుగా ఉన్నవో ... మీ తలంపుల కంటె నా తలంపులు అంత యెత్తుగా ఉన్నవి" (యెషయా 55:9) అని బైబిలు చెప్పుచున్నది.
జవాబు : దేవుని వాక్యమును అంగీకరించిన వ్యక్తి అతి త్వరలోనే ఈ లౌకిక పండితులు సహితము వివరించలేని క్లిష్టమైన విషయములకు సమాధానమును తెలిసికొనును. ఉదాహరణకు, బైబిలు క్రింద చెప్పబడిన వాటిని బోధించుచున్నది :
అ. దేవుడు భూమిని మరియు సమస్త జీవరాశులను అక్షరాలా ఆరు వాస్తవమైన, 24 గంటల దినములలో సృజించెను (నిర్గమకాండము 20:11; కీర్తనలు 33:6, 9).
ఆ. ప్రపంచవ్యాప్తముగా సంభవించిన ఒక జలప్రళయము సముద్ర జీవరాశులను "మరియు నోవహు ఓడలో ఉన్న వారిని తప్ప ప్రతి జీవరాశిని నాశనము చేసెను (ఆదికాండము 6, 7, 8 అధ్యాయములు).
ఇ. అనేక వేరు వేరు ప్రపంచ భాషలు బాబెలు గోపురము వద్ద ప్రారంభమైనవి (ఆదికాండము 11:1-9). ఎల్లప్పుడు ఉనికిలోయున్న మరియు సమస్తమును ఎరిగియున్న దేవుడే మనంతట మనము తెలిసికొనలేమని గ్రహించి పై మూడు సత్యములను మనతో పంచుకొనెను. ఇప్పుడు మనము "కొంత మట్టుకే" ఎరుగుదుము (1 కొరింథీయులకు 13:9). దేవుని జ్ఞానమార్గములు “ఎంతో అగమ్యములు” (రోమీయులకు 11:33). బైబిలు కాలక్రమమును బట్టి భూమి వేల సంవత్సరముల కాలము నాటిదే కాని లక్షల సంవత్సరముల కాలము నాటిది కాదు. ఇది జీవ పరిణామ సిద్ధాంతమును నమ్ము శాస్త్రవేత్తలను కలవరపెట్టవచ్చును, కాని అలా జరుగకూడదు. ఆదాము హవ్వలను దేవుడే పెద్దవారిగా సృజించెనని బైబిలు సూచించుచున్నది. ఆ దంపతులు వారి జీవిత రెండవ దినములో ఒక దినము వయస్సు కలిగియున్నను వాస్తవానికి వారు పెద్దవారైయున్నారు. ఇదే పనిని దేవుడు భూమి విషయములో కూడ జరిగించలేడా? ఖచ్చితముగా జరిగించగలడు! మనిషి యొక్క కొలమాను పరికరములు స్పష్టమైన కాలమును లేక వయస్సును లెక్కించలేవు. అటువంటి పరిస్థితుల్లో, అవి నమ్మశక్యము కానివిగా పరిగణింపబడెను. బైబిలును విశ్వసించుము, అప్పుడు నీవు ఎల్లప్పుడు లౌకిక పండితుల ఊహల కన్నా మరియు ప్రపంచ జ్ఞానము కన్నా మించి ఒక అడుగు ముందే ఉండెదవు.
11. ఇటీవల కాలములో జరిగిన ఏ సంఘటనలు బైబిలు యొక్క శక్తి మరియు విజ్ఞప్తి వైపు మన దృష్టిని మళ్లించేలా చేసినవి?
