Lesson 6

నేరములు మరియు హింస మన నగరములను, గృహములను పీడించుచుండగా, శాంతి భద్రతల కొరకు మనము ప్రభుత్వ నియమ నిబంధనలను పాటించాలని మనకర్ధమగుట లేదా? బాగా, అనేక శతాబ్దముల క్రితము, దేవుడు తన సొంత ధర్మశాస్త్రమును రాతి పలకల మీద వ్రాసెను - దానిని మనము నేటికిని ఆచరింప బద్దులమైయున్నామని బైబిలు చెప్పుచున్నది! దేవుని ధర్మశాస్త్రములో దేనినైనను మీరుట చేదు పరిణామములను మిగుల్చును. ఇది ముమ్మాటికి నిజము. కాని అంతకంటే ముఖ్యముగా, దేవుని ధర్మశాస్త్రమంతటిని గైకొనుట మన శాంతి భద్రతలను సురక్షితము చేయును. మిక్కిలి ప్రమాదము పొంచియున్నందున, నీ జీవితములో దేవుని పది ఆజ్ఞలకు ఉన్న స్థానమును తీవ్రముగా పరిగణించుటకు కొన్ని నిమిషములు కేటాయించుట నీ సమయమునకు విలువను చేకూర్చే విషయము కాదా?

1. పది ఆజ్ఞలను నిజముగా దేవుడే స్వయముగా వ్రాసెనా?

"ఆయన తన శాసనములు గల రెండు పలకలను, అనగా దేవుని వ్రేలితో వ్రాయబడిన రాతి పలకలను అతని కిచ్చెను." ... “ఆ పలకలు దేవుడు చేసినవి; ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత” (నిర్గమకాండము 31:18, 32:16).

జవాబు : అవును! పరలోకమందున్న మహోన్నతుడగు దేవుడే తన సొంత వ్రేలితో పది ఆజ్ఞలను రాతి పలకల మీద వ్రాసెన.

2. పాపమునకు దేవుడిచ్చు నిర్వచనమేమిటి?

"ఆజ్ఞాతిక్రమమే పాపము" (1 యోహాను 3:4).

జవాబు: దేవుని పది ఆజ్ఞల ధర్మశాస్త్రమును అతిక్రమించుటయే పాపము. దేవుని ధర్మశాస్త్రము యథార్ధమైనది (కీర్తనలు 19:7), గనుక, దాని సూత్రములు ప్రతి ఊహాజనితమైన పాపమును ఖండించును. దేవుని పది ఆజ్ఞలలో కనీసము ఒక ఆజ్ఞ చేతనైనను ఖండించబడకుండ పాపము చేయుట అసంభవము. పది ఆజ్ఞలు సమస్త మానవాళి యొక్క సర్వ విధులను గూర్చి వివరించుచున్నవి (ప్రసంగి 12:13). ఏదియు విడిచిపెట్టబడలేదు.

3. పది ఆజ్ఞలను దేవుడు మనకు ఎందుకిచ్చెను?

"ధర్మశాస్త్రము ననుసరించువాడు ధన్యుడు" (సామెతలు 29:18). “నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును" (సామెతలు 3:1, 2).

జవాబు :

A:సంతోషకరమైన, సమృద్ధి జీవితమును జీవించుటకు మార్గదర్శిగా ఉండుటకు ధర్మశాస్త్రమును దేవుడు మనకిచ్చెను. ఆనందము, శాంతి, దీర్ఘాయువు, సంతృప్తి, సాఫల్యము మరియు మన హృదయములు దీర్ఘకాలము ఆశించే అన్ని గొప్ప ఆశీర్వాదములను అనుభవించుటకు దేవుడు మనలను సృష్టించెను. దేవుని ధర్మశాస్త్రము ఈ నిజమైన, అత్యున్నత ఆనందమును కనుగొనుటకు అనుసరించవలసిన సరైన మార్గములను సూచించే రహదారి పటమునైయున్నది.

B:

మంచి మరియు చెడుల మధ్య వ్యత్యాసమును మనకు చూపించుటకు ధర్మశాస్త్రము మనకియ్యబడెను. దేవుని ధర్మశాస్త్రము అద్దము వంటిది (యాకోబు 1:23-25). అద్దము మన ముఖాల్లోని మురికిని చూపునట్లుగా అది మన జీవితములో చేసిన తప్పులను ఎత్తి చూపించును. మనము పాపము చేయుచున్నామని తెలిసికొనుటకు గల ఏకైక మార్గము ఏదనగా దేవుని ధర్మశాస్త్రము యొక్క అద్దములో మన జీవితములను జాగ్రత్తగా పరిశీలించుకొనుటయే. దిగజారిపోయిన ప్రపంచమునకు శాంతి దేవుని పది ఆజ్ఞలలో కనుగొనవచ్చును. జీవిత హద్దులను మరియు విధి విధానములను అది మనకు నేర్పును!

"మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా, ... యీ కట్టడలనన్నిటిని గైకొనవలెనని మన కాజ్ఞాపించెను" (ద్వితీయోపదేశకాండము 6:24). “నాకు రక్షణ కలుగునట్లు నీవు నన్ను ఉద్దరింపుము, అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసెదను. నీ కట్టడలను మీరిన వారినందరిని నీవు నిరాకరించుదువు” (కీర్తనలు 119:117, 118).

C:
ప్రమాదము మరియు విషాదము నుండి మనలను రక్షించుటకు ధర్మశాస్త్రము ఇయ్యబడెను. దేవుని ధర్మశాస్త్రము జంతుప్రదర్శనశాలలో బలమైన పంజరము (బోను) వంటిది, అది భయంకరమైన, క్రూరమైన జంతువుల నుండి మనలను రక్షించును. అది అబద్ధము, హత్య, విగ్రహారాధన, దొంగతనము మరియు జీవితమును, శాంతిని మరియు ఆనందమును నాశనము చేయు అనేక చెడుల నుండి మనలను రక్షించును. అన్ని మంచి చట్టాలు సంరక్షించును మరియు దేవుని చట్టము దీనికి మినహాయింపు కాదు (అనగా దేవుని ధర్మశాస్త్రము మనలను అత్యున్నతముగా సంరక్షించును).

"మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీని వలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము" (1 యోహాను 2:3).

 D:

దేవుని నెరుగుటకు (తెలిసికొనుటకు) ధర్మశాస్త్రము మనకు సహాయపడును.

ముఖ్య గమనిక : దేవుని ధర్మశాస్త్రములోని నిత్య సూత్రములు ప్రతి వ్యక్తి యొక్క స్వభావములో మనలను సృష్టించిన దేవుడు లోతుగా వ్రాసెను. వ్రాత మసకబారినట్లున్నను మరియు మచ్చలతో కూడుకొన్నదైనట్లుగా అగుపడినను, అది ఇంకను నిలిచేయున్నది. వాటికి అనుగుణముగా జీవించుటకు మనము సృష్టించబడితిమి. మనము వాటిని విస్మరించినప్పుడు, రోడ్డు భద్రతా సూత్రములను పాటించకుండ వాహనమును నడుపుట ద్వారా కలుగు తీవ్రమైన గాయము లేదా మరణము వలె ఫలితము ఎల్లప్పుడు ఉద్రిక్తత, అశాంతి మరియు విషాదమగును.

4. Why is God’s law exceedingly important to you personally?

4. దేవుని ధర్మశాస్త్రము వ్యక్తిగతముగా నీకు ఎందుకంత ప్రాముఖ్యమైనది?

“స్వాతంత్ర్యము ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబోవువారికి తగినట్టుగా మాటలాడుడి; ఆలాగుననే ప్రవర్తించుడి” (యాకోబు 2:12).

జవాబు : ఎందుకనగా, పది ఆజ్ఞల ధర్మశాస్త్రమనే గీటురాయి (లేక, ప్రమాణము) చేతనే దేవుడు పరలోక తీర్పులో ప్రజలను పరిశీలించి న్యాయము తీర్చును.

5. దేవుని పది ఆజ్ఞల ధర్మశాస్త్రము ఎప్పుడైన రద్దుపర్చబడగలదా?

“ధర్మశాస్త్రములో ఒక పొల్లయిన తప్పిపోవుట కంటె ఆకాశమును భూమియు గతించిపోవుట సులభము” (లూకా 16:17). “నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవులగుండ బయలువెళ్లిన మాటను మార్చను” (కీర్తనలు 89:34). "ఆయన శాసనములన్నియు నమ్మకమైనవి. అవి శాశ్వతముగా స్థాపింపబడియున్నవి" (కీర్తనలు 111:7, 8).

జవాబు : దేవుని ధర్మశాస్త్రమును మార్పులేనిదని బైబిలు చాలా స్పష్టముగా చెప్పుచున్నది. ఆజ్ఞలు దేవుని పరిశుద్ధ స్వభావమును వెల్లడించు సూత్రములు మరియు అవి ఆయన రాజ్యమునకు స్థిరమైన పునాదియైయున్నవి. దేవుడు ఉన్నంత కాలము అవి సత్యమైనవిగా నిలిచియుండును.

ఈ పట్టిక దేవునికి మరియు ఆయన ధర్మశాస్త్రమునకు ఖచ్చితముగా ఒకే స్వభావములున్నవని, పది ఆజ్ఞల ధర్మశాస్తము వాస్తవానికి వ్రాతపూర్వక రూపములో ఉన్న దేవుని స్వభావమని వెల్లడించుచు మనకు చూపించుచున్నది - తద్వారా మనము దేవునిని బాగా అర్థము చేసికొనగలము. దేవునిని పరలోకము నుండి బయటకు లాగి, ఆయనను స్వభావమును మార్చుట ఎంత అసాధ్యమో ఆయన ధర్మశాస్త్రమును మార్చుట కూడ అంతే అసాధ్యము. మానవ రూపములో వ్యక్తీకరించబడినప్పుడు ధర్మశాస్త్రము (అనగా పరిశుద్ధ జీవనమునకు పరిపూర్ణ మాదిరి) ఎట్లుండునో యేసు ప్రభువు మనకు చూపించెను. దేవుని స్వభావము మార్పులేనిది, అలాగే ఆయన ధర్మశాస్త్రము కూడ మార్పులేనిది.

స్వబావము దేవుని స్వభావము ధర్మశాస్త్ర స్వభావము
సద్గుణము సత్పురుషుడు (లూకా 18:19) మేలైనది (1 తిమోతి 1:8,11)
పరిశుద్ధత పరిశుద్ధుడు (యెషయా 5:16) పరిశుద్ధమైనది (రోమీయులకు 7:12)
పరిపూర్ణత పరిపూర్ణుడు (మత్తయి 5:48) యధార్ధమైనది (కీర్తనలు 19:7)
పవిత్రత పవిత్రుడు (1 యోహాను 3:2, 3) నిర్మలమైనది (కీర్తనలు 19:8)
నీతి గుణము నీతిపరుడు (ద్వితీయోపదేశకాండము 32:4) నీతిగలది (రోమీయులకు 7:12)
సత్య గుణము సత్యవంతుడు (యోహాను 3:33) సత్యమైనది (కీర్తనలు 19:9)
ఆత్మీయత ఆత్మ సంబంధమైన బండ

(1 కొరింథీయులకు 10:4)

ఆత్మ సంబంధమైనది

(రోమీయులకు 7:14)

నీతి గుణము నీతిమంతుడు (యిర్మియా 23:6) నీతిగలది (కీర్తనలు 119:172)
నమకత్వము నమ్మతగినవాడు (1 కొరింథీయులకు 1:9) నమ్మదగినది (కీర్తనలు 119:86)
ప్రేమ గుణము ప్రేమస్వరుపి (1 యోహాను 4:8) ప్రేమ సంబంధమైనది (రోమీయులకు 13:10)
మార్పులేని గుణము మర్పులేనివాడు (మలకీ 3:6) మార్పులేనిది (మత్తయి 5:18)
నిత్యత్వము నిత్యుడు (ఆదికాండము 21:33) శాశ్వతమైనది (కీర్తనలు 111:7, 8)

6. యేసు ప్రభువు ఈ భూమ్మీద ఉన్నప్పుడు దేవుని ధర్మశాస్త్రమును కొట్టివేసెనా?

యేసు ప్రభువు, "ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయిననే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి యొక పొల్లయినను ఒక సున్నయైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను" అనెను (మత్తయి 5:17, 18).

Answer

జవాబు : ఖచ్చితముగా కొట్టివేయలేదు! నిజానికి, ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే (లేక గైకొనుటకే) గాని కొట్టివేయుటకు ఆయన రాలేదని యేసు ప్రభువు నిర్దిష్టముగా చెప్పెను. దానిని కొట్టివేయుటకు బదులుగా, అది సరియైన జీవన విధానమునకు పరిపూర్ణ మార్గదర్శియని యేసు ప్రభువు ధర్మశాస్త్రమును ఘనపరచెను (యెషయా 42:21). ఉదాహరణకు, "నరహత్య చేయకూడదు” అనే ఆజ్ఞ "నిర్నిమిత్తముగా" (కారణము లేకుండ) (మత్తయి 5:21, 22) కోపపడుటను మరియు ద్వేషించుటను (1 యోహాను 3:15) ఖండించుచున్నదనియు, మరియు మోహపు చూపు వ్యభిచారముతో సమానమనియు (మత్తయి 5:27, 28) యేసు ప్రభువు నొక్కి చెప్పెను. "మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు" అని ఆయన చెప్పెను (యోహాను 14:15).

7. బుద్ధిపూర్వకముగా దేవుని ఆజ్ఞలను స్థిరముగా మీరుచు జీవించు ప్రజలు రక్షింపబడుదురా?

"పాపము వలన వచ్చు జీతము మరణము" (రోమీయులకు 6:23). "పాపులను బొత్తిగా దానిలో నుండకుండ నశింపజేయుటకును" (యెషయా 13:9). "ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు, ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన యెడల, ఆజ్ఞలన్నిటి విషయములో అపరాధియగును" (యాకోబు 2:10).

జవాబు : పది ఆజ్ఞల ధర్మశాస్త్రము మనలను పరిశుద్ధ జీవనమునకు మార్గనిర్దేశము చేయును. మనము ఒక ఆజ్ఞనైనను విస్మరించిన యెడల, సాక్ష్యాత్తు దైవ నమూనా యొక్క ప్రాముఖ్యమైన భాగమును మనము విస్మరించిన వారమగుదుము. గొలుసు యొక్క ఒక్క ఉంగరము (కొక్కీ) మాత్రమే విరిగిపోయిన యెడల, దాని ప్రయోజనమంతయు వ్యర్థమగును. మనము బుద్ధిపూర్వకముగా దేవుని ఆజ్ఞను మీరినప్పుడు, మనము పాపము చేయుచున్నాము (యాకోబు 1:17). ఎందుకనగా మన కొరకైన ఆయన చిత్తమును మనము తిరస్కరించి యున్నాము. ఆయన చిత్తమును చేయువారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశింపగలరు. వాస్తవానికి, నిజాయితీగా పశ్చాత్తాపపడి, మారుమనస్సు నొందుటకు క్రీస్తు శక్తిని అంగీకరించు వారెవరైనను దేవుడు వారిని క్షమించును.

8. కేవలము ధర్మశాస్త్రమును ఆచరించుట (కాపాడుట) ద్వారా ఎవరైన రక్షింపబడగలరా?

"ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడదు" (రోమీయులకు 3:20). "మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడియున్నారు; ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలులేదు" (ఎఫెసీయులకు 2:8, 9).

జవాబు : లేదు! జవాబును అపార్థము చేసికొనే ప్రసక్తే లేదు, అది అంత స్పష్టమైనది. ధర్మశాస్త్రమును ఆచరించుట ద్వారా ఎవరును రక్షింపబడలేరు. రక్షణ యేసుక్రీస్తు యొక్క ఉచిత బహుమానముగా కృప ద్వారా మాత్రమే వచ్చును, మరియు ఈ బహుమానమును విశ్వాసము ద్వారా మనము స్వీకరించుదుము, మన క్రియల ద్వారా కాదు. ధర్మశాస్త్రము మన జీవితములోని పాపమును ఎత్తి చూపే అద్దమువలె పనిచేయును. ఒక అద్దము మీ ముఖము మీద మురికిని చూపించగలదు కానీ మీ ముఖమును శుభ్రపరచలేదు, కాబట్టి పాపము నుండి ప్రక్షాళన (పవిత్రత) మరియు క్షమాపణ క్రీస్తు ద్వారా మాత్రమే వచ్చును.

9. అలాగైతే, క్రైస్తవ స్వభావము వృద్ధి చెందుటకు ధర్మశాస్త్రము ఖచ్చితముగా ఎందుకు అవసరమైయున్నది?

"దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి ఇదియే విధి" (ప్రసంగి 12:13). "ధర్మశాస్త్రము వలన పాపమనగా ఎట్టిదో తెలియబడుచున్నది" (రోమీయులకు 3:20).

జవాబు : ఎందుకనగా క్రైస్తవ జీవనమునకు పరిపూర్ణ నమూనా లేదా "సంపూర్ణ విధి" దేవుని ధర్మశాస్త్రములో ఉన్నది. తన సొంత కొలమానమును తయారు చేసికొని, తనను తాను కొలుచుకొని, తన తల్లికి తాను 12 అడుగులు ఎత్తు ఉన్నానని తప్పుగా చెప్పిన ఆరేళ్ల పిల్లవాడి వలె మన సొంత కొలత ప్రమాణములు ఎన్నటికిని సురక్షితము కాదు. పరిపూర్ణమైన ఆచరింపబద్ధమైన దేవుని ధర్మశాస్త్రమును జాగ్రత్తగా పరిశీలించకపోయిన యెడల మనము పాపులమని మనకు తెలియదు. ధర్మశాస్త్రమును గైకొనకుండ విస్మరించినను పుణ్యకార్యములు చేయుట ద్వారా తమకు రక్షణ చేకూరునని అనేకమంది భావించుచున్నారు (మత్తయి 7:21-23). అలాగున, వారు నిజానికి పాపులుగా నశించిపోయినను తాము నీతిమంతులుగా రక్షింపబడితిమని వారు భావించెదరు. “మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీని వలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము” (1 యోహాను 2:3).

10. దేవుని ధర్మశాస్త్రము యొక్క మాదిరి ననుసరించుటకు నిజముగా మారుమనస్సు నొందిన క్రైస్తవులను బలపరచున దెవరు?

"వారి మనస్సులో నా ధర్మవిధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును" (హెబ్రీయులకు 8:10). "నన్ను బలపరచు వానియందే (క్రీస్తునందే) నేను సమస్తమును చేయగలను" (ఫిలిప్పీయులకు 4:13). "మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెనని ... దేవుడు తన సొంతం కుమారుని ... పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను" (రోమీయులకు 8:3, 4).

జవాబు : క్రీస్తు పశ్చాత్తాపపడు పాపులను క్షమించడమే కాక, వారిలో దేవుని స్వరూపమును పునరుద్ధరించును. ఆయన తన నివాససన్నిధి యొక్క శక్తి ద్వారా వారిని తన ధర్మశాస్త్రముతో సామరస్యపరచును. "నీవు చేయకూడదు" అనునది నిజమైన క్రైస్తవులకు ఒక సానుకూల వాగ్దానముగా మారును గనుక వారిక దొంగిలించరు, అబద్ధమాడరు, మరియు నరహత్య మొదలగువాటిని చేయరు, ఎందుకనగా యేసు మనయందు నివసించుచు పాపములో పడకుండ మనలను ఆయన ఆధీనములో ఉంచుకొనుచున్నాడు. దేవుడు తన నీతి ధర్మశాస్త్రమును మార్చడు, కాని పాపిని మార్చుటకు యేసు ద్వారా ఆయన ఒక నిబంధన చేసెను, తద్వారా మనము కొలవబడినప్పుడు ఆ ధర్మశాస్త్రమునకు సరితూగగలము.

11. అయితే విశ్వాసము ద్వారా కృప క్రింద జీవించుచున్న క్రైస్తవుడు ధర్మశాస్త్రమును గైకొనకుండ ఉండుటకు స్వతంత్రుడు కాడా?

"మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము (అనగా దేవుని ధర్మశాస్త్రము యొక్క అతిక్రమణ) - (1 యోహాను 3:4), మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయిన యెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము ( అనగా దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమణ) చేయుదమా? అదెన్నటికిని కూడదు" (రోమీయులకు 6:14, 15). "విశ్వాసము ద్వారా ధర్మశాస్త్రమును నిరర్ధకము చేయుచున్నామా? అట్లనరాదు; ధర్మశాస్త్రమును స్థిరపరచుచున్నాము" (రోమీయులకు 3:31).

జవాబు : లేదు! లేఖనములు సరిగ్గా దీనికి వ్యతిరేకమైన దానిని బోధించుచున్నవి. కృప ఒక ఖైదీకి రాష్ట్రపతి దయచేయు క్షమాపణ వంటిది. అది అతనిని క్షమించునే గాని మరొక చట్టమును అతిక్రమించే స్వేచ్ఛ నియ్యదు. క్షమించబడిన వ్యక్తి, కృప క్రింద జీవించుచు, నిజానికి దేవుని ధర్మశాస్త్రమును రక్షణకు కృతజ్ఞతగా గైకొనాలని కోరుకొనును. కృప క్రింద జీవించుచున్నానని చెప్పి, దేవుని ధర్మశాస్త్రమును గైకొనుటకు నిరాకరించిన వ్యక్తి పూర్తిగా తప్పుడు మార్గములో ఉన్నాడు.

12. దేవుని పది ఆజ్ఞలు క్రొత్త నిబంధనలో కూడ రూఢిపర్చబడినవా?

జవాబు: అవును, చాలా స్పష్టముగా రూఢిపర్చబడినవి. క్రింద ఇయ్యబడిన బైబిలు వాక్యములను చాలా జాగ్రత్తగా గమనించుము.

క్రొత్త నిబంధనలో దేవుని ధర్మశాస్త్రము ( పది ఆజ్ఞలు)

  1. "ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను" (మత్తయి 4:10).
  2. "చిన్న పిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి" (1 యోహాను 5:21). “కాబట్టి మనము దేవుని సంతానమైయుండి, మనుష్యుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను, దేవత్వము పోలియున్నదని తలంపకూడదు” (అపొస్తలుల కార్యములు 17:29).
  3. "దేవుని నామమును ఆయన బోధయు దూషింపబడకుండునట్లు" (1 తిమోతి 6:1).
  4. “మరియు - దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటిని ముగించి విశ్రమించెను అని యేడవ దినమును గూర్చి ఆయన యొక చోట చెప్పియున్నాడు.” “కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి ("విశ్రాంతిదిన ఆచరణ") నిలిచియున్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించినవాడు కూడ తన కార్యములను ముగించి విశ్రమించును” (హెబ్రీయులకు 4:4, 9, 10)
  5. "తలిదండ్రులను సన్మానింపుము" (మత్తయి 19:18).
  6. "నరహత్య చేయవద్దు" (రోమీయులకు 13:9).
  7. "వ్యభిచరింపవద్దు" (మత్తయి 19:18).
  8. "దొంగిలవద్దు" (రోమీయులకు 13:9).
  9. “అబద్దసాక్ష్యము పలుకవద్దు” (మత్తయి 19:18).
  10. "ఆశింపవద్దు" (రోమీయులకు 7:7; 13:9).

పాత నిబంధనలో దేవుని ధర్మశాస్త్రము (పది ఆజ్ఞలు)

  1. "నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు" (నిర్గమకాండము 20:3).
  2. పైన ఆకాశమందే గాని క్రింది భూమియందే గాని భూమి క్రింద నీళ్లయందే గాని యుండు దేని రూపమునయినను, విగ్రహమునయినను నీవు చేసికొనకూడదు; వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడనైన యెహోవానగు నేను రోషము గల దేవుడను; నన్ను ద్వేషించువారి విషయములో మూడు నాలుగు తరముల వరకు, తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనువారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనై యున్నాను" (నిర్గమకాండము 20:4-6).
  3. "నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు; యెహోవా తన నామమును వ్యర్ధముగా నుచ్చరించువానిని నిర్దోషిగా ఎంచడు" (నిర్గమకాండము 20:7).
  4. "విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెయైనను, నీ దాసుడైనను, నీ దాసియైనను, నీ పశువైనను, నీ యిండ్లలో నున్న పరదేశియైనను, ఏ పనియు చేయకూడదు. ఆరు దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను" (నిర్గమకాండము 20:8-11).
  5. “నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము" (నిర్గమకాండము 20:12).
  6. "నరహత్య చేయకూడదు" (నిర్గమకాండము 20:13).
  7. "వ్యభిచరింపకూడదు" (నిర్గమకాండము 20:14).
  8. “దొంగిలకూడదు” (నిర్గమకాండము 20:15).
  9. "నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు" (నిర్గమకాండము 20:16)
  10. "నీ పొరుగు వాని యిల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని యెద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు" (నిర్గమకాండము 20:17).

13. Are God’s law and Moses’ law the same?

13. దేవుని ధర్మశాస్త్రము మరియు మోషే ధర్మశాస్త్రము ఒకటేనా?

జవాబు : లేదు- అవి ఒకేలా ఉండవు, ఒకటి కావు. క్రింది వైరుధ్యములను అధ్యయనము చేయుము : మోషే ధర్మశాస్త్రములో పాత నిబంధన యొక్క తాత్కాలిక, ఆచార ధర్మశాస్త్రము ఉన్నది. ఇది యాజకత్వము, బలులు, ఆచారములు, నైవేద్యము మరియు పానీయార్పణములు మొదలైనవాటిని నియంత్రించెను, ఇవన్నియు సిలువకు ఛాయారూపకముగా సూచనప్రాయముగా ఇయ్యబడెను. "వాగ్దానము చేయబడిన సంతానము వచ్చువరకు" ఈ ధర్మశాస్త్రము ఆచరింపబద్ధమై యుండెను," "ఆ సంతానము క్రీస్తు" (గలతీయులకు 3:16, 19). మోషే ధర్మశాస్త్రము యొక్క ఆచారము మరియు విధిరూపక బలులు రానైయున్న క్రీస్తు బలికి సూచింపబడెను. ఆయన సిలువ మరణముతోఈ ధర్మశాస్త్రము కొట్టి వేయబడెను. కాని, దేవుని ధర్మశాస్త్రము "శాశ్వతముగా స్థాపింపబడియున్నది" (కీర్తనలు 111:8). రెండు వేర్వేరు ధర్మశాస్త్రములు కలవని దానియేలు 9:10, 11లో స్పష్టము చేయబడినది.

ముఖ్య గమనిక : పాపము ఉన్నంత వరకు దేవుని ధర్మశాస్త్రము ఉనికిలో ఉన్నది. ఎందుకనగా, "ధర్మశాస్త్రము లేని యెడల అతిక్రమమును (పాపమును) లేకపోవును" (రోమీయులకు 4:15) అని బైబిలు సెలవిచ్చుచున్నది. కాబట్టి పది ఆజ్ఞల ధర్మశాస్త్రము ఆది నుండే ఉనికిలో ఉన్నది. ప్రజలు ఆ ధర్మశాస్త్రమును అతిక్రమించిరి. (పాపము చేసిరి - 1 యోహాను 3:4). పాపము కారణముగా (లేదా దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమించుట ద్వారా), క్రీస్తు వచ్చి చనిపోయే వరకు మోషే ధర్మశాస్త్రము కలపబడెను (లేక "ఇయ్యబడెను" - గలతీయులకు 3:16, 19). రెండు వేర్వేరు ధర్మశాస్త్రములు కలవు : దేవుని ధర్మశాస్త్రము మరియు మోషే ధర్మశాస్త్రము.

మోషే ధర్మశాస్త్రము దేవుని ధర్మశాస్త్రము
"మోషే ధర్మశాస్త్రము" అని పిలువబడినది

(లూకా 2:22).

"యెహోవా ధర్మశాస్త్రము" అని పిలువబడినది (యెషయా 5:24).
"విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము" అని పిలువబడినది (ఎఫెసీయులకు 2:14). "ప్రాముఖ్యమైన ఆజ్ఞ" అని పిలువబడినది

(యాకోబు 2:8).

ఒక గ్రంథములో మోషే చేత వ్రాయబడెను

(2 దినవృత్తాంతములు 35:12).

రాతి మీద దేవుని చేత వ్రాయబడెను

(నిర్గమకాండము 31:18; 32:16).

నిబంధన మందసము ప్రక్కన ఉంచబడెను (ద్వితీయోపదేశకాండము 31:25, 26) నిబంధన మందసములో ఉంచబడెను

(నిర్గమకాండము 40:20).

సిలువలో కొట్టివేయబడెను

(ఎఫెసీయులకు 2:14, 15).

శాశ్వతముగా నిలుచును

(లూకా 16:17).

అతిక్రమమును (పాపమును) బట్టి ఇయ్యబడెను

(గలతీయులకు 3:19).

పాపమును ఎత్తి చూపించును

(రోమీయులకు 7:7; 3:20).

మన మీద ఋణముగాను విరోధముగాను ఉండెను (కొలొస్సయులకు 2:14). మనకు భారమైనది కాదు

(1 యోహాను 5:3).

ఎవరికిని తీర్పు తీర్చదు

(కొలొస్సయులకు 2:14-16).

ప్రజలందరికి తీర్పు తీర్చును

(యాకోబు 2:10-12).

శరీరానుసారమైనది

(హెబ్రీయులకు 7:15).

ఆత్మ సంబంధమైనది

(రోమీయులకు 7:14).

సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు

(హెబ్రీయులకు 7:18, 19).

సంపూర్ణమును మరియు యథార్ధమైనది

(కీర్తనలు 19:7).

 

14. దేవుని పది ఆజ్ఞల చొప్పున తమ జీవితములను క్రమపర్చుకొని సక్రమముగా జీవించు ప్రజలను గూర్చి అపవాది ఏ విధమైన భావనను కలిగియున్నాడు?

"అందుచేత ఆ ఘటసర్పము (అపవాది) ఆగ్రహము తెచ్చుకొని, దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె (సత్యమైన సంఘము) సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్రతీరమున నిలిచెను" (ప్రకటన 12:17). "దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన (యేసుక్రీస్తునకు కలిగిన) విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు (పట్టు విడువని విశ్వాసము) ఇందులో కనబడును" (ప్రకటన 14:12).

జవాబు : దేవుని ధర్మశాస్త్రమును సమర్థించువారిని అపవాది ద్వేషించును ఎందుకనగా ధర్మశాస్త్రము సరైన జీవన విధానమునకు మాదిరి, కాబట్టి దేవుని ధర్మశాస్త్రమును సమర్థించు వారినందరిని అతడు తీవ్రముగా వ్యతిరేకించుటలో ఆశ్చర్యము లేదు. దేవుని పరిశుద్ధ ప్రమాణమునకు వ్యతిరేకముగా చేయు యుద్ధములో, అతడు పది ఆజ్ఞలను తిరస్కరించుటకు మత నాయకులను ఉపయోగించుకునేంత వరకు వెళ్లును, అదే సమయములో అతడు మానవ సంప్రదాయములను (పారంపర్యాచారములను) సమర్థించును. యేసు ప్రభువు, "మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?" "మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు" అని చెప్పుటలో ఆశ్చర్యము లేదు (మత్తయి 15:3, 9). దావీదు ఇట్లనెను, “జనులు నీ ధర్మశాస్త్రమును నిరర్ధకము చేసియున్నారు. యెహోవా తన క్రియ జరిగించుటకు ఇదే సమయము” (కీర్తనలు 119:126). క్రైస్తవులు ఇప్పటికైన మేల్కొని వారి హృదయాల్లో మరియు జీవితములలో దేవుని ధర్మశాస్త్రమును దాని సరైన స్థానమునకు పునరుద్ధరించవలెను. శిక్షింపబడుదుమన్న భయము లేకుండ నేటి ఈ దుష్టతరము ప్రజలు యిష్టానుసారముగా జీవించుచు జీవముగల దేవుని ఆజ్ఞలను రద్దు పరచగలమనుకొనుట వారి మూర్ఖత్వమే.

15. క్రైస్తవుడు దేవుని పది ఆజ్ఞలకు విధేయత చూపుట అత్యవసరమని నీవు నమ్ముచున్నావా?

నీ జవాబు :

మీరు ఆలోచించే ప్రశ్నలకు జవాబులు

1. ధర్మశాస్త్రము ఆక్షేపించబడినదని బైబిలు చెప్పుట లేదా?

జవాబు : లేదు. దేవుడు వారిలో అక్రమమును కనుగొనెను గనుక ప్రజలే ఆక్షేపించబడి యున్నారని బైబిలు చెప్పుచున్నది. (హెబ్రీయులకు 8:8). శరీరము ననుసరించి నడుచుకొనుట చేత ధర్మశాస్త్రము బలహీనమైనట్టుగా కనబడెనని రోమీయులకు 8:3 చెప్పుచున్నది. ఇదే ఎల్లప్పుడు జరుగుచున్నది. “శరీరానుసారమైన మనస్సు ... దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు" (రోమీయులకు 8:7). ధర్మశాస్త్రము యథార్థమైనది, కాని ప్రజలే అపరాధులుగా బలహీనులై యున్నారు. క్రీస్తు ప్రజల హృదయాల్లో నివసించుట ద్వారా "మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతివిధి నెరవేర్చబడవలెని” దేవుడు తన కుమారుని పంపెను (రోమీయులకు 8:3, 4).

2. మనము ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచింపబడితిమని గలతీయులకు 3:13 చెప్పుచున్నది. దీని అర్థమేమిటి?

జవాబు : ధర్మశాస్త్రము యొక్క శాపము మరణము (రోమీయులకు 6:23). క్రీస్తు "ప్రతి మనుష్యుని కొరకు మరణము" ననుభవించెను (హెబ్రీయులకు 2:9). ఆ విధముగా ఆయన ధర్మశాస్త్రము యొక్క శాపము (మరణము) నుండి అందరిని విమోచించి దాని స్థానములో నిత్యజీవమును అందించెను.

3. కొలొస్సయులకు 2:14-17 మరియు ఎఫెసీయులకు 2:15 వచనములు దేవుని ధర్మ శాస్త్రము సిలువలో కొట్టివేయబడెనని బోధించుట లేదా?

జవాబు : లేదు. ఈ రెండు వాక్యములు, "ఆచారములు" మరియు బల్యర్పణలకు సంబంధించిన పద్ధతులను, యాజకత్వమును, మరియు ఛాయారూపకమైన "మోషే ధర్మశాస్త్రమును" ("విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్రమును") సూచించుచున్నవి. ఈ ఆచారములు మరియు కర్మకాండలన్నియు దేవుడు ఉద్దేశించిన విధముగా సిలువకు ఛాయారూపకమైయుండి, క్రీస్తు మరణమందు కొట్టివేయబడెను. మోషే ధర్మశాస్త్రము వాగ్దానము చేయబడిన "సంతానము వచ్చువరకు" యియ్యబడెను. "ఆ సంతానము క్రీస్తు" (గలతీయులకు 3:19, 16). దేవుని నీతి ధర్మశాస్త్రమును ఇక్కడ చేర్చకూడదు. ఏలయనగా, సిలువయాగము జరిగిన అనేక సంవత్సరాలకు కూడ దేవుని నీతి ధర్మశాస్త్రమును గూర్చి పౌలు మాట్లాడుచు అది “పరిశుద్ధమైనదియు నీతిగలదియు ఉత్తమమైనదియునై” యున్నదని చెప్పెను (రోమీయులకు 7:7,12).

4. "ప్రేమ కలిగియుండుట ధర్మ శాస్త్రమును నెరవేర్చుటయే" అని బైబిలు చెప్పుచున్నది (రోమీయులకు 13: 10). మత్తయి 22:37-40 వచనములు మనము దేవునిని మరియు మన పొరుగువారిని ప్రేమింపవలెనని ఆజ్ఞాపించుచున్నవి మరియు "ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవి" అను మాటలతో ముగియబడుచున్నవి. ఈ రెండు ఆజ్ఞలు పది ఆజ్ఞలకు బదులుగా ఇయ్యబడలేదా?

జవాబు : లేదు. మన చేతి పది వేళ్లకు రెండు చేతులు ఆధారమైనట్టుగా, పది ఆజ్ఞలకు ఈ రెండు ఆజ్ఞలు ఆధారమైయున్నవి. వాటిని విడదీయలేము. దేవునిని ప్రేమింపవలెనను ఆజ్ఞలో సంతోషముగా గైకొనుటకు (దేవునికి సంబంధించిన) మొదటి నాలుగు ఆజ్ఞలు సంక్షిప్తము చేయబడినవి, మరియు పొరుగు వానిని ప్రేమింపవలెనను ఆజ్ఞలో (మన సాటివారిని శ్రద్ధతో ప్రేమించుటకు) చివరి ఆరు ఆజ్ఞలు సంక్షిప్తము చేయబడినవి. భారముగా కాక ధర్మశాస్త్రమును గైకొనుట ఎంతో సంతోషముగా భావించే ప్రేమ ధర్మశాస్త్రమును నెరవేర్చును (కీర్తనలు 40:8). మనము ఒక వ్యక్తిని నిజముగా ప్రేమించిన యెడల, ఆ వ్యక్తి మనవులను (అభ్యర్థనలను) గౌరవించుట మనకు సంతోషమగును. “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు” అని యేసు ప్రభువు చెప్పెను (యోహాను 14:15). దేవునిని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను గైకొనకపోవుట అసాధ్యము. ఎందుకనగా, “మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు” అని బైబిలు చెప్పుచున్నది (1 యోహాను 5:3). "ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు" (1 యోహాను 2:4).

5. 2 కొరింథీయులకు 3:7 రాతి మీద చెక్కబడిన ధర్మశాస్త్రము తగ్గిపోవునదైనట్టుగా” వున్నదని బోధించుట లేదా?

జవాబు : లేదు వాక్యము మోషే ధర్మశాస్త్ర పరిచర్య యొక్క "మహిమ" తగ్గిపోవునదైనట్టుగా మాట్లాడుచున్నదే గాని పది ఆజ్ఞల ధర్మశాస్త్రము కాదు. 2 కొరింథీయులకు 3:3-9 వచనములను మరొకసారి జాగ్రత్తగా చదువుము. అక్కడ విషయము ధర్మశాస్త్రము లేదా దాని స్థాపన కొట్టివేయబడుట కాదు, అక్కడ ప్రధానాంశము ధర్మశాస్త్రమును "రాతి పలకల" మీద నుండి "హృదయమనే పలక" మీదికి మార్చుట, మోషే యొక్క పరిచర్య క్రింద ధర్మశాస్త్రము రాతి పలకల మీద ఉండెను. క్రీస్తు ద్వారా దేవుని పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య క్రింద ధర్మశాస్త్రము హృదయమనే పలక మీద వ్రాయబడినది (హెబ్రీయులకు 8:10). ఒక పాఠశాలలోని నోటీసు బోర్డుపై అంటించిన నియమము విద్యార్ధి యొక్క హృదయములో ప్రవేశించినప్పుడే అది ప్రభావితమగును. అదే విధముగా, క్రైస్తవునికి దేవుని ధర్మశాస్త్రమును పాటించుట ఆనందకరమైన మరియు సంతోషకరమైన జీవన విధానమగును ఎందుకనగా అతడు దేవుని పట్ల మరియు సాటి మనిషి పట్ల నిజమైన ప్రేమను కలిగియున్నాడు.

6. "క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తియై యున్నాడు" అని రోమీయులకు 10:4 చెప్పుచున్నది. కనుక ధర్మశాస్త్రము సమాప్తమైనది, కాలేదా?

జవాబు : ఈ వచనములోని "సమాప్తము" అనే మాట ఒక ఉద్దేశ్యమును లేక గురిని వెల్లడిపరచుచున్నది. దీని భావము స్పష్టముగా ఉన్నది. మనుష్యులు నీతిని కనుగొనుటకు క్రీస్తు నొద్దకు నడిపించబదుటయే ఆ గురి, ఉద్దేశ్యము లేక ధర్మశాస్త్రము యొక్క సమాప్తి.

7. నేటికిని ఆచరింపబద్ధమైన దేవుని ధర్మశాస్త్ర విధులను (పది ఆజ్ఞలను) అనేకమంది ప్రజలు ఎందుకు త్రోసిపుచ్చుచున్నారు?

జవాబు : “ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్న యెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీరస్వభావము గలవారు కారు” (రోమీయులకు 8:7-9).

8. పాత నిబంధనలోని నీతిమంతులుగా తీర్చబడిన ప్రజలు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా రక్షింపబడియున్నారా?

జవాబు : ఇంతవరకు ఎవరును ధర్మశాస్త్ర క్రియల మూలముగా రక్షింపబడలేదు. యుగయుగాలుగా రక్షించబడిన వారందరు కృప చేతనే రక్షింపబడిరి. ఈ కృప "అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడెను" (2 తిమోతి 19). ధర్మశాస్త్రము పాపమును మాత్రమే ఎత్తి చూపించును. క్రీస్తు మాత్రమే మనలను రక్షించగలడు. నోవహు "కృప పొందినవాడాయెను" (ఆదికాండము 6:8); మోషే కృప పొందెను (నిర్గమకాండము 33:17); ఇశ్రాయేలీయులు అరణ్యములో కృప పొందిరి (యిర్మీయా 31:2); అంతేకాక, హేబెలు, హనోకు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, మరియు ఘనత వహించిన అనేకమంది పాత నిబంధన వ్యక్తులు హెబ్రీయులకు 11వ అధ్యాయము ప్రకారము "విశ్వాస మూలముగానే" రక్షింపబడిరి. వారు రాబోవు సిలువ వైపు ముందుకు చూచుట ద్వారా రక్షింపబడిరి, మనము సిలువ వైపుకు తిరిగి చూచుట ద్వారా రక్షింపబడుచున్నాము. ధర్మశాస్త్రము మనకు అవసరము, ఎందుకనగా అది ఒక అద్దమువలె మన జీవితములలోని "మురికిని" (పాపమును) ఎత్తి చూపించును. ధర్మశాస్త్రము లేని యెడల, ప్రజలు పాపులుగా ఉన్నను, అది వారికి తెలియకపోవును. అయినను ధర్మశాస్త్రమునకు రక్షించే శక్తి లేదు. అది పాపమును ఎత్తి మాత్రమే చూపించగలదు. యేసు ప్రభువు మాత్రమే ఒక వ్యక్తిని పాపము నుండి రక్షించగలడు. ఇది ఎప్పటికి నిజమైయున్నది పాత నిబంధన కాలములలో సహితము (అపొస్తలుల కార్యములు 4:10, 12; 2 తిమోతి 1:9).

9. ధర్మశాస్త్రము గురించి చింత ఎందుకు? ఒకని మనస్సాక్షియే తనకు సురక్షిత మార్గదర్శి కాదా?

జవాబు : లేదు! దుష్ట మనస్సాక్షి, అపవిత్రమైన మనస్సాక్షి, మరియు వాత వేయబడిన (మూర్ఖమైన) మనస్సాక్షిని గూర్చి బైబిలు మాట్లాడుచున్నది - వీటిలో ఏదియు సురక్షితము కాదు. "ఒకని యెదుట సరియైనదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవతీయును" (సామెతలు 14:12). "తన మనస్సును నమ్ముకొనువాడు బుద్ధిహీనుడు" అని దేవుడు చెప్పుచున్నాడు (సామెతలు 28:26).

సారాంశ పత్రము

ఈ సారాంశ పత్రమును పూర్తి చేయక ముందు దయచేసి పఠన మార్గదర్శి (స్టడీ గైడ్) పత్రికను చదవండి. క్రింద ఇయ్యబడిన ప్రశ్నలన్నిటికి ఈ పత్రికలో సమాధానములున్నవి. సరియైన సమాధానము మీద ఒక గుర్తు (✔) పెట్టండి. సరియైన జవాబుల సంఖ్య ప్రతి ప్రశ్నకు ఎదురుగా ఉన్న బ్రాకెట్లలో (1) ఇయ్యబడినది.

1) పది ఆజ్ఞలు వ్రాసినది (1)

( ) దేవుడు.

( ) మోషే.

( ) ఎవరో ఒక తెలియని వ్యక్తి.

2) బైబిలు ప్రకారము, పాపమనగా (1)

( ) ఒక వ్యక్తిగత లోపము.

( ) దేవుని ధర్మశాస్త్రమును (ఆజ్ఞను) అతిక్రమించుట.

( ) తప్పనిపించిన ప్రతీది పాపమే.

3) దేవుని ధర్మశాస్త్రమును గూర్చి సత్యమును తెలియజేయు వాక్యములను గుర్తించుము : (4)

( ) సంతోషకరమైన జీవనమునకు అది ఒక పరిపూర్ణ మార్గదర్శి.

( ) ఒక అద్దమువలె, అది పాపమును ఎత్తిచూపును.

( ) అది భారమైనదియు మరియు బాధించునది.

( ) అది నన్ను దుష్టత్వము నుండి సంరక్షించగలదు.

( ) దేవునికున్న అవే స్వభావములు దానికున్నవి.

( ) అది క్రొత్త నిబంధనలో కొట్టివేయబడెను.

( ) అది ఒక శాపము.

4) దేవుని పది ఆజ్ఞల ధర్మశాస్త్రము (1)

( ) పాత నిబంధన కాలములకు మాత్రమే పరిమితమైనది.

( ) సిలువలో యేసు ప్రభువు చేత కొట్టివేయబడెను.

( ) అది ఎన్నటికి మార్చబడనిది (మార్పులేనిది).

5) తీర్పు దినమందు నేను రక్షింపబడునది (1)

( ) గొప్ప పుణ్యకార్యములు చేయుట ద్వారా.

( ) పది ఆజ్ఞలను పాటించినా పాటించకపోయినా, ప్రభువును ప్రేమించుట ద్వారా.

( ) ఆయన ఆజ్ఞలన్నిటికి విధేయత చూపుటకు నేను యేసు ప్రభువుతో వ్యక్తిగత ప్రేమ సంబంధమును ఏర్పరచుకొనుట ద్వారా.

6) ప్రజలు రక్షింపబడునది (1)

( ) ధర్మశాస్త్రమును పాటించుట ద్వారా.

( ) ధర్మశాస్త్రమును అతిక్రమించుట ద్వారా.

( ) యేసుక్రీస్తు ద్వారా మాత్రమే.

7) పరిపూర్ణముగా మారుమనస్సు నొందిన క్రైస్తవులు (1)

( ) క్రీస్తు ఇచ్చు శక్తి ద్వారా దేవుని ధర్మశాస్త్రమును గైకొందురు.

( ) ధర్మశాస్త్రము కొట్టివేయబడెను గనుక దానిని తిరస్కరించెదరు.

( ) ఆజ్ఞలు గైకొనుట అనవసరమని భావించెదరు .

8) కృప క్రింద జీవించుచున్న వ్యక్తి (1)

( ) పాపము చేయకుండ పది ఆజ్ఞలను మీరగలడు.

( ) ధర్మశాస్త్రమును పాటించకుండ ఉండుటకు స్వతంత్రుడు.

( ) సంతోషముతో దేవుని ఆజ్ఞలను గైకొనును.

9) ప్రేమ ధర్మశాస్త్రమును నెరవేర్చును ఎందుకనగా (1)

( ) ప్రేమ ధర్మశాస్త్రమును నిరర్థకము చేయును.

( ) దేవుని యెడల మరియు సాటి మనుష్యుల యెడల చూపు నిజమైన ప్రేమ ధర్మశాస్త్రమును గైకొనుటను సంతోషకరముగా మార్చును.

( ) విధేయత కంటే ప్రేమే ముఖ్యము.

10) మోషే ధర్మశాస్త్రములో ఉన్నది (1)

( ) దేవుని ధర్మశాస్త్రములో ఉన్న కట్టడలే.

( ) క్రీస్తుకు ఛాయారూపకముగా సూచించి, సిలువలో కొట్టివేయబడిన ఆచారములు మరియు బలి అర్పణలతో కూడిన ధర్మశాస్త్రము.

( ) శాశ్వతముగా ఆచరించుటకు నియమము.

11) పది ఆజ్ఞలకు విధేయత చూపు ప్రజలు (1)

( ) క్రియల ద్వారా రక్షణ అను సిద్ధాంతమును నమ్మువారు.

( ) దేవునిని మరియు ఆయన ధర్మశాస్త్రమును ద్వేషించు అపవాది చేత వ్యతిరేకించబడుదురు.

( ) ధర్మశాస్త్రమును గైకొనుట ద్వారానే రక్షింపబడుదురు.

12) క్రీస్తుకు మరియు ధర్మశాస్త్రమునకున్న సంబంధమును తెలియజేయు సత్యమైన వాక్యములను గుర్తించుము : (4)

( ) యేసు ప్రభువు ధర్మశాస్త్రమును అతిక్రమించెను.

( ) ధర్మశాస్త్రమును గైకొనుటకు యేసు ప్రభువు పరిపూర్ణ మానవ మాదిరి.

( ) యేసు ప్రభువు ధర్మశాస్త్రమును రద్దుపరచెను.

( ) యేసు ప్రభువు, “మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు” అని చెప్పెను.

( ) యేసు ప్రభువు, ధర్మశాస్త్రమును ఘనపరచి అందులో పాపమునకు సంబంధించిన అన్ని అంశములున్నవని చూపించెను.

( ) యేసు ప్రభువు, ధర్మశాస్త్రము ఎన్నటికీ మార్చబడదని (మార్పులేనిదని) చెప్పెను.

13) ఒక నిజమైన క్రైస్తవుడు దేవుని పది ఆజ్ఞలకు సంతోషముతో విధేయత చూపునని నేను నమ్ముచున్నాను, మరియు వాటికి అనుగుణముగా నా జీవితమును మార్చుకొనుటకు తగిన శక్తిని ప్రసాదించుమని నేను యేసు ప్రభువును అడుగుదును.

( ) అవును.

( ) కాదు.