Lesson 8
ఇది కట్టుకథ కాదు సుమా! ఒక దినము వచ్చుచున్నది, ఆ దినమున ప్రపంచమును నేడు పీడించుచున్న బాధ, ఆకలి, ఒంటరితనము, నేరము మరియు గందరగోళములన్నిటి నుండి నీవు విడుదల పొందవచ్చును. వినుటకిది అద్భుతమనిపించుట లేదా? కాని నిన్ను విడుదల చేయబోవునది ఆకర్షణీయమైన ప్రపంచ నాయకుడు కాదు - కానే కాదు, నీ విమోచకుడు అంతకంటే చాలా గొప్పవాడు! యేసు ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు, కాని ఆయన ఏ రీతిగా తిరిగి వచ్చును అనే దానిపై చాలా అపోహలు ఉన్నవి. కాబట్టి రెండవ రాకడ గురించి బైబిలు నిజముగా ఏమి చెప్పుచున్నదో అర్థము చేసికొనుటకు కొన్ని నిమిషములు కేటాయించుము, తద్వారా నీవు వెనుకనే మిగిలిపోయి ఉండవు!
"క్రీస్తు ... రెండవసారి ప్రత్యక్షమగును" (హెబ్రీయులకు 9:28). "నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచిన యెడల ... (నేను) మరల వచ్చెదను" (యోహాను 14:3).
జవాబు : అవును! మత్తయి 26:64లో, యేసు ప్రభువు తాను ఈ భూమికి తిరిగి వచ్చెదనని సాక్ష్యమిచ్చెను. లేఖనములు నిరర్ధకము కానేరవు గనుక (యోహాను 10:35), ఆయన తిరిగి వచ్చుననుటకు ఇది సానుకూలమైన ఋజువు. ఇది క్రీస్తు యొక్క వ్యక్తిగత హామీ. అంతేకాకుండ, యేసు ప్రభువు తన మొదటి రాకడ ప్రవచనములను నెరవేర్చెను, గనుక ఆయన తన రెండవ రాకడకు సంబంధించిన ప్రవచనములను కూడ నెరవేర్చునని మనము ఖచ్చితముగా నమ్మవచ్చును!
2. ఏ రీతిగా యేసు ప్రభువు రెండవ సారి తిరిగి వచ్చును?
"ఈ మాటలు చెప్పి, వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను, అప్పుడు వారి కన్నులకు కనబడకుండ ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్లుచుండగా, వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన యిద్దరు మనుష్యులు వారి యొద్ద నిలిచి గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యీ యేసే, ఏ రీతిగా పరలోకమునకు వెళ్లుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి” (అపొస్తలుల కార్యములు 1:9-11)
జవాబు : యేసు ప్రభువు కనిపించే, అక్షరార్ధమైన (ప్రత్యక్షమైన), శరీరధారిగా, నిజమైన వ్యక్తిగా వెళ్లిన అదే రీతిలో తిరిగి వచ్చునని లేఖనములు వాగ్దానము చేయుచున్నవి. "మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట" వారు చూచెదరు అని మత్తయి 24:30 చెప్పుచున్నది. ఎముకలు రక్తమాంసములతో కూడిన శరీరముతో ఆయన నిజమైన వ్యక్తిగా మేఘములలో అక్షరార్ధముగా (ప్రత్యక్షముగా) వచ్చును (లూకా 24:36-43, 50, 51). ఆయన రాకడ దృశ్యమైనది (కళ్లకు కనిపించునది), ఈ వాస్తవములపై లేఖనము స్పష్టముగా ఉన్నది!
"ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును" (ప్రకటన 1:7) "మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును" (మత్తయి 24:27) "ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు" (1 థెస్సలొనీకయులకు 4:16).
జవాబు : యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు ప్రపంచములో జీవించుచున్న ప్రతి పురుషుడు, స్త్రీ మరియు చిన్న పిల్లవాడు తన రెండవ రాకడలో ఆయనను చూచెదరు. ఆయన ప్రత్యక్షత యొక్క అద్భుతమైన వెలుగు దిక్కు నుండి దిక్కుకు వ్యాపించి ఉండును, మరియు వాతావరణము మెరుపు వంటి అద్భుతమైన తేజస్సుతో నింపబడి యుండును. దాని నుండి ఎవరు దాగుకొనలేరు. మృతులు సహితము లేచునట్టి పెద్ద, నాటకీయ సంఘటన ఇది.
ముఖ్య గమనిక : రెండవ రాకడ వచ్చుచున్నదని ప్రతి వ్యక్తికి తెలియబడును! "రహస్య రాకడ”ను సూచించుటకు కొందరు 1 థెస్సలొనీకయులకు 4:16ను ఉపయోగించుచున్నారు, ఇక్కడ రక్షింపబడినవారు భూమి నుండి నిశ్శబ్దముగా అదృశ్యమవుదురు, కాని ఇది వాస్తవానికి బైబిల్లోని బిగ్గర శబ్దముతో కూడుకొన్న వచనములలో ఒకటి : ప్రభువు ఆర్భాటించును, బూర మ్రోగును, మరియు మృతులు లేచును! రెండవ రాకడ నిశ్శబ్ద సంఘటన కాదు, అది హృదయములోనికి వచ్చే ఆధ్యాత్మిక రాకడ మాత్రమే కాదు. ఇది ఒక వ్యక్తి మరణమందు జరుగదు, లేదా ఇది ఒక అలంకారరూపము కాదు. ఈ సిద్ధాంతములన్నియు మానవ రూపకల్పనలు, కాని రెండవ రాకడ అక్షరాలా, ప్రత్యక్షమైన, ప్రపంచవ్యాప్తమైన, దృశ్యమైన, మేఘములలో కనిపించే క్రీస్తు యొక్క వ్యక్తిగత ప్రత్యక్షతయై యుండునని బైబిలు స్పష్టముగా పేర్కొనుచున్నది.
4. తన రెండవ రాకడలో యేసు ప్రభువుతో కూడ ఎవరు, ఎందుకు వచ్చెదరు?
"తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునపుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై యుండును” (మత్తయి 25:31).
జవాబు : పరలోకము యొక్క దేవదూతలందరు ఆయన రెండవ రాకడలో యేసు ప్రభువుతో కూడ వచ్చెదరు. ప్రకాశవంతమైన మేఘము భూమికి చేరువవగా, యేసు ప్రభువు తన దేవదూతలను పంపును, వారు త్వరగా నీతిమంతులందరిని పోగు చేసి పరలోకమునకు తిరిగి తీసికొని వెళ్లుటకు సిద్ధము చేసెదరు (మత్తయి 24:31).
“ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని వాని క్రియ చొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిరపరచిన జీతము నా యొద్ద ఉన్నది” (ప్రకటన 22:12) "నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును" (యోహాను 14:3) "క్రీస్తుయేసును ఆయన పంపును... అన్నిటికి కుదురుబాటు కాలములు వచ్చు ... వరకు యేసు పరలోక నివాసియై యుండుట ఆవశ్యకము" (అపొస్తలుల కార్యములు 3:20, 21).
జవాబు : ఆయన వాగ్దానము చేసినట్లుగానే తన ప్రజలను రక్షించుటకు మరియు వారిని వారి కొరకు సిద్ధము చేసిన సుందరమైన గృహమునకు తీసికొని పోవుటకు యేసు ప్రభువు తిరిగి ఈ భూమికి వచ్చుచున్నాడు.
“ప్రభువు తానే పరలోకము నుండి దిగివచ్చును ... క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము” (1 థెస్సలొనీకయులకు 4:16, 17) “మనమందరము మార్పు పొందుదుము. ... అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, ... మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసియున్నది” (1 కొరింథీయులకు 15:51-53). "ప్రభువైన యేసుక్రీస్తు... నిమిత్తము (మనము) కనిపెట్టుకొనియున్నాము. ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును" (ఫిలిప్పీయులకు 3:20, 21).
జవాబు : తమ జీవితకాలములో క్రీస్తును అంగీకరించి మరణించిన వారు వారి సమాధులలో నుండి లేపబడి, పరిపూర్ణమైన మరియు అమర్త్యమైన శరీరములు ధరించుకొని, ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడుదురు. సజీవులైయున్న నీతిమంతులు కూడ నూతనమైన శరీరములు ధరించుకొని ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు కొనిపోబడుదురు. అప్పుడు యేసు ప్రభువు రక్షింపబడిన వారందరిని పరలోకమునకు తీసికొని పోవును.
ముఖ్య గమనిక : యేసు ప్రభువు తన రెండవ రాకడలో భూమిని తాకడని గమనించుము. పరిశుద్ధులు ఆయనను “ఆకాశమండలములో” కలిసికొందురు. కాబట్టి క్రీస్తు ఉదాహరణకు, విజయవాడలో, హైదరాబాద్లో, తమిళనాడులో, లేదా భూమ్మీద మరెక్కడైనను ఉన్నాడనే ఏ సమాచారము చేత దేవుని ప్రజలు మోసపోరు. అబద్దపు క్రీస్తులు భూమిపై కనబడి సూచక క్రియలు చేయుదురు (మత్తయి 24:23-27), కాని యేసు ప్రభువు తన రెండవ రాకడలో భూమికి పైన ఉన్న మేఘములయందే నిలిచి యుండును.
7. యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు దుర్మార్గులకు ఏమగును?
"తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును" (యెషయా 11:4) “ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశము యొక్క యీ దిశ నుండి ఆ దిశ వరకు కనబడుదురు” (యిర్మీయా 25:33).
జవాబు : యేసు ప్రభువు వచ్చినప్పుడు తిరుగుబాటుగా పాపమునకు అంటుకొని ఉన్నవారు ఆయన ప్రకాశించే మహిమ చేత నశించిపోవుదురు.
"పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు." (అప్పుడు) “ప్రతి ద్వీపము పారిపోయెను, పర్వతములు కనబడక పోయెను” (ప్రకటన 16:18, 20) "నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండుకుండ పడగొట్టబడియుండెను" (యిర్మీయా 4:26) “యెహోవా దేశమును (భూమిని) వట్టిదిగా చేయుచున్నాడు, ఆయన దాని పాడుగా చేసి కల్లోలపరచుచున్నాడు.” “దేశము (భూమి) కేవలము వట్టిదిగా చేయబడును” (యెషయా 24:1, 3).
జవాబు : ప్రభువు రాకడతో గొప్ప భూకంపము చేత భూమి చిక్కుకొనబడును. ఈ భూకంపము చాలా వినాశకరమైనది, అది ప్రపంచమును పూర్తి నాశనకర స్థితిలో వదిలివేయును.
9. క్రీస్తు యొక్క రెండవ రాకడ సమీపములోనే ఉన్నదనుటకు బైబిలు ప్రత్యేక సమాచారమిచ్చుచున్నదా?
జవాబు : అవును! యేసు ప్రభువు స్వయముగా, “మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి” అని చెప్పెను (మత్తయి 24:33). ప్రభువు తన ఆరోహణము నుండి తన రెండవ రాకడ వరకు సూచనలను మనకు అందుబాటులో ఉంచెను. క్రింద చూడుము ...
A. యెరూషలేము యొక్క వినాశనము
ప్రవచనము: “రాతి మీద రాయి యొకటియైనను ఇక్కడ నిలిచి యుండకుండ పడద్రోయబడును.” “యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను” (మత్తయి 24:2, 16).
నెరవేర్పు: యెరూషలేము పట్టణము క్రీ.శ. 70లో రోమా సైన్యాధిపతి టైటస్ చేత నాశనము చేయబడెను.
B. గొప్ప హింస, మహా శ్రమకాలము
ప్రవచనము: "అప్పుడు మహాశ్రమ కలుగును ... లోకారంభము నుండి ఇప్పటి వరకును అట్టి శ్రమ కలుగలేదు" (మత్తయి 24:20, 21).
నెరవేర్పు: ఈ ప్రవచనము ప్రధానముగా చీకటి యుగములలో జరిగిన మహా శ్రమకాలము సూచించుచున్నది మరియు మతభ్రష్టత్వము పొందిన క్రైస్తవ సంఘము చేత ప్రేరేపించబడినది. ఇది 1,000 సంవత్సరములకు పైగా కొనసాగెను. 50 మిలియన్ల మంది (5 కోట్ల మంది) క్రైస్తవులు అసత్య సంఘము చేత చంపబడిరి, ఇది "మానవుల మధ్య ఇప్పటివరకు ఉన్న ఏ ఇతర సంస్థల కన్నా ఎక్కువ అమాయక రక్తమును చిందించినది. "
C. చీకటిగా మారిన సూర్యుడు
ప్రవచనము: "ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును” (మత్తయి 24:29).
నెరవేర్పు: మే 19, 1780న ప్రకృతికి అతీతమైన చీకటి దినము ద్వారా ఇది నెరవేరినది. ఇది గ్రహణము కాదు. ఒక ప్రత్యక్ష సాక్షి, "1780 మే 19, ఒక గొప్ప వింతైన చీకటి దినము. చాలా ఇళ్లలో కొవ్వొత్తులు వెలిగించబడెను పక్షులు నిశ్శబ్దముగా అదృశ్యమాయెను, కోళ్లు తమ కూతను విరమించుకొన్నవి. ... తీర్పు దినము వచ్చినదనే సాధారణ భావన అందరిలో కలిగెను" అని వివరించెను.
D. రక్తవర్ణముగా మారిన చంద్రుడు
ప్రవచనము: “యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును” (యోవేలు 2:31).
నెరవేర్పు: మే 19, 1780 "చీకటి దినము”న రాత్రివేళ చంద్రుడు రక్తము వలె ఎర్రగా మారెను. దానిని చూచిన ఒక వ్యక్తి, Stone's History of Massachusetts (స్టోన్స్ హిస్టరీ ఆఫ్ మస్సాచుసెట్స్) లో "నిండుగా ఉన్న పున్నమి చంద్రుడు రక్తవర్ణముగా కనబడెను" అని చెప్పెను.
E. ఆకాశము నుండి నక్షత్రములు రాలుట
ప్రవచనము: “ఆకాశము నుండి నక్షత్రములు రాలును” (మత్తయి 24:29).
నెరవేర్పు: నవంబర్ 13, 1833 రాత్రి ఒక అద్భుతమైన ఉల్కాపాతము (ఉల్కలు రాలుట) జరిగెను. ఇది ఎంత ప్రకాశవంతముగా ఉన్నదంటే, చీకటి వీధిలో ఒక వార్తాపత్రిక చదువవచ్చును. యుగాంతము వచ్చినదని ప్రజలు భావించిరి. దీనిని చూడుము. ఇది ఎంతో మనోహరమైనది - మరియు క్రీస్తు రాకడకు సూచనయై యున్నది. ఒక రచయిత, "దాదాపు నాలుగు గంటల పాటు ఆకాశము అక్షరాలా ఉద్రిక్తముగా మండెను" అని చెప్పెను.
F. యేసు మేఘారూఢుడై వచ్చుట
ప్రవచనము: “అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి, భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు” (మత్తయి 24:30).
నెరవేర్పు: తరువాత జరుగుబోవు గొప్ప సంఘటన ఇదే. మరి నీవు సిద్ధముగా ఉన్నావా?
జవాబు : అవును! అంత్య దినములను గూర్చిన ఈ క్రింది సూచనలను చూడుము. నీవు ఆశ్చర్యపడుదువు. భూచరిత్ర యొక్క ముగింపు దినములలో మనము ఉన్నామని చూపించే అనేక సూచనలలో ఇవి కొన్ని మాత్రమే.
A. యుద్ధములు మరియు కలహములు
ప్రవచనము: “మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరుగవలసియున్నవి” (లూకా 21:9).
నెరవేర్పు : యుద్ధములు మరియు ఉగ్రవాద దాడులు ప్రపంచవ్యాప్తముగా లక్షలాది మందిని ప్రభావితము చేయుచు పీడించుచున్నవి. యేసు ప్రభువు త్వరిత రాకడ మాత్రమే ఈ బాధ మరియు విధ్వంసమునకు ముగింపు తెచ్చును.
B. కలవరము, భయము, మరియు తిరుగుబాటు
ప్రవచనము : “మరియు భూమి మీద ... కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. ... లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు” (లూకా 21:25, 26).
నెరవేర్పు: ఇది నేటి ప్రపంచములో ఖచ్చితముగా జరుగుచున్న వైనము - మరియు దీనికి ఒక కారణమున్నది : మనము భూచరిత్ర యొక్క అంత్య దినములలో జీవించున్న ప్రజలము. నేడు ప్రపంచములో ఉన్న ఉద్రిక్త వాతావరణము మనలను ఆశ్చర్యపర్చకూడదు. ఇది జరుగునని క్రీస్తు ముందుగానే చెప్పెను. ఆయన రాకడ సమీపముగా ఉన్నదని అది మనలను ఒప్పించవలెను.
C. తెలివి అధికమగుట
ప్రవచనము : “అంత్యకాలమున... తెలివి అధికమగును" (దానియేలు 12:4).
నెరవేర్పు: సమాచార యుగము యొక్క అభ్యున్నతి దీనిని స్పష్టము చేయుచున్నది. ఈ సూచన నెరవేరినట్లు అత్యంత సంశయవాద మనస్సు కూడ అంగీకరించక తప్పదు. సైన్స్ (విజ్ఞాన శాస్త్రము) - మెడిసిన్ (వైద్య శాస్త్రము), టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానము) ఇంకా మరెన్నో రంగములలో జ్ఞానము (తెలివి) విపరీతముగా ప్రబలుచున్నది లేదా పెల్లుబుకుచున్నది.
D. అపహాసకులు మరియు మత సంశయవాదులు
ప్రవచనము: “అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చెదరు” (2 పేతురు 3:3). “జనులు హితబోధను సహింపక, ... సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగుదురు” (2 తిమోతి 4:3, 4).
నెరవేర్పు: నేడు ఈ ప్రవచనము నెరవేరుటను చూచుట కష్టము కాదు. మత నాయకులు సహితము స్పష్టమైన బైబిలు బోధలైన సృష్టి, జలప్రళయము, క్రీస్తు దైవత్వము, రెండవ రాకడ మరియు అనేక ఇతర బైబిలు సత్యములను కొట్టిపారేయుచున్నారు. ప్రభుత్వ అధ్యాపకులు మన యువతకు బైబిలు చరిత్రను అపహాస్యము చేయమని మరియు దేవుని వాక్యము యొక్క స్పష్టమైన సత్యముల స్థానములో పరిణామవాదము మరియు ఇతర తప్పుడు బోధలను భర్తీ చేయమని బోధించుచున్నారు.
E. నైతిక క్షీణత, ఆధ్యాత్మికత క్షీణించుట
ప్రపచనము : “అంత్యదినములలో... మనుష్యులు స్వార్థ ప్రియులు ... అనురాగరహితులు ... అజితేంద్రియులు ... సజ్జనద్వేషులు, ... పైకి భక్తిగల వారివలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించనివారునై యుందురు” (2 తిమోతి 3:1-5).
నెరవేర్చు: భారతదేశము ఆధ్యాత్మిక సంక్షోభములో ఉన్నది. అన్ని వర్గముల ప్రజలు అట్లు చెప్పుచున్నారు. రెండు వివాహములలో దాదాపు ఒక వివాహము విడాకులతో ముగియుచున్నది. నేటి తరము ప్రజలు బైబిలు ఆధ్యాత్మికతపై ఆసక్తిని తగ్గించుట దేవుని వాక్యము యొక్క స్పష్టమైన నెరవేర్పు. నిజమైన ఆశ్చర్యము కొరకు, 2 తిమోతి 3:1-5లో జాబితా చేయబడిన ఎన్ని అంత్య దిన పాపములు మన వార్తాపత్రికల్లో ప్రచురించబడుచున్నాయో చూడుము. ప్రభువు రాకడ తప్ప, నేడు ప్రపంచమును చుట్టుముట్టిన చెడు యొక్క ఆటుపోట్లను ఏదియు అడ్డుకోదు.
F. సుఖానుభవము కొరకు పిచ్చి వ్యామోహము
ప్రవచనము : “అంత్యదినములలో ... మనుష్యులు ... దేవుని కంటె సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు” (2 తిమోతి 3: 1, 2, 4).
నెరవేర్పు: ప్రపంచము సుఖానుభవము కొరకు పిచ్చిదైపోయినది. కొద్దిమంది మాత్రమే క్రమము తప్పకుండ సంఘమునకు హాజరాగుచున్నారు, కాని వేలాది మంది క్రీడా రంగములు మరియు ఇతర వినోద ప్రదేశములలో క్రిక్కిరిసిపోవుచున్నారు. భారతీయులు ప్రతి సంవత్సరము సుఖానుభవము కొరకు కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయుచున్నారు మరియు దేవుని కార్యక్రమముల కొరకు పోలికలో ఖర్చు చేసేది “చిల్లిగవ్వలు” మాత్రమే. సుఖానుభవము కొరకు పిచ్చివారైన భారతీయులు 2 తిమోతి 3:4 యొక్క ప్రవచనమును అక్షరాలా ప్రత్యక్షముగా నెరవేర్చుచు ఐహిక సంతృప్తి కొరకు పరితపించుచు టీవీ ముందు కొన్ని వందల కోట్ల గంటలు వృథా చేయుచున్నారు.
G. పెరుగుచున్న అక్రమము, రక్తపాత నేరములు, మరియు బలాత్కారము
ప్రవచనము : “అక్రమము విస్తరించును” (మత్తయి 24:12), “దుర్జనులును వంచకులును అంతకంతకు చెడిపోవుదురు” (2 తిమోతి 3:13). "దేశము రక్తముతో నిండియున్నది, పట్టణము బలాత్కారముతో నిండియున్నది" (యెహెజ్కేలు 7:23).
నెరవేర్పు: ఈ సూచన నెరవేరినట్లు స్పష్టముగా చూడగలము. అక్రమము ఆశ్చర్యపరచే వేగముతో పెరుగుచున్నది. చాలా మంది తమ ప్రాణములకు భయపడి ఇళ్ల తలుపులు మూసికొనుచున్నారు. నేడు చాలా మంది నాగరికత మనుగడ గురించి ఆందోళన చెందుచున్నారు ఎందుకనగా నేరఘోరములు మరియు భయాందోళనలు కఠినముగా విజృంభించుచు హద్దు మీరి అదుపు చేయలేనంతగా పెరిగిపోవుచున్నవి.
H. ప్రకృతి వైపరీత్యములు మరియు ప్రజల్లో కలవరము
ప్రవచనము: “అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరవులును తటస్థించును” భూమి మీద ... కలవరపడిన జనములకు శ్రమయు కలుగును” (లూకా 21:11, 25).
నెరవేర్పు: భూకంపములు, సుడిగాలులు మరియు వరదలు విపరీతమైన సంఖ్యలో పెరుగుచున్నవి. ప్రతిరోజు వేలాది మంది ఆకలి బాధతో, వ్యాధితో, నీటి కొరతతో మరియు ఆరోగ్య సంరక్షణ లేక మరణించుచున్నారు - ఇవన్నియు మనము భూమి యొక్క అంతిమ గడియలలో జీవించుచున్నామనుటకు సూచనలు.
I. అంత్యదినములలో ప్రపంచమునకు ఒక ప్రత్యేక వర్తమానము
ప్రవచనము : "ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును" (మత్తయి 24:14).
నెరవేర్పు: క్రీస్తు రెండవ రాకడ యొక్క గొప్ప, అంతిమ హెచ్చరిక వర్తమానము ఇప్పుడు దాదాపు ప్రతి ప్రపంచ భాషలో ప్రకటించబడుచున్నది. యేసు ప్రభువు రెండవ రాకడకు ముందు, ప్రపంచములోని ప్రతి వ్యక్తి ఆయన త్వరిత రాకడను గూర్చి హెచ్చరింపబడును.
J. ఆత్మవాదమునకు తిరుగుట
ప్రవచనము : “కడవరి దినములలో కొందరు ... మోసపరుచు ఆత్మలయందును ... లక్ష్యముంచి, విశ్వాస బ్రష్టులగుదురు” (1 తిమోతి 4:1) “అవి ... దయ్యముల ఆత్మలే” (ప్రకటన 16:14).
నెరవేర్పు: నేటి ప్రజలు, అధిక సంఖ్యలో దేశాధినేతలతో సహా, మానసిక, భూతవైద్యులు మరియు ఆత్మవాదుల నుండి సలహాలు తీసికొనుచున్నారు. ఆత్మవాదము క్రైస్తవ సంఘములపై కూడ దాడి చేసినది, బైబిలానుసారము కాని "ఆత్మ యొక్క అమరత్వము" అనే బోధ ద్వారా ఇది ముందుకు వచ్చినది. మరణించినవారు మృతులై యున్నారని బైబిలు బోధించుచున్నది. (ఈ అంశముపై మరింత సమాచారము కొరకు 10వ స్టడీ గైడ్ పత్రికను చూడు56rము.)
K. పెట్టుబడిదారులు / కార్మికుల మధ్య కలహములు
ప్రవచనము: "ఇదిగో మీ చేలు కోసిన పనివారికియ్యక, మీరు మోసముగా బిగబట్టిన కూలి మొఱ్ఱపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చియున్నవి. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగియుందుడి"(యాకోబు 5:4, 8).
నెరవేర్పు: పెట్టుబడిదారులు మరియు కార్మికుల మధ్య కలహములు అంత్యదినములకు సూచనగా ముందుగానే చెప్పబడినది. ఇది నెరవేరినదా అని మనము అనుమానించాలా?
“అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంత కాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరీ సంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే యున్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను" (మత్తయి 24:32-34).
జవాబు : ఈ విషయముపై బైబిలు చాలా నిర్దిష్టముగాను మరియు స్పష్టముగా ఉన్నది. దాదాపు అన్ని సూచనలు నెరవేరినవి. క్రీస్తు రెండవ రాకడను గూర్చిన దినము మరియు గడియ మనకు తెలియదు (మత్తయి 24:36), కాని ఆయన రాకడ సమీపముగానే ఉన్నదని మనము తెలిసికొనవచ్చును. ఇప్పుడే కార్యములను క్లుప్తపరచి చాలా త్వరగా వాటిని పూర్తి చేసెదనని దేవుడు వాగ్దానము చేసియున్నాడు (రోమీయులకు 9:27). క్రీస్తు తన ప్రజల కొరకు త్వరలో ఈ భూమికి తిరిగి వచ్చుచున్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా?
"అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే" (ప్రకటన 16:14). అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనబరచెదరు" (మత్తయి 24:24). "ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్యప్రకారము వారు బోధించని యెడల వారికి అరుణోదయము కలుగదు" (యెషయా 8:20).
జవాబు : రెండవ రాకడ గురించి సాతాను అనేక తప్పుడు బోధలను కనుగొన్నాడు మరియు క్రీస్తు ఇప్పటికే వచ్చెనని లేదా బైబిలు బోధలకు అనుగుణముగా లేని రీతిలో వచ్చునని నమ్మునట్లు లక్షలాది మందిని మోసము చేయుచున్నాడు. కాని క్రీస్తు సాతాను యొక్క వ్యూహమును గూర్చి హెచ్చరించియున్నాడు, "ఎవడును మిమ్మును మోసపరచకుండ చూచుకొనుడి” (మత్తయి 24:4). మనము ముందుగానే హెచ్చరించబడు నిమిత్తము, ఆయన సాతాను యొక్క అబద్ధములను బహిర్గతము చేసెను, "ఇదిగో, ముందుగా నేను మీతో చెప్పియున్నాను" (మత్తయి 24:25). ఉదాహరణకు, యేసు ప్రభువు తాను అరణ్యములో కనిపించనని లేదా ఒక రహస్యమైన (మృతుల ఆత్మలను సంప్రదించే) లోపలిగదికి రానని ప్రత్యేకముగా చెప్పెను (26వ వచనము). క్రీస్తు రెండవ రాకడ గురించి దేవుడు ఏమి బోధించుచున్నాడో తెలిసికొనిన యెడల మోసగించబడుటకు ఏ కారణము లేదు. రెండవ రాకడ గురించి బైబిలు ఏమి చెప్పుచున్నదో తెలిసిన ప్రజలు సాతాను చేత తప్పుడు మార్గములో నడిపింపబడరు. మిగతా వారందరు మోసగించబడుదురు.
“నా యొద్దకు వచ్చువానిని నేనంతమాత్రమును బయటికి త్రోసివేయను” (యోహాను 6:38). "తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, ... దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను" (యోహాను 1:12). "వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును" (హెబ్రీయులకు 8:10). "మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవుని స్తోత్రము కలుగును గాక" (1 కొరింథీయులకు 15:57).
జవాబు : యేసు ప్రభువు, "ఇదిగో నేను తలుపునొద్ద (ఈ తలుపు మానవ హృదయమునకు గుర్తు) నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల నేను అతని యొద్దకు" (లేక, అతని లోనికి) వచ్చెదనని చెప్పెను (ప్రకటన 3:20). పరిశుద్ధాత్మ ద్వారా, యేసు ప్రభువు నీ జీవితమును మార్చగలుగుటకు నీ హృదయములోనికి వచ్చెదనని అడుగును. నీవు నీ జీవితమును ఆయన వైపుకు త్రిప్పిన యెడల, ఆయన నీ గత పాపములన్నిటిని తుడిచివేయును (రోమీయులకు 3:25) మరియు దైవిక జీవితమును జీవించుటకు నీకు తగిన శక్తి నిచ్చును (యోహాను 1:12). నీవు పరిశుద్ధమైన దేవుని యెదుట నిర్భయముగా నిలువబడుటకు, ఒక ఉచిత బహుమానముగా, ఆయన తన నీతి స్వభావమును నీకు ప్రసాదించును. అప్పుడు ఆయన చిత్తమును చేయుట నీకు ఆనందకరమగును. ఇది చాలా సులభము, చాలామంది దీని వాస్తవికతను అనుమానించుచున్నారు, కాని ఇది ముమ్మాటికి నిజము. క్రీస్తుకు నీ జీవితము నర్పించి ఆయన నీలో జీవించుటకు అనుమతించుటయే నీ వంతు. నీ జీవితమును మార్చి ఆయన రెండవ రాకడకు నిన్ను సిద్ధము చేసే శక్తివంతమైన అద్భుతకార్యమును నీలో జరిగించుట ఆయన వంతు. ఇది ఉచిత బహుమానము. నీవు చేయవల్సిందల్లా దానిని అంగీకరించుటయే.
14. ఏ గొప్ప ప్రమాదము గురించి క్రీస్తు మనలను హెచ్చరించుచున్నాడు?
"మీరనుకొనని గడియలో మనుష్యకుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి" (మత్తయి 24:44). “మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి” (లూకా 21:34). "నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును అలాగే ఉండును" (మత్తయి 24:37).
జవాబు : మన జీవితములు ఐహిక విచారములతో బిజీగా నిమగ్నమగుటలో లేదా పాపపు ఆనందములో మునిగిపోవుటలో గొప్ప ప్రమాదమున్నది, దీని వలన నోవహు దినములలో ప్రపంచము మీదికి జలప్రళయము వచ్చినట్లు మన మీదికి ప్రభువు రాకడ వచ్చును, అప్పుడు మనము సిద్ధపాటు లేనివారమై ఆశ్చర్యపడి, నశించిపోవుదుము. దురదృష్టవశాత్తు, ఇది లక్షలాది మందికి అనుభవమగును. యేసు ప్రభువు "అతి త్వరలో తిరిగి వచ్చుచున్నాడు. నీవు సిద్ధముగా ఉన్నావా?
15. యేసు ప్రభువు తన ప్రజల కొరకు తిరిగి వచ్చినప్పుడు నీవు సిద్ధముగా ఉండవలెనని ఆశపడుచున్నావా?
నీ జవాబు :
మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు
1. మహా శ్రమకాలము ఇంకను రావలసి యున్నది గదా?
జవాబు : సరిగ్గా యేసు ప్రభువు తన ప్రజలను విడిపించుటకు తిరిగి రాకముందు భయంకరమైన మహా శ్రమ భూమిని కబళించునన్న మాట వాస్తవము. దానియేలు దీనిని "ఎన్నటికిని కలుగనంత ఆపద" గా వర్ణించెను (దానియేలు 12:1). ఏదేమైనను, మత్తయి 24:20, 21 చీకటి యుగములలో లక్షలాది మంది దేవుని ప్రజలు చంపబడుటకు కారణమైన భయంకరమైన హింసాకాండను సూచించుచున్నది.
2. ప్రభువు "రాత్రివేళ దొంగ వచ్చునట్లు" వచ్చుచున్నాడు కాబట్టి, ఆయన రాకడ గురించి ఎవరైన ఏదైన ఎట్లు తెలిసికొనగలరు?
జవాబు : దీనికి సమాధానము 1 థెస్సలొనీకయులకు 5:2-4లో ఉన్నది : "రాత్రివేళ దొంగ ఎలాగు వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియు లేదని చెప్పుకొనుచుండగా, గర్భిణి స్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంతమాత్రమును తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగవలె మీమీదికి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు.” ఈ వాక్యము ప్రాముఖ్యముగా ప్రభువు రాకడ దినము యొక్క "ఆకస్మికత"ను గూర్చి నొక్కి చెప్పుచున్నది. సిద్ధపడని వారికి మాత్రమే ఇది దొంగ వచ్చినట్లుండును, సిద్ధపడి సహోదరులు అని పిలువబడే వారికి కాదు.
3. క్రీస్తు తన రాజ్యమును భూమిపై ఎప్పుడు స్థాపించును?
జవాబు : ప్రకటన 20వ అధ్యాయము యొక్క మహా 1,000 సంవత్సరముల కాలము తరువాత స్థాపించును. ఈ సహస్రాబ్ది (1,000 సంవత్సరముల కాలము) రెండవ రాకడ యందు, నీతిమంతులు బ్రతికినవారై ఆయనతో కూడ "వెయ్యి సంవత్సరములు" రాజ్యము చేయుటకు యేసు ప్రభువు వారిని భూమి నుండి పరలోకమునకు తీసికొని వెళ్లునప్పుడు ప్రారంభమగును (ప్రకటన 20:4). 1,000 సంవత్సరముల ముగింపులో, "నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము" (ప్రకటన 21:2) పరిశుద్ధులందరితో పరలోకము నుండి భూమికి దిగివచ్చును (జెకర్యా 14:1, 5) అప్పుడు అన్ని యుగములయందున్న దుర్మార్గులు జీవమునకు లేపబడుదురు (ప్రకటన 20:5). వారు ఆ పట్టణమును పట్టుకొనుటకు దానిని ముట్టడివేయుదురు (ప్రకటన 20:9), కాని పరలోకము నుండి అగ్ని దిగివచ్చి వారిని దహించివేయును. ఈ అగ్ని పాపపు ఆనవాళ్లన్నిటిని కాల్చివేసి భూమిని శుద్ధి చేయును (2 పేతురు 3:10; మలాకీ 4:3). అంతట దేవుడు క్రొత్త భూమిని సృష్టించును (2 పేతురు 3:13; యెషయా 65:17; ప్రకటన 21:1) దానిని నీతిమంతులకు అనుగ్రహించును, మరియు “దేవుడు తానే వారి దేవుడైయుండి వారికి తోడుగా ఉండును" (ప్రకటన 21:3). పరిపూర్ణమైన, పరిశుద్ధమైన, సంతోషకరమైన వ్యక్తులుగా, ప్రజలు దేవుని పరిపూర్ణమైన స్వరూపములోనికి మరొకసారి పునరుద్ధరించబడి, చివరికి దేవుడు మొట్టమొదటిగా ఉద్దేశించినట్లుగా పాపములేని, మచ్చలేని ప్రపంచములోని గృహము నందు జీవించుదురు. (దేవుని సుందరమైన కొత్త రాజ్యము గురించి మరింత సమాచారము కొరకు, 4వ స్టడీ గైడ్ పత్రికను చూడుము. 1,000 సంవత్సరముల గురించి మరింత తెలిసికొనుటకు, 12వ స్టడీ గైడ్ పత్రికను చూడుము.)
4. క్రీస్తు రెండవ రాకడ గురించి ఈనాడు మనము ఎందుకు ఎక్కువగా ప్రసంగించుట మరియు బోధించుట వినుట లేదు?
జవాబు : అపవాదియే దీనికి బాధ్యుడు. రెండవ రాకడ క్రైస్తవుని “శుభప్రదమైన నిరీక్షణ” (తీతుకు 2:12) అని అతనికి బాగుగా తెలియును, మరియు అది ఒక్కసారి అర్ధమైతే, అది స్త్రీ పురుషుల జీవితములను మార్చివేయును మరియు ఆ శుభవార్తను ఇతరులకు పంచుకొనుటలో వ్యక్తిగతముగా, చురుకైన పాత్ర పోషించుటకు దారితీయును. ఇది సాతానును రెచ్చగొట్టుచున్నది, కాబట్టి అతడు "పైకి భక్తిగల వారివలె" (2 తిమోతి 3:5) ఉన్నవారిని అపహాసించుటకు ప్రభావితము చేయును, వారు అపహాసించుచు వచ్చి, “ఆయన రాకడను గూర్చిన వాగ్దాన మేమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున నున్నట్టే నిలిచియున్నదే అని చెప్పుదురు” (2 పేతురు 3:3, 4). క్రీస్తు యొక్క రెండవ ఆగమనమును అక్షరాలా, త్వరలో జరుగబోవు సంఘటనగా తిరస్కరించేవారు లేదా చులకనగా చూచేవారు బైబిలు ప్రవచనమును నెరవేర్చుచున్నారు, మరియు అపవాదికి అపారమైన సేవ చేయుచున్నారు.
5. మత్తయి 24:40లో "ఒకడు తీసికొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును" అని ఆయన చెప్పినప్పుడు యేసు ప్రభువు రహస్య రాకడ గురించి మాట్లాడుట లేదా?
జవాబు : లేదు. సంఘటన రహస్యముగా ఉన్నట్లు సూచనలు లేవు. యేసు ప్రభువు నోవహు జలప్రళయమును, సొదొమ నాశనమును వివరించుచున్నాడు. (మత్తయి 24:37-42; లూకా 17:26 - 37 కూడ చూడుము.) దేవుడు నోవహు, లోతులను ఎట్లు విడిచిపెట్టి దుర్మార్గులను ఎట్లు నాశనము చేసెనో చెప్పెను. జలప్రళయము మరియు అగ్ని “వారినందరిని నాశనము చేసెను” (లూకా 17:27, 29) అని ఆయన ప్రత్యేకముగా చెప్పెను. స్పష్టముగా, ప్రతి సందర్భములో, కొందరు భద్రతకు తీసికొనబడిరి, మిగిలినవారు నాశనము చేయబడిరి. అంతట ఆయన, “ఆ ప్రకారమే మనుష్యకుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగును" అని చెప్పెను (లూకా 17:30). ఉదాహరణకు, యేసు ప్రభువు కొనసాగించి, "ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు ఒకడు తీసికొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును" అని చెప్పెను (మత్తయి 24:40). ఆయన రాకడ గురించి రహస్యమైనదేదియు లేదు. “ప్రతి నేత్రము ఆయనను చూచును” (ప్రకటన 1:7). తన రెండవ రాకడలో, క్రీస్తు ప్రత్యక్షముగా మరియు బహిరంగముగా నీతిమంతులను మేఘములలోనికి తీసికొని వెళ్లును (1 థెస్సలొనీకయులకు 4:16, 17), ఆయన పరిశుద్ధ సన్నిధి దుర్మార్గులను చంపును (యెషయా 11:4; 2 థెస్సలొనీకయులకు 2:8). అందుకే లూకా 17:37 దుర్మార్గుల పీనుగు శరీరములు (శవముల) గురించి మాట్లాడుచు వాటి చుట్టు గుమిగూడిన గద్దలు (లేదా రాబందులు) గురించి ప్రస్తావించినది. (ప్రకటన 19:17, 18 కూడ చూడుము.) క్రీస్తు రాకడలో విడిచిపెట్టబడిన దుర్మార్గులు చనిపోయి భూమ్మీదనే మిగిలిపోవుదురు. ("రహస్య రాకడ" సిద్ధాంతము గురించి మరింత తెలిసికొనుటకు, ఈ అంశముపై మా పుస్తకము కొరకు మమ్మల్ని సంప్రదించండి.)
సారాంశ పత్రము
ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు () పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.
1) తన రెండవ రాకడలో (1)
( ) క్రీస్తు రహస్యముగా వచ్చి భూమ్మీద నున్న కొన్ని పట్టణములను సందర్శించును.
( ) క్రీస్తు అరణ్యములో కనబడును.
( ) క్రీస్తు మేఘముల యందే నిలిచి, ఆకాశమండలములో ఆయనను ఎదుర్కొనుటకు నీతిమంతులను పిలుచును.
2) యేసు ప్రభువు ఈ భూమికి తిరిగి వచ్చినప్పుడు (1)
( ) నీతిమంతులు మాత్రమే ఆయనను చూచెదరు.
( ) ప్రతి నేత్రము ఆయనను చూచును.
( ) ఇది టీవీలో ప్రకటించబడేంత వరకు ప్రజలకు తెలియదు.
3) క్రీస్తు రెండవ రాకడలో నీతిమంతులకు ఏమగును? (2)
( ) నీతిమంతులుగా మృతులైనవారు లేపబడి, అమర్త్యతను ధరించుకొని, మేఘముల మీదికి ఎత్తబడి పరలోకమునకు కొనిపోబడుదురు.
( ) నీతిమంతులుగా బ్రతికియున్నవారు అమర్త్యతను ధరించుకొని, మేఘముల మీదికి ఎత్తబడి పరలోకమునకు కొనిపోబడుదురు.
( ) నీతిమంతులు భూమ్మీదనే ఉండి దుర్మార్గులను మార్చుదురు.
( ) నీతిమంతులు రహస్యముగా లాక్కొనిపోబడుదురు.
4) బైబిలు సూచనల ఆధారముగా, క్రీస్తు రాకడ (1)
( ) అతి త్వరలో వచ్చును!
( ) ఇప్పటి నుండి అనేక వందల సంవత్సరములలో వచ్చును.
( ) ఇప్పటికే వచ్చియున్నది.
5) యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు బ్రతికియున్న దుర్మార్గులు (1)
( ) నరకములో పడద్రోయబడుదురు, అక్కడ వారు యుగయుగములు కాలిపోవుదురు.
( ) ఆయన రెండవ రాకడలో చంపబడుదురు.
( ) తప్పించుకొని మరొక అవకాశము దక్కించుకొందురు.
6) క్రీస్తు రెండవ రాకడ గురించి సత్యము చెప్పే క్రింది ప్రకటనలను గుర్తించుము: (4)
( ) ఆయన రహస్యముగా వచ్చును.
( ) రెండవ రాకడ అనేది మారుమనస్సు అనుభవము.
( ) ఆయన మేఘముల మీద వచ్చును.
( ) క్రీస్తు మనము మన మరణపడక మీద ఉన్నప్పుడు మన కొరకు వచ్చును.
( ) దుర్మార్గులు ఆయనను చూడరు.
( ) దేవదూతలందరు ఆయనతో కూడ వచ్చెదరు.
( ) ఆయన నిజముగా భూమిని తాకడు.
( ) ఆయన రాకడను గూర్చిన దినమును మరియు గడియను తెలిసికొనుట సాధ్యమే.
( ) లక్షలాది మంది ఆశ్చర్యపడి నశించుదురు.
7) క్రీస్తు రెండవ రాకడలో (1)
( ) ప్రపంచమంతయు సిద్ధపడి ఎదురు చూచుచుండును.
( ) ప్రపంచవ్యాప్తముగా, వినాశనకరమైన భూకంపము సంభవించును.
( ) దుర్మార్గులు మారుమనస్సు నొందుదురు.
8) క్రింది ప్రకటనలలో భూమి యొక్క అంత్య దినములకు సంబంధించిన సత్యమైన సూచనలనన్నిటిని గుర్తించుము : (7)
( ) ప్రపంచము రోజురోజుకు మెరుగుపడును.
( ) పెట్టుబడిదారులు మరియు కార్మికుల మధ్య కలహములు.
( ) కొన్ని చిన్న చిన్న భూకంపములు, తుఫానులు మొదలైనవి సంభవించును.
( ) బైబిలు సత్యము నుండి వైదొలగిపోవుట.
( ) సుఖానుభవము కొరకు పిచ్చి వ్యామోహము.
( ) నైతిక క్షీణత.
( ) నేరాల ఘోరాల సంఖ్యలో గొప్ప తగ్గుదల.
( ) గొప్ప కరువులు సంభవించును.
( ) జ్ఞానము అధికమగును.
( ) అశాంతి మరియు తిరుగుబాటు.
9) ఆకాశములో జరిగిన ఏ సూచనలు క్రీస్తు రాకడకు సూచనలుగా ఉన్నవి ? (2)
( ) హాలీ తోకచుక్క
( ) మే 1780 నాటి చీకటి దినము.
( ) నవంబర్ 1833లో రాలిన నక్షత్రములు (ఉల్కలు).
( ) చంద్రుడు భూమిపై పడుట.
10) యేసు ప్రభువు అతి త్వరలో భూమికి తిరిగి వచ్చుచున్నాడని మనకెట్లు తెలియును? (1)
( ) బైబిలు అంత్య దినములకు సంబంధించిన సూచనలు మరియు ప్రత్యేక సమాచారములు ఇచ్చుచున్నది.
( ) ఎందుకనగా యేసు ప్రభువు త్వరలో వచ్చుచున్నాడని చాలా మంది నమ్ముచున్నారు.
( ) కొందరు జ్యోతిష్కులు దీనిని అంచనా వేయుచున్నారు.
11) క్రీస్తు రాకడ యొక్క విధము మరియు సమయమునకు సంబంధించి లక్షలాది మంది మోసపోవుదురు ఎందుకనగా (1)
( ) అందరు రక్షింపబడుట దేవునికి ఇష్టము లేదు.
( ) వారు పెద్ద మొత్తములో చందాలు ఇవ్వరు.
( ) ఈ విషయమును గూర్చిన సత్యమును తెలిసికొనుటకు వారు తమ బైబిళ్లను తమ కొరకు తాము అధ్యయనము చేయరు.
12) క్రీస్తు రాకడ కొరకు నేను సిద్ధపడి యుండగలిగేది (1)
( ) యేసు ప్రభువు నా యందు జీవించుట ద్వారా.
( ) నేను రోజూ వార్తాపత్రిక చదువుట ద్వారా.
( ) మా పాస్టరు గారు చెప్పింది నేను చేయుట ద్వారా.
13) యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు నేను సిద్ధముగా ఉండవలెనని ఆశపడుచున్నాను.
( ) అవును.
( ) లేదు.