జవాబు : ప్రకృతి వైపరీత్యముల సంఖ్యలో పెరుగుదల మరియు ప్రపంచ ఉగ్రవాదములో ఎదుగుదల ఇవి రెండు బైబిలునందు ముందుగానే చెప్పబడిన సూచనలు. అంత్య దినములలో, "భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును" అని బైబిలు ముందుగానే చెప్పియున్నది (లూకా 21:25). దీనికి డిసెంబర్ 26, 2004లో సంభవించిన ఆసియా సునామీయే ఒక ఉదాహరణ. ఆధునిక చరిత్రలోనే అత్యంత భయంకరమైన ప్రకృతి వైపరీత్యముగా పిలువబడిన ఈ సునామీ ఫలితముగా 2,50,000 మందికి పైగా ప్రజలు మరణించినట్లుగా లేక గల్లంతయినట్లుగా సమాచారము అందినది. అదే ఒక సంవత్సరము తరువాత, కత్రినా అని పిలువబడిన అతి పెద్ద గాలివాన అమెరికాలోని న్యూ ఓర్లియన్సు గుండా వెళ్లి ఆ పట్టణమంతటిని అల్లకల్లోలము చేసెను. పెద్ద పెద్ద గాలివానలు మరియు జల వినాశనములు "సముద్ర తరంగముల ఘోష వలన" అని పలికిన యేసు మాటల్లోని ప్రవచన శక్తిని మనకు ఇంకను గుర్తు చేయుచున్నవి.
"అయినను మనుష్యకుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?" అని యేసు ముందుగానే చెప్పెను (లూకా 18:8). అయినను, విశ్వాసమును బ్రద్ధలు చేసిన ఈ పరిణామ సిద్ధాంతమునకు నేడు విలువ తగ్గినది. ఇది ఋజువు చేయబడని అస్థిరమైన సిద్ధాంతము అని మనము జ్ఞాపకముంచుకొనవలెను. మేము మూడు సంగతులను మాత్రమే ఉదహరించుచున్నాము.
- రాబర్ట్ జెంట్రీ గారి యొక్క డీవీడీ "సృష్టి యొక్క సూక్ష్మమద్యము” (క్రియేషన్స్ టైని మిస్టరీ) పరిణామము ద్వారా కాక ఆకస్మిక సృష్టికార్యము వలననే సమస్తము జరిగినట్లు స్పష్టమైన ఋజువులతో పరిణామ శాస్త్రవేత్తలను కలవరపర్చెను.
- ఇటీవల జరిగిన అణు జీవశాస్త్రము (మోలిక్యులర్ బైయాలజీ) ప్రదర్శనలో గ్రహించినదేమనగా, ఒక జీవకణము సూక్ష్మమైనది, విడిపోనంత అత్యంత సంక్లిష్టమైనదని తెలిసినది. ఇది యాధృచ్చిక ఏకకణ జీవపరిణామ సిద్ధాంతమును ఒక మూఢ నమ్మకముగా ఋజువు చేయుచున్నది.
- ప్రస్తుత శాస్త్రీయ కొలతల ద్వారా ముందుగా కేటాయింపబడిన వాటికి వ్యతిరేకముగా, గ్రాండ్ కేనియన్ పొరలకు నేడు కేటాయించుచున్న విస్తృత విభిన్న కాలములు, పరిణామ వాదులను మరియు వారి పూర్వపు కొలతలను నిర్లక్ష్యముగాను మరియు బాధ్యతారహితముగాను కనిపించు విధముగా తయారు చేయుచున్నవి. మనుష్యులు మరియు కోతులు సాధారణ పూర్వీకుల నుండి వచ్చిరనే నాస్తిక పరిణామ సిద్ధాంతము మనుష్యులు దేవుని స్వరూపమందు సృజింపబడిరనే విషయమును తిరస్కరించును. అది దేవుని ఉనికిని అంగీకరించదు, యేసు రక్షకుడనే మాటను పూర్తిగా తిరస్కరించును, బైబిలును నిషేధించును, పరలోకములో నిత్యగృహమున్నదనే సత్యమును హేళన చేయును. జీవపరిణామ సిద్ధాంత వైఫల్యత మరియు బైబిలు ప్రవచనముల నెరవేర్పు ఇవి రెండు నీ విశ్వాసమును దేవుని వాక్యమందు స్థిరపరచవలెను. అపవాది యొక్క ఎత్తుగడల చేత మోసపరచబడకుండునట్లు నీవు అన్ని విషయములలో ఎంతో అప్రమత్తముగా ఉండవలెను!
12. శాశ్వత ఆనందము మరియు శాంతి కొరకు బైబిలు నీకు ఎందుకు అంతటి ఉత్తమ భాగ్యమైయున్నది?
“నీ వాక్యము ... నా త్రోవకు వెలుగైయున్నది” (కీర్తనలు 119:105). "మీ సంతోషము పరిపూర్ణము కావలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను" (యోహాను 15:11). "మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి యెదుట మీ వెలుగు ప్రకాశింపనియ్యుడి" (మత్తయి 5:16). "నేనుండు స్థలములో మీరును ఉందులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును" (యోహాను 14:3) అని బైబిలు చెప్పుచున్నది.
జవాబు : ఎందుకనగా, బైబిలు జీవితమును అత్యంత కలవరపరచు ప్రశ్నలకు సమాధానమిచ్చుచున్నది. వాటిలో కొన్ని:
అ. నేను ఎక్కడ నుండి వచ్చితిని? దేవుడు తన స్వరూపమందు మనలను సృజించెను. మనము యాదృశ్చికముగా వివరము లేకుండ బురద నుండి హఠాత్తుగా ఉద్భవించిన మట్టిముద్దల వలె ఉనికిలోనికి వచ్చిన వారము కాము. మనము మహారాజైన దేవుని కుమారులము మరియు కుమార్తెలము (గలతీయులకు 3:26). మనము దేవునికి ఎంతో ప్రశస్తమైన వారమైయున్నాము. ఎందుకనగా ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు మనము స్వతంత్రులుగా ఉండునట్లు మన పాపముల పరిహారము నిమిత్తము మరణించుటకై ఆయన తన సొంత కుమారుని మన కొరకు అనుగ్రహించెను. మనలను ఆయన స్వరూపములోనికి పునరుద్ధరించుటకును, తద్వారా ఆదాము హవ్వలు కోల్పోయిన ఆ ఏదేను వనములోనికి మనలను తీసికొని పోవుటకును దేవుడు ఎంతగానో పరితపించుచున్నాడు. .
ఆ. నేను ఎందుకు జీవించుచున్నాను? జీవితమును కలవరపరచు సమస్యలకు బైబిలు అద్భుతమైన పరిష్కార జవాబులను కనుగొనుటయు మరియు ఆయన స్వరూపములోనికి మనలను పునరుద్ధరించాలనే యేసు ఆహ్వానమును అంగీకరించుటయు నేడు మన జీవిత లక్ష్యములై యుండవలెను (రోమీయులకు 8:29).
ఇ. భవిష్యత్తు నా కొరకు ఏమి కలిగియున్నది? భవిష్యత్తు గురించి ఊహించుకునే పనే లేదు. యేసు తన ప్రజలను వారి కొరకు పరలోకములో ఆయన సిద్ధపరచిన మనోహరమైన గృహములోనికి తీసికొనిపోవుటకై అతి త్వరలో రానైయున్నాడు. అక్కడ ప్రజలు అత్యంత సంతోషము మరియు ఆనందముతో సదాకాలము జీవించెదరు (యోహాను 14:1-3; ప్రకటన 21:3, 4).
13. జీవితమును అత్యంత కలవరపరచు ప్రశ్నలకు బైబిలునందు సానుకూలమైన సమాధానములిచ్చిన దేవునికి నీవు వందనస్తుడవైయున్నావా?
నీ జవాబు :-
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. ప్రజల పాపమును గూర్చి అంతటి భయంకరమైన, స్పష్టమైన వర్ణనలను బైబిలు ఎందుకు ఇచ్చుచున్నది?
జవాబు : అవును. బైబిలు విశ్వసనీయతను ఋజువు చేయుచున్న గొప్ప వాస్తవములలో ఇది ఒకటి. అనేక లౌకిక జీవిత చరిత్రలు చెడును కప్పిపుచ్చి లేక తొలగించి మంచిని నొక్కి చెప్పును. తన మీద ప్రజలకున్న విశ్వాసమును దృఢపరచుటకై ఇటువంటి విషయములను బైబిలు కప్పిపుచ్చదు. ఇదియు కాక, ప్రజలు గొప్ప పాపులనియు, దేవుడు వారిని రక్షింపలేడనే విషయమును తమతో ఒప్పింపజేయుటయే సాతానుని వ్యూహమైయున్నది. అతి నీచాతి నీచమైన పాపులను మించిన పాపులను సహితము దేవుడు ఏ విధముగా వారిని తమ పాపము నుండి విమోచించి నీతిమంతులుగా తీర్చెనన్న విషయమును వారు బైబిలులో కనుగొనినప్పుడు వారికి ఎంతో ఉపశమనము కలుగును (రోమీయులకు 15:4)!
2. బైబిలంతయు దైవ ప్రేరేపితమైనదా లేక దానిలో కొన్ని భాగములు మాత్రమేనా?
జవాబు : ఈ ప్రశ్నకు “దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది” అని బైబిలు జవాబిచ్చుచున్నది (2 తిమోతి 3:16). బైబిలనగా కేవలము ఒక సాధారణ వాక్య సంపుటి కాదు. అది దేవుని వాక్యముతో కూడుకొన్నది. బైబిలు మనిషి మనిషిగా ఎట్లు జీవించవలెనో నేర్పేటువంటి ఒక సమాచార సాధనమైయున్నది. బైబిలులోని ఏ ఉపదేశమునైనను తిరస్కరించిన యెడల, మనము అనేక ఇబ్బందులు మరియు సమస్యలు ఎదుర్కొనవలసి వచ్చును.
3. నేటి మన నవీన శతాబ్దము నుండి ఎప్పుడో తొలగింపబడిన పురాతన గ్రంథము మీద ఆధారపడుట అంత క్షేమకరము కాదా?
జవాబు : లేదు. బైబిలు కాలక్రమమే దాని సానుకూలతను చాటుచున్నది. ఇది బైబిలు దైవ ప్రేరేపితమని ఋజువు చేయు విషయములలో ఒకటి. "ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును" అని బైబిలు చెప్పుచున్నది (1 పేతురు 1:24). బైబిలు ఒక రాయి వలె ఎల్లప్పుడు సుస్థిరముగా నిలిచియుండును. బైబిలు దేవుని గ్రంథము, అది ఆయన వాక్కు గనుక ఎన్నటికి నిరర్థకము కానేరదు. అనేకమంది ప్రజలు మరియు ఎన్నో దేశములు బైబిలుపై తిరుగబడి, దానిని నిషేధించి, అవమానించి, నిరర్ధకము చేయాలని ప్రయత్నించి, చివరకు వారిపై వారే అవమానమును కొని తెచ్చుకొని నశించిపోయిరి. బైబిలుపై వారు చేసిన దాడులు మరువబడినవి. అయినను, బైబిలు అదే స్థిరమైన ప్రజాదరణ చేత ఉత్తమముగా విక్రయించబడుచున్నది. అవసరమైతే, లక్షలమంది బైబిలు కొరకు ప్రాణాలివ్వడానికైనను సిద్ధముగా ఉన్నారు. బైబిలిచ్చు వర్తమానము దైవానుగ్రహము మరియు అది ఎప్పుడు నూటికి నూరుపాళ్లు నవీకరణముగాను మరియు తాజాగాను ఉండును. నీవు దానిని అధ్యయనము చేయుటకు ముందు ప్రార్ధన చేసికొని, చదువుచుండగా నీ హృదయము తెరువబడులాగున దేవుని ప్రార్థించుము.
4. ప్రపంచములోని ఎంతోమంది తెలివైన మేధావులు బైబిలును ఎవరు అర్థము చేసికొనలేరని నమ్ముచున్నారు. ఇది నిజముగా దేవుని గ్రంథమైన యెడల, ప్రతి ఒక్కరు దీనిని అర్థము చేసికొనవలెను కదా?
జవాబు : సమస్త సాధారణ విషయములను అర్థము చేసికొని వివరించగల మేధావులు బైబిలులోని అసాధారణమైన విషయములను మాత్రము వారు తరుచుగా వివరించలేకపోవుచున్నారు. దీనికి కారణము, ఆత్మ విషయములు "ఆత్మానుభవము చేతనే వివేచింపదగును" (1 కొరింథీయులకు 2:13, 14). వాక్యములోని లోతు విషయములను, మేధావితనము కలిగిన లౌకిక మనస్సు గ్రహింపనేరదు. ఒకడు నిజాయితీగా దేవునితో ఆత్మానుభవము కొరకు పరితపిస్తేనే తప్ప అతడు ఆత్మ విషయములు గ్రహింపలేదు. బైబిలును పరిపూర్ణముగా వివరింపగల దేవుని పరిశుద్ధాత్మను (యోహాను 16:13; 14:26), శరీరానుసారమైన లౌకిక మనస్సు గ్రహింపనేరదు. మరొక వైపు, దీనులు, విద్యలేని క్రైస్తవ పామరులు సహితము బైబిలు చదువుచుండగా వారు దేవుని పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతమైన వివేచన జ్ఞానమును పొందుచున్నారు (మత్తయి 11:25; 1 కొరింథీయులకు 2:9, 10).
5. కొందరు బైబిలు లోపములతో నిండియున్నదని అనుచున్నారు. ఇది ప్రేరేపించబడిన గ్రంథమని ఎవరైన ఎట్లు నమ్మగలరు?
జవాబు : బైబిలునందు లోపములుగా యెంచబడిన అనేక విషయములు దానిని సరియైన రీతిలో అర్థము చేసికొనకుండ తప్పులు ఎత్తిచూపు వారి పక్షము నుండి వెలువడిన తీర్పు లోపములు. అవి వాస్తవముగా లోపములే కావు. అవి సత్యమును అపార్థము చేసికొనుట వలన కలిగిన ఫలితములు. దైవ ప్రేరేపితమైన బైబిలు గ్రంథము :
- ఎల్లప్పుడు నీకు సత్యమునే బోధించును.
- నిన్ను తప్పుదారి పట్టించదు.
- పూర్తిగా విశ్వసింపదగినది.
- ఆత్మ సంబంధమైన విషయములలోనే కాక ఇతర చారిత్రక మరియు వైజ్ఞానిక రంగములకు సంబంధించిన సమాచారమును కూడ బైబిలు అధికార పూర్వకముగా సమకూర్చగలదు.
ఎల్లప్పుడు ఏదో ఒక రూపములో లేఖనమును నిరర్థకము చేయాలనే సాతానుని సంకల్పమును చూచి ఆశ్చర్యపడనవసరము లేదు. అతడు దేవుని పట్ల మరియు పరలోకము పట్ల కూడ లోపములు వెతికెను. లేఖరులు మరియు అనువాదకుల ద్వారా కొన్ని సందర్భాల్లో అనువాద తప్పిదములు జరిగియుండ వచ్చును, కాని అటువంటి అవాంఛిత సందర్భాల్లో జరిగిన ఏ ఆరోపిత లోపములు దేవుని వాక్య సత్యమును నిరర్ధకము చేయలేవు. సిద్ధాంతము బైబిలు గ్రంథములోని ఒక చిన్న వాక్యభాగము మీద కాక, దేవుడు ఏ అంశము మీదనైనను ఇచ్చిన వ్యాఖ్యానములన్నిటిని ఆధారము చేసికొని స్థాపింపబడెను. లేఖన సారాంశ సత్యమును ఏ ఆరోపిత లోపము ఆటంకపరచునో మనకు తెలియదు. లేఖనములలోని కొన్ని అనువాద తప్పిదములను ఖచ్చితముగా పరిష్కరించుట ఇంకను కష్టతరముగా ఉన్నది. అనుమానభిలాషులకు అనుమానించుటకు ఏదో ఒక కారణము దొరుకుతునే ఉండును. ఇంకను పూర్తిగా వివరణ లేని ఆరోపిత లోపములు (పూర్వము జరిగినట్లుగా) అవి తప్పుడు ఆరోపణలుగా నిరూపితమగునని మనము నమ్మవచ్చును. జనులు శ్రమించి బైబిలును అణచివేయాలని ప్రయత్నించే కొలది, దాని వెలుగు మరింత తేజవంతముగా ప్రకాశించును.
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు () పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1. నెరవేర్చబడిన ఏ ప్రవచనములు బైబిలు దైవావేశమును నిరూపించుచున్నవి? (4)
( ) కోరెషు బబులోనును జయించును.
( ) జవహర్లాల్ నెహ్రూ భారత ప్రధానిగా నియమింపబడును.
( ) ఐగుప్తు ఇక ఎన్నటికి అధికారము చెలాయించు అగ్రదేశముగా నుండకపోవును.
( ) అంత్యదినములలో నైతిక విలువలు క్షీణించిపోవును.
( ) జర్మనీకి 20 సంవత్సరముల పాటు కరవు సంభవించును.
( ) ఇక ఎన్నటికి ఉనికిలో లేకుండ బబులోను నాశనము చేయబడును.
2) బైబిలు దైవావేశము వలన కలిగిన గ్రంథమని యేసు ఎట్లు నిరూపించెను? (1)
( ) ఆ అంశము మీద బిగ్గరగా మాట్లాడుట ద్వారా.
( ) ఆయన బోధించుచు బైబిలు నుండి లేఖనములను ఉదహరించుట ద్వారా.
( ) అనుమానించిన వారి మీద పైనుండి అగ్ని కురిపించుట ద్వారా.
( ) దేవాలయపు గుమ్మముల యొద్ద నుండి బైబిలుపై తన విశ్వాసమును ప్రకటించుట ద్వారా.
3) క్రింద ఇయ్యబడిన శాస్త్రీయ (సైన్స్) సత్యములలో వేటకి బైబిలు పేర్కొనుచున్నది? (2)
( ) భూమి గుండ్రముగా నున్నది.
( ) గాలికి బరువున్నది.
( ) నీరు రసాయన సంకేతము “H2O.”
( ) సముద్రపు నీరు ఉప్పగా నున్నది.
4) క్రింద ఇయ్యబడిన ఆరోగ్య సూత్రములలో వేటివి మనము బైబిలునందు కనుగొనవచ్చును? (2)
( ) ప్రతిరోజు నాలుగు గ్యాలన్లు (సుమారు 16 లీటర్లు) నీరు త్రాగుము.
( ) మద్యపానము మానివేయుము.
( ) ప్రతి ఉదయము మరియు సాయంత్రము పరుగెత్తుము.
( ) అనైతిక లైంగిక ప్రవర్తనను విసర్జించుము.
5) క్రింద ఇయ్యబడిన వాక్యములలో బైబిలుకు సంబంధించిన సరియైన వాక్యములను గుర్తించుము : (3)
( ) బైబిలును 40 మందికి పైగా రచించిరి.
( ) బైబిలు 10,000 సంవత్సరముల పాటుగా రచింపబడెను.
( ) బైబిలులోని కొన్ని భాగములు మాత్రమే దైవ ప్రేరేపితమైనవి.
( ) బైబిలు నిజమైన గ్రంథకర్త దేవుని పరిశుద్ధాత్మ.
( ) బైబిలు ఒక ఉత్తమ విక్రేత (ఎక్కువగా కొనబడుచున్నది).
6) క్రింద ఇయ్యబడిన వాక్యములలో మెస్సీయా జీవితమును గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములేవి? (3)
( ) నజరేతులో జన్మించును.
( ) తరుచుగా పరలోకమునకు ఎగిరిపోవును.
( ) 30 వెండి నాణెములకు అమ్మబడును.
( ) హేరోదు చేత హత్యాయత్నము చేయబడును.
( ) సిలువ వేయబడును.
( ) ఏడు సంవత్సరముల తరువాత తిరిగి జీవమునకు లేపబడును.
7) బైబిలునందు ఇయ్యబడిన ఏ నియమము పాటించుట ద్వారా ఎయిడ్స్ వ్యాధిని నివారించవచ్చును? (1)
( ) అనైతికముగా వ్యభిచరింపకూడదు (అక్రమ లైంగిక సంబంధములు పెట్టుకొనరాదు).
( ) విగ్రహారాధన చేయకూడదు.
( ) క్రమముగా ఆహారము భుజించుము.
8) జీవపరిణామ సిద్ధాంతమునకు సంబంధించిన సరియైన వాక్యములను గుర్తించుము : (2)
( ) అది ఋజువు కాని సిద్ధాంతము.
( ) అది క్రైస్తవ్యమును త్రోసిపుచ్చుచున్నది.
( ) మనిషి మరియు కోతి సాధారణ పూర్వీకుల నుండి వచ్చెనని ఋజువు చేయుచున్నది.
9) క్రింద ఇయ్యబడిన ఏయే వాక్యములు బైబిలు యొక్క దైవావేశమును ఋజువు చేయుటలో మనకు సహాయపడగలవు? (5)
( ) బైబిలునందు మంచి మరియు చెడు వ్యక్తిత్వములు కలవు.
( ) తన్ను అనుసరించువారి జీవితములను బైబిలు మార్చివేయును.
( ) మెస్సీయాను గూర్చిన పాత నిబంధన ప్రవచనములు యేసు ద్వారా నెరవేర్చబడెను.
( ) రాజ్యాధికారములోనికి రాబోవు నాలుగు ప్రపంచ రాజ్యములను గూర్చి బైబిలునందు ముందుగా చెప్పబడెను.
( ) బైబిలులోని ఏకత్వమే దాని దైవావేశమును ఋజువు చేయుచున్నది.
( ) బైబిలు యేసు రెండవ రాకడ యొక్క దినమును మరియు గడియను గూర్చి తెలియజేయుచున్నది.
10) దేవుడు భూమిని అక్షరాలా ఆరు వాస్తవ దినములలో సృజించెను. (1)
( ) సత్యము.
( ) అసత్యము.
11) నోవహు దినములోని ప్రపంచవ్యాప్తమైన జలప్రళయము సముద్ర జీవరాశులను మరియు ఓడలోపల ఉన్నవారిని తప్ప సమస్త జీవులను నాశనము చేసెను. (1)
( ) సత్యము.
( ) అసత్యము.
12) ప్రపంచ వేరు వేరు భాషలు బాబెలు గోపురము వద్ద నుండి ప్రారంభమైనవి. (1)
( ) సత్యము.
( ) అసత్యము.
13 ) జీవితమును అత్యంత కలవరపరచు ప్రశ్నలకు బైబిలునందు సానుకూలమైన సమాధానములిచ్చిన దేవునికి నేను ఎంతగానో వందనస్తుడనైయున్నాను.
( ) అవును.
( ) కాదు